'ఆంధ్రప్రదేశ్‌పై చాలా అంచనాలున్నాయి'
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ భవిష్యత్ కోసం స్పష్టమైన ప్రణాళికలు వేస్తున్నామని, తమకు ఏపీపై ఎన్నో కోరికలున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు వెల్లడించారు. ఇందుకోసం బీజేపీ జాతీయ నాయకత్వం వచ్చే రెండేళ్లలో ఇప్పుడున్న స్థితికంటే అనేక రెట్ల అధిక దృష్టిని కేంద్రీకరించబోతోందన్నారు. మార్చి 11 నుంచి దీనిపై కసరత్తు ప్రారంభిస్తామని తెలిపారు.
సోమవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్ తమ రాజకీయ భవిష్యత్‌తో ముడిపడి ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని, విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీకి రైల్వే జోన్‌పై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికలయ్యాక రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రకటన చేస్తారని చెప్పారు.
అయితే రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటు చేస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. దేశవాప్తంగా ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రజాదరణ పెరుగుతోందని, పెద్ద నోట్ల రద్దు తర్వాత మహరాష్ట్ర, గుజరాత్, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ బీజేపీయే అధికారం చేజిక్కించుకుంటుందని దీమా వ్యక్తంచేశారు.