Municipal Development Project
-
నిర్మాణాత్మక వ్యవస్థతో ‘పారదర్శక’ సేవలు
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, సమస్యల సత్వర పరిష్కారంపై దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి దీర్ఘకాలంలో నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి పెట్టామని చెప్పారు. ఇందుకోసం ‘ఏపీ సీఎం ఎంఎస్’ (ఏపీ కన్సిస్టెంట్ మానిటరింగ్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్) పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. నెల రోజుల్లో సిద్ధమయ్యే ఈ యాప్ ద్వారా నగరాలు, పట్టణాల్లో ఎవరైనా సరే రోడ్ల సంబంధిత సమస్యలపై ఫొటో తీసి అప్లోడ్ చేయగానే, నిర్దిష్ట వ్యవధిలోగా మరమ్మతులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరాలు, పట్టాణాల్లోని సమస్యలపై రియల్ టైం మానిటరింగ్ ద్వారా దృష్టి సారించాలని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నగరాలు, పట్టణాల్లోని ప్రజలకు అవసరమైన సేవలు సత్వరం అందాలి. ఆయా విభాగాల అధికారులు నిర్దేశిత సమయంలోగా అనుమతులు మంజూరు చేయాలి. అన్ని సేవలు త్వరితగతిన అందేలా పాలనలో మార్పులు తీసుకురావాలి. ప్లాన్ అప్రూవల్ తదితర ప్రజా సేవలు సత్వరమే అందించడం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్లపై నిశితంగా సమీక్షించి, తగిన ప్రణాళికను రూపొందించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వార్డుల్లో రోజూ 2 గంటలు తనిఖీలు ► రాష్ట్రంలోని 4,119 వార్డు సచివాలయాల పరిధిలో మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. వార్డు సెక్రటరీలు తమ పరిధిలో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ ప్రజా సమస్యలపై తనిఖీలు చేపట్టాలి. తమ పరిధిలోని సుమారు 6– 7 కి.మీ మేర రోడ్లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ► తమ పరిధిలో రోడ్లు ఎలా ఉన్నాయి.. గుంతలు, కంకర కొట్టుకు పోవడం, పచ్చదనం తదితర వాటిని పరిశీలించడంతో పాటు వీధి లైట్లు, పుట్‌పాత్‌లు, ట్రాఫిక్ జంక్షన్ల పని తీరునూ గమనించాలి. వార్డు సచివాలయ పరిధిలో ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే ఫొటో తీసి యాప్‌లో అప్ లోడ్ చేయడం ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి వెళుతుంది. ► సిబ్బంది మాత్రమే కాకుండా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సామాన్య ప్రజలు కూడా తమ దృష్టికి వచ్చిన ఈ సమస్యలను యాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. ► యాప్ ద్వారా అందిన సమస్యలు సంబంధిత విభాగాలకు వెళ్లగానే నిర్ణీత వ్యవధిలోగా వాటిని పరిష్కరించాలి. అందుకు అనగుణంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. నివేదించిన ప్రతి సమస్య పరిష్కారంపై ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. గ్రామాలకు ఇదే తరహా యాప్ ►నగరాలు, పట్టణాల్లో తీసుకువస్తున్న ఈ యాప్‌ను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలి. నగరాలు, పట్టణాల్లో రోడ్లు, మురుగునీటి కాల్వలు సహా.. ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి. వర్షాకాలం సహా అన్ని కాలాల్లోనూ బాగుండేలా మెరుగైన రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. దీర్ఘకాలం మన్నేలా రోడ్ల నిర్మాణం చేపట్టాలి. ► ఈ సమావేశంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ డాక్టర్ పి.సంపత్ కుమార్, ఏపీజీబీసీఎల్ ఎండీ బి.రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్ రాజమండ్రిలో 7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు నిర్మాణ ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కార్పొరేషన్ పరిధితో పాటు సమీపంలోని మరో 28 అర్బన్ లోకల్‌బాడీల నుంచి వచ్చే చెత్తను ఇక్కడ ప్రాసెస్ చేసేలా ప్లాంట్ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. -
AP: జగనన్న హరిత నగరాలకు శ్రీకారం
సాక్షి,అమరావతి: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలు పచ్చదనంతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం ‘జగనన్న హరిత నగరాలు’కు శ్రీకారం చుట్టింది. మంగళవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో దీనికి సంబంధించిన నమూనాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. అక్కడే జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు. తొలి విడతలో 45 పట్టణ స్థానిక సంస్థలను(యూఎల్బీ) జగనన్న హరిత నగరాలు కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. పచ్చదనం పెంపుతో పాటు వాల్ పెయింటింగ్ తదితర పనులు చేపట్టి.. ఉత్తమ విధానాలను అనుసరించిన 10 పట్టణాలు, నగరాలకు ‘గ్రీన్ సిటీ చాలెంజ్’ కింద రూ.కోటి చొప్పున రూ.10 కోట్లను బహుమతిగా ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖతో పాటు ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ సంస్థలు చేపట్టాయి. రూ.78.84 కోట్లతో పచ్చందం.. మొదటి విడతలో ఉన్న 45 యూఎల్బీల్లోని రోడ్లకు ఇరువైపులా, మధ్యనున్న మీడియన్స్‌లలో మొక్కలు నాటనున్నారు. ఆయా ప్రాంతాల్లోని మట్టి, వాతావరణం, నీటి వనరుల లభ్యత ఆధారంగా బతికే వివిధ జాతులకు చెందిన 54 రకాల మొక్కలను ఎంపిక చేసి పెంచనున్నారు. రహదారి వెడల్పును బట్టి ఐదు రకాలుగా విభజించి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పచ్చదనం, సుందరీకరణ పనులకు రూ.78.84 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. తొలకరి ప్రారంభం నుంచి ఆగస్టు 12లోగా ఈ పనులు పూర్తి చేయాలని ఆయా మునిసిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మొక్కలు నాటిన అనంతరం పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత పట్టణ స్థానిక సంస్థలకు అప్పగిస్తారు. అనంతరం ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్‌కు చెందిన క్వాలిటీ కంట్రోల్ బృందం 3 నెలలకు ఒకసారి పరిశీలించి.. మొక్కల సంరక్షణకు అవసరమైన సూచనలిస్తుంటుంది. సీఎం పర్యటన సాగిందిలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి.. గుంటూరు చుట్టుగుంట సెంటర్లోని సభావేదికకు చేరుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్లను, హర్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. మధ్యాహ్నం పల్నాడు జిల్లా కొండవీడుకు చేరుకుని జిందాల్ ప్లాంటు సమీపంలో ఏర్పాటు చేసిన ‘జగనన్న హరిత నగరాలు’ నమూనాను ఆవిష్కరించారు. ఆ తర్వాత జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు. -
కొత్తగా ఐదు తాగునీటి పథకాలు
ఏపీఎండీపీ మిగులు నిధులు రూ.300 కోట్లతో వీటి పనులు గజ్వేల్, మెదక్, కొల్లాపూర్, జమ్మికుంట, హుజురాబాద్ ఎంపిక ప్రపంచ బ్యాంకుకు తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలు హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఐదు భారీ తాగునీటి పథకాల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో చేపట్టిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు(ఏపీఎండీపీ)లోని మిగులు నిధులతో ఈ కొత్త పథకాలను నిర్మిం చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రం లోని నగరాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాను మెరుగు పరిచేందుకు 2010 జనవరిలో అప్పటి ప్రభుత్వం ఏపీఎండీపీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు రూ.1,670 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు మధ్య పరస్పర అంగీకార ఒప్పందం జరిగింది. అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలోని ఆరు పట్టణాలు, తెలంగాణలోని మూడు పట్టణాలను ఈ ప్రాజెక్టు కింద అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టులోని మిగులు నిధుల్లో తమ రాష్ట్ర వాటా రూ. 300 కోట్లతో మరో ఐదు తాగునీటి సరఫరా పథకాలు నిర్మిం చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాతి నిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాల్టీతో పాటు మెదక్, కొల్లాపూర్, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాల్టీలను అధికారులు ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపారు. ప్రాజెక్టుపై ప్రపంచ బ్యాంకు అసంతృప్తి.. ఏపీఎండీపీ కింద విజయనగరం, గుంటూరు, కాకినాడ, బద్వెల్, అనంతపురం, మార్కాపూర్, మణుగూరు, ఆర్మూరు, మాల్కాజిగిరి పట్టణాల్లో తాగునీటి సరఫరా పథకాల నిర్మాణాన్ని అప్పట్లో చేపట్టారు. నాలుగేళ్లు గడిచినా ఇంకా పనులు పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ప్రపంచ బ్యాంకు రూ.1,670 కోట్ల ఆర్థిక సాయం అందించడానికి ముందుకొస్తే ఇప్పటి వరకు రూ.80 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన పనుల్లో పురోగతి లేకపోవడంపై ప్రపంచ బ్యాంకు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధులిచ్చినా వినియోగించుకోలేరా అని ఘాటుగా స్పందించిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం మేరకు 2015 డిసెంబర్ 31 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సి ఉంది. గడువు ముగిసిపోతే నిధులు మురిగిపోయే ప్రమాదముంది. ఉమ్మడిగానే ఏపీఎండీపీ.. కాగా, రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఏపీఎండీపీ విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రపంచ బ్యాం కు ఆమోదంతో ప్రాజెక్టు విభజన చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.