‘జరిమానా’ సొమ్ములో సగం మాకివ్వండి..
ప్రభుత్వానికి ట్రాఫిక్ విభాగం విజ్ఞప్తి
సాక్షి, ముంబై : తమ విభాగం గత ఏడాది వాహనదారుల నుంచి వసూలు చేసిన సొమ్ములో సగం డబ్బును తమకు ఇవ్వాల్సిందిగా ట్రాఫిక్ విభాగం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసింది. గత ఏడాది ముంబై ట్రాఫిక్ విభాగం దాదాపు రూ. 20 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేసింది.
ఇందులో సగం డబ్బు తమకు ఇస్తే బ్రీత్ అనలైజర్లు, స్పీడ్గన్లు, క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ (సీసీటీవీ) తదితర మెరుగైన సౌకర్యాలను సమకూర్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ట్రాఫిక్ విభాగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిని పరీక్షించేందుకు సరిపడినంత పరికరాలు కొరవడ్డాయన్నారు. గత ఏడాది ట్రాఫిక్ విభాగం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 16 బ్రీత్ అనలైజర్లను అందుకుంది. అవేకాకుండా మొత్తంగా 90 బ్రీత్ అనలైజర్లు ఉన్నాయనీ, అయితే ఇవి సరిపడినంతగా లేవని అధికారి తెలిపారు.
ఒకవేళ ప్రభుత్వం ‘జరిమానా’ సొమ్ములో సగం తమ విభాగానికి బదలాయించేందుకు అంగీకరిస్తే, తాము నిబంధనలను మరింత కఠినంగా అమలుచేసి ఆదాయం పెంపునకు కృషిచేసేందుకు వీలుపడుతుందని ట్రాఫిక్ విభాగ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డాక్టర్.బి.కె.ఉపాధ్యాయ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనకు అనుమతి లభిస్తే ట్రాఫిక్ విభాగానికి ఎంతో లాభపడుతోందన్నారు. ఇతర నిధులను ఆశించకుండా ఉండేందుకు ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ట్రాఫిక్‌ను పర్యవేక్షించేందుకు తమకు అత్యవసరంగా చాలా పరికరాలు అవసరం ఉంటాయని ఆయన వివరించారు.
ఈ-చలాన్‌తో ‘ట్రాఫిక్’కు పనిభారం
కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-చలాన్ వ్యవస్థ ట్రాఫిక్ విభాగానికి మరింత పని భారాన్ని తెచ్చిపెట్టింది. నవీముంబై ట్రాఫిక్ విభాగం రాష్ట్రంలోనే మొదటిసారిగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు ఈ-చలాన్ వ్యవస్థను గత ఏడాది ప్రారంభించింది. అయితే ట్రాఫిక్ విభాగం సమయం ఆదా చేసేందుకు ఈ-చలాన్ వ్యవస్థను ప్రారంభించినప్పుటీ తమకు పని భారం ఎక్కువవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. నగరంలో 15 ట్రాఫిక్ యూనిట్లు ఉన్నాయి. వీటికి ఈ-చలాన్ పరికరాన్ని అందజేశారు.
30 మంది ట్రాఫిక్ సిబ్బందికి ఈ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో శిక్షణ కూడా ఇచ్చారు. కొత్త ఈ-చలాన్ వ్యవస్థలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారి పూర్తి సమచారాన్ని ఘటనా స్థలంలోనే ఫీడ్ చేసి ప్రింట్ అవుట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఒకోసారి కొత్త ఈ-చలాన్ వ్యవస్థ పనిచేయకుంటే తిరిగి వీరి వివరాలను మాన్యువల్‌గానే చేయాల్సి ఉంటుందని తెలిపారు.
దీంతో కొత్త ఈ-చలాన్ వ్యవస్థలో వాహనదారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండడంతో ఇది కొంత మేర సులభంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి ఈ పరికరాలు పని చేయకుంటే పాత వ్యవస్థనే ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో దీనిని తీసివేయవద్దని ట్రాఫిక్ విభాగం కోరుతోంది. అయితే ఒక వేళ ట్రాఫిక్ పోలీసులు ఒకేసారి 20 మంది వాహన దారులను పట్టుకున్నట్లుయితే వీరి వివరాలను వేర్వేరు రిజిస్టర్లలో నమోదు చేయాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీస్ తెలిపారు. దీంతో తమకు మరింత పని భారం పెరుగుతోందని ట్రాఫిక్ అధికారి తెలిపారు.