Mumbai roads
-
రిమ్జిమ్ గిరే సావన్.. ఒక జంట.. ఒక వాన.. ఒక పాట..
వానొస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు? కిటికీలో నుంచి చూస్తారు. బయటకెళ్లకండి అని భార్య అంటుంది. టీ పెట్టమని భర్త అంటాడు. కాని ముంబైకి చెందిన శైలేష్, వందన అనే భార్యాభర్తలు మాత్రం ముంబై రోడ్ల మీద తడవడానికి బయలుదేరారు. ఒకప్పటి‘మంజిల్’ సినిమాలో ‘రిమ్జిమ్ గిరే సావన్’ హిట్ పాటలో ఎలాగైతే అమితాబ్, మౌసమీ చటర్జీ తడుస్తూ తిరిగారో అచ్చు అలాగే తిరిగారు. పాటను షూట్ చేసి వదిలితే వైరలే వైరలు. ఒక జంట. ఒక వాన. ఒక పాట. గతం మళ్లీ వర్తమానం అయ్యింది. నిజ పాత్రలు నటీనటులు అయ్యారు. ముంబై నగర వీధుల్లో ఒక సుందర దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. చూసిన ప్రేక్షకులు మురిసిపోయారు. ఆనంద్ మహీంద్ర అంతటి వాడు ట్వీట్ చేసి మెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ లక్షల మంది వీక్షించారు. ఇంతకూ ఏమిటది? రిమ్జిమ్ గిరె సావన్ పాట. రీమేక్ పాట. మంజిల్ సినిమా నుంచి అమితాబ్, మౌసమీ చటర్జీ నటించిన ‘మంజిల్’ (1979) సినిమాకు దర్శకుడు బాసూ చటర్జీ. సినిమా ఓ మోస్తరుగా ఆడినా ‘రిమ్జిమ్ గిరె సావన్’ పాట పెద్ద హిట్. కిశోర్ కుమార్ వెర్షన్, లతా వెర్షన్ ఉంటాయి. లతా వెర్షన్‌ను బాసూ చటర్జీ నిజమైన వర్షంలో తీయాలనుకున్నాడు. ముంబైలో వాన కురుస్తున్న రోజు ఒక చిన్న యూనిట్‌ను పెట్టుకుని సూట్లో ఉన్న అమితాబ్‌ను, చీరలో ఉన్న మౌసమీ చటర్జీని రోడ్ల మీద నడిపిస్తూ పిక్చరైజ్ చేశాడు. ఈ పాట పెద్ద హిట్. సేమ్ ఇదే పాటను ఇన్నేళ్ల తర్వాత ఈ జంట మళ్లీ అభినయించింది. వారి పేర్లు శైలేష్, వందన ముంబైలోని థానేలో నివసించే శైలేష్, వందనలకు పెళ్లయ్యి 26 ఏళ్లు. ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, ఇష్టం. ఈ ఇష్టం ఒక వానరోజున రికార్డు చేద్దామని, అదీ రిమ్జిమ్ గిరే సావన్ పాటలా ఉండాలని శైలేష్ కోరిక. భార్య దగ్గర ఎప్పుడు ప్రస్తావన తెచ్చినా ఆమె సిగ్గుతో ‘నేను చేయనండీ’ అనేది. శైలేష్ పట్టు వీడక ఈ సంగతి తన స్నేహితుడు అనుప్ రింగాన్గవాకర్కు చెప్పాడు. అనుప్ భార్య అంకిత ఇది విని ఉత్సాహపడింది. వాళ్లిద్దరినీ మనిద్దరం వానలో షూట్ చేద్దాం అని చెప్పింది. ఇంకేముంది శైలేష్ అచ్చు మంజిల్ సినిమాలోని సూట్ లాంటిది కుట్టించుకున్నాడు. వందన అలాంటి చీరలోనే నిరాడంబరంగా తయారైంది. మొన్న మొదలైన వానల్లో ఒకరోజు మొత్తం పాటను సేమ్ అవే లొకేషన్లలో తీశారు. పెద్ద హిట్ పాత పాట ఎంత హిట్టో ఈ పాట అంతే హిట్ అయ్యింది. ‘మేము ఇంత రెస్పాన్స్ ఊహించలేదు’ అని శైలేష్ అన్నాడు. ‘మా లొకాలిటీలో మేము సెలబ్రిటీలం అయిపోయాం’ అని చెప్పాడు. దేశవిదేశాల్లో ఈ వీడియోకు ఆదరణ లభించింది. ‘మనసుండాలి గాని ప్రతి సందర్భాన్ని ఆనందమయం చేసుకోవచ్చు’ అని చాలా మంది మెచ్చుకున్నారు. ఈ జంటను చాలామంది డిన్నర్‌కు పిలుస్తున్నారు. అన్నట్టు ‘మంజిల్’ కోసం ఈ పాటను నిజమైన వానలో తీసేప్పుడు అమితాబ్ నడకను అందుకోవడానికి మౌసమీ చటర్జీ పరుగులు తీయాల్సి వచ్చేది. అమితాబ్ కాళ్లు పొడవు కదా. ‘చాలాసార్లు ఆయన మెల్లగా నడిచి బేలెన్స్ చేసేవాడు. షూటింగ్ కోసం చాలాసేపు చీర నానడం వల్ల ఇంటికొచ్చాక దాని రంగు నా ఒంటి మీద అంటుకుపోయింది. వానలో పాట మాకు ఏమీ వినిపించేది కాదు. దూరం నుంచి డైరెక్టర్ కర్చీఫ్ ఆడిస్తే యాక్షన్ అని, మళ్లీ ఆడిస్తే కట్ అని భావించే నటించాం’ అని మౌసమీ చటర్జీ గుర్తు చేసుకుంది. వానలు మనకు అంతగా పడట్లేదు. పడినప్పుడు ఈ పాట చూడండి. -
ప్రతి ఆదివారం ఈ రోడ్లకు సెలవు.. నేటి నుంచే అమలు!
సాక్షి ముంబై: నిత్యం వాహనాల రద్దీతో సతమతమయ్యే పాదచారులకు కొంత ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇకపై ప్రతి ఆదివారం ముంబైలోని 13 రోడ్లపై వాహనాల రాకపోకలను మూసివేసి ఆ రోడ్లకు సెల వు ప్రకటించనున్నారు. మార్చి27 ఆదివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో నేడు ముంబైలోని 13 రోడ్లను వాహనాలు తిరగకుండా మూసివేయనున్నారు. ప్రతి రోజూ వాహనాల రద్దీ తో సతమతమయ్యే పాదచారులకు కాస్త వెసులుబాటు కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 13 రోడ్లపై ఉదయం 8 గంటల నుంచి 11 గం టల వరకు వాహనాలను అనుమతించరు. ఈ విషయంపై ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ రాజ్వర్ధన్ సిన్హా మాట్లాడుతూ, రోడ్లను వాహనాల రాకపోకలకు మూసివేసి, కేవలం పాదచారుల కోసం మాత్ర మే తెరిచి ఉంచుతామన్నారు. అదేవిధంగా వాహనాల కోసం ప్రత్యామ్నాయ దారుల్ని కేటాయించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రోడ్లపై ఆదివారం పిల్లలు ఆటలాడుకోవచ్చని, సీనియర్ సిటిజన్లు వ్యాహ్యాళికి వెళ్ళ వచ్చనీ, సైక్లింగ్, యోగా, వ్యాయామం లాంటివి రోడ్ల మీదనే చేసుకోవచ్చన్నారు. ఇక ఈ నిర్ణయంపై ముంబైకర్ల స్పందనను బట్టి మరిన్ని రోడ్లను ఆదివారం మూసివేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. చదవండి: కనువిందు చేసే ట్రెక్కింగ్.. వణుకుపుట్టించే చరిత్ర కొత్త ప్రతిపాదనేం కాదు... నిర్ధారిత సమయాల్లో ప్రధాన రహదారులని మూసివేసే ప్రక్రియ బొగోటా, కొలంబియా లాంటి దేశాల్లో 1974 నుంచే అమలులో ఉంది. ఇందుకోసం ఆ దేశాల్లో ఉద్యమమే జరిగింది. ప్రజల సౌకర్యంకోసం కొన్ని కిలోమీటర్ల వరకు రోడ్లను వాహనాల కోసం మూసి ఉంచుతారు. ఆ దేశాలను స్ఫూర్తిగా తీసుకుని మన దేశంలో కూడా పలు ప్రాంతాల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. నగర ప్రాముఖ్యత కలిగిన రోడ్లను వాహన కాలుష్యం లేకుండా, ప్రజల కోసం తెరిచి ఉంచడం వల్ల పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. వాహనాల కోసం మూసివేసిన ఈ రోడ్లపై నడవడం, స్నేహితులతో కలిసి పిచ్చాపాటి మాట్లాడుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. -
బిచ్చమెత్తుకుంటున్న హీరోయిన్
ముంబై: హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాలని ఇంట్లో వాళ్లను సైతం లెక్కచేయకుండా ముంబై బాటపడుతున్న అమ్మాయిల విషాద గాథల్లో మరో నటి ఉదంతం తాజాగా వెలుగుచూసింది. వెండి వెలుగుల జాబిలిగా వెలిగిపోవాలన్న కలలు ఆవిరైపోవడంతో కొందరు ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తుండగా..మరి కొందరు మానసిక స్థిమితాన్ని కోల్పోయి, దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఓ భోజ్ పురి చిత్రంలో హీరోయిన్ గా నటించిన మిథాలి శర్మ (25)దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే కొట్టుమిట్టాడుతూ.. మతి స్థిమితం కోల్పోయి ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ పోలీసుల కంటపడింది. ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మ సినిమాలమీద ఆసక్తితో ముంబైకి మకాం మార్చింది. మోడల్ గా కరియర్ స్టార్ట్ చేసింది. ఎట్టకేలకు భోజ్‌పురీ చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో హీరోయిన్గా నటించే అవకాశాలు రాలేదు. అటు సినిమాల్లో నిలదొక్కుకోలేక ఇటు తల్లిదండ్రులకు ముఖం చూపించలేక మిథాలీ జీవితం దుర్భరంగా మారింది. దీంతో ముంబైలోని లొకండ్ వాలా వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బతుకుతోంది. ఈక్రమంలో ఒష్విరా హౌసింగ్ సొసైటీలో ఆగి ఉన్న ఒక కారు అద్దాలను పగుల కొడుతుండగా ఆమెను మహిళా పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆమె మానసిక స్థితి బాగాలేదని, ఆమె కుటుంబ సభ్యల వద్దకు చేర్చడానికి ప్రయత్నిస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి సుభాష్ చెప్పారు. ఆమె కోలుకోవడానికి , తిరిగిసాధారణ స్థితికి చేరడానికి కనీసం పది రోజులు పడుతుందని మిథాలీకి చికిత్సం అందిస్తున్న మానసిక వైద్యులు తెలిపారు.