భాగ్యనగరానికి మరో మణిహారం..!
హైదరాబాద్లో రూ.150 కోట్లతో భారీ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్
ముందుకొచ్చిన చెన్నై సంస్థ... సీఎస్ అనుమతికోసం ఫైల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరనుంది. నగరంలో అంతర్జాతీయ స్థాయిలో భారీ మల్టీప్లెక్స్ ప్రాజెక్టు రూపొందనుంది. హుస్సేన్సాగర తీరాన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో గతంలో రూపొందిన ప్రసాద్ ఐమాక్స్ను మించిన హంగులతో దీన్ని నిర్మించేందుకు పర్యాటక శాఖ ప్రణాళిక రూపొందించింది. లోయర్ట్యాంక్బండ్లో ఇందిరాపార్కు పక్కన రెండెకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. చెన్నైకు చెందిన ఓ ప్రముఖ థియేటర్స్ గ్రూపు సంస్థ రూ. 150 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దాదాపు ఏడు అంతస్తుల భవన సముదాయంలో ఓ బిగ్ స్క్రీన్ సహా ఐదు థియేటర్లు ఉంటాయి.
వీటితోపాటు ఫుడ్ కోర్టులు, పిల్లల గేమింగ్ జోన్, ఇతర రిక్రియేషన్ సెంటర్లు ఉంటాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవగా చెన్నైకు చెందిన సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసింది. రెండు రోజుల క్రితమే టెక్నికల్ బిడ్ తె రిచిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ.. ఒకే బిడ్ దాఖలు కావటంతో దానిని ఆమోదించే విషయంలో అధికారులు తటపటాయిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు బిడ్ దాఖలు చేసిన సంస్థ చెన్నైలో దాదాపు 50 వరకు థియేటర్లను అద్భుతంగా నిర్వహిన్నందున దానిని పీపీపీలో కలుపుకోవటం వల్ల హైదరాబాద్ ప్రాజెక్టు మెరుగ్గా రూపొందుతుందని అధికారులు పేర్కొం టున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందుంచాలని నిర్ణయించారు. అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాతే ఫైనాన్షియల్ బిడ్ తెరవాలని భావిస్తున్నారు.
పర్యాటక శాఖకు భారీ ఆఫర్..
చెన్నై సంస్థకు ఈ ప్రాజెక్టును అప్పగిస్తే ఆర్థికంగా పర్యాటక శాఖకు భారీ ఆఫర్నే ప్రకటించినట్టు తెలుస్తోంది. అడిషనల్ డెవలప్మెంట్ ప్రీమియంగా రూ. 1.48 కోట్లు, లీజ్ రెంట్గా రూ. 1.78 కోట్లతోపాటు లాభాలపై 5.4 శాతం వాటా ఇచ్చేందుకు ఆ సంస్థ సిద్ధపడిందని అధికారులు పేర్కొంటున్నారు. కేవలం లాభాలలో వాటా ద్వారానే ప్రతి నెలా రూ. 10 లక్షలు మించి వచ్చిపడే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఇది లాభదాయకమైన ప్రాజెక్టు అయినందున వీలైనంత వరకు సీఎస్తో ఆమోదముద్ర వేయించుకోవాలని భావిస్తున్నారు.