కొత్తగా ఐదు తాగునీటి పథకాలు
ఏపీఎండీపీ మిగులు నిధులు రూ.300 కోట్లతో వీటి పనులు
గజ్వేల్, మెదక్, కొల్లాపూర్, జమ్మికుంట, హుజురాబాద్ ఎంపిక
ప్రపంచ బ్యాంకుకు తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఐదు భారీ తాగునీటి పథకాల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో చేపట్టిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు(ఏపీఎండీపీ)లోని మిగులు నిధులతో ఈ కొత్త పథకాలను నిర్మిం చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రం లోని నగరాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాను మెరుగు పరిచేందుకు 2010 జనవరిలో అప్పటి ప్రభుత్వం ఏపీఎండీపీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు రూ.1,670 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు మధ్య పరస్పర అంగీకార ఒప్పందం జరిగింది. అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలోని ఆరు పట్టణాలు, తెలంగాణలోని మూడు పట్టణాలను ఈ ప్రాజెక్టు కింద అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టులోని మిగులు నిధుల్లో తమ రాష్ట్ర వాటా రూ. 300 కోట్లతో మరో ఐదు తాగునీటి సరఫరా పథకాలు నిర్మిం చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాతి నిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాల్టీతో పాటు మెదక్, కొల్లాపూర్, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాల్టీలను అధికారులు ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపారు.
ప్రాజెక్టుపై ప్రపంచ బ్యాంకు అసంతృప్తి..
ఏపీఎండీపీ కింద విజయనగరం, గుంటూరు, కాకినాడ, బద్వెల్, అనంతపురం, మార్కాపూర్, మణుగూరు, ఆర్మూరు, మాల్కాజిగిరి పట్టణాల్లో తాగునీటి సరఫరా పథకాల నిర్మాణాన్ని అప్పట్లో చేపట్టారు. నాలుగేళ్లు గడిచినా ఇంకా పనులు పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ప్రపంచ బ్యాంకు రూ.1,670 కోట్ల ఆర్థిక సాయం అందించడానికి ముందుకొస్తే ఇప్పటి వరకు రూ.80 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన పనుల్లో పురోగతి లేకపోవడంపై ప్రపంచ బ్యాంకు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధులిచ్చినా వినియోగించుకోలేరా అని ఘాటుగా స్పందించిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం మేరకు 2015 డిసెంబర్ 31 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సి ఉంది. గడువు ముగిసిపోతే నిధులు మురిగిపోయే ప్రమాదముంది.
ఉమ్మడిగానే ఏపీఎండీపీ..
కాగా, రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఏపీఎండీపీ విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రపంచ బ్యాం కు ఆమోదంతో ప్రాజెక్టు విభజన చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.