Muscles Secret
-
ఎక్కువ బరువులు ఎత్తడంకంటే ఇలా చేస్తే కండలు ఆరోగ్యంగా పెరుగుతాయి..
జిమ్‌లలో వ్యాయామం నిదానంగా చేయాలి. బరువులతో ఎక్సర్సైజ్ చేసేవారు త్వరగా కండరాలు పెరగాలనే ఉద్దేశంతో బరువులు త్వరత్వరగా పెంచుకుంటూ పోకూడదు. తక్కువ బరువుతో మొదలుపెట్టి... రిపిటీషన్స్ ఎక్కువగా చేయాలి. బరువులతో వ్యాయామం చేసేవారు బరువును పెంచడం చాలా నెమ్మదిగా, నిదానంగా చేయాలి. మరీ ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల కండలు ఆరోగ్యకరంగా పెరగవు. హెవీ వెయిట్స్తో కండరం మీద ఎక్కువ భారం పడేలా ఎక్సర్సైజ్ చేయడం కంటే తక్కువ బరువులతో కండరం అలసిపోయేవరకు ఎక్సర్సైజ్ చేయడం మంచిది. కండరాలు పెరగాలంటే మరింత ప్రోటీన్ అందేలా దాన్ని స్టిమ్యులేట్ చేయడం మంచిది. ఇలా స్టిమ్యులేషన్ కలగాలంటే... మరీ ఎక్కువ బరువులు ఎత్తడం సరికాదు. దానికి బదులుగా తమకు సౌకర్యంగా ఉండేంత బరువును మాత్రమే ఎత్తుతూ, కండరం అలసిపోయేవరకు ఎక్సర్సైజ్ చేయాలి. కండరాలు త్వరగా పెరగాలనే ఉద్దేశంతో చాలామంది తాము ఎక్సర్సైజ్ చేసేప్పుడు బరువులను తొందర తొందరగా పెంచుకుంటూ పోతారు. బరువు పెరుగుతున్న కొద్దీ ఎక్సర్సైజ్ రిపిటీషన్స్ తగ్గుతాయి. దాంతో ఆశించినట్లుగా కండరం పెరగదు. చేస్తున్న ఎక్సర్సైజ్ను కనీసం 20 సార్లు (ఇరవై కౌంట్) చేసేందుకు వీలైనంత బరువును మాత్రమే వేసుకోవాలి. ఇలా తక్కువ బరువుతో ఎక్కువ కౌంట్ చేయడం వల్లనే కండరం ఆరోగ్యంగా పెరుగుతుంది. -
చనిపోయాడని చెప్పారు.. కానీ!
కేప్‌టౌన్(దక్షిణాఫ్రికా) : ఆ రోజు జూన్ 24, తెల్లవారు జామున.. రోడ్డు సరిగా కనిపించడం లేదు. అసలే అది కేప్‌టౌన్‌లోకెల్లా చాలా ప్రమాదకరమయిన రోడ్డు. ఆ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. కారులో నలుగురులో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఎంత తీవ్రంగా అంటే కారులో నుంచి రోడ్డు మీద పడ్డారు. నాల్గో వ్యక్తికి మాత్రం అంత పెద్ద దెబ్బలేం తగల్లేదు. దాంతో అతను సాయం కోసం ఎదురు చూస చూస్తుండగా.. సమాచారం అందుకున్న ప్రైవేటు అంబులెన్స్ సర్వీస్ వారు అక్కడికి వచ్చారు. గాయపడిన నాల్గో వ్యక్తిని కాపాడటం కోసం ఆస్పత్రికి తరలించారు. మిగతా ముగ్గురిని పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. అనంతరం వారిని మార్చురికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ముగ్గురిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్తుండగా చనిపోయిన వారిలో ఒక వ్యక్తి శ్వాస తీసుకుంటున్నట్టు గమనించారు. అతన్ని పరీక్షించగా బతికే ఉన్నాడు. కొద్ది నిమిషాల ముందు మరణించాడని ప్రకటించిన వ్యక్తి మళ్లీ ఎలా బతికాడు...? ఇలాంటి సంఘటనలు ఇక్కడే కాదు ప్రంపంచ వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి బీబీసీ కొన్ని కథనాలను కూడా ప్రచారం చేసింది. వాటిలో గత జనవరిలో గోన్జాలో మొన్టోయో అని వ్యక్తి మరణించినట్లు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు డాక్టర్లు నిర్ధారించారు. అతనికి పోస్టు మార్టమ్ చేద్దామని శరీరంపై గుర్తులు కూడా పెట్టారు. కానీ ఉన్నట్టుండి ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. మూడేళ్ల క్రితం 91 ఏళ్ల వృద్ధురాలిని మరణించినట్లు ప్రకటించారు. కానీ ఆమె మరణించినట్లు ప్రకటించిన 11 గంటల తర్వాత ఆ బామ్మ నింపాదిగా లేచి కూర్చుని వేడి వేడిగా ఓ కప్పు కాఫీ, పాన్ కేక్ తీసుకురమ్మని డాక్టర్లకు చెప్పింది. దాంతో డాక్టర్లు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. కొన్నేళ్ల క్రితం ఓ 80 ఏళ్ల బామ్మకు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లు ఆమెను మరణించిందని నిర్ధారించి, ఫ్రీజర్‌లో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆమె ముక్కు పగిలి సగం బయటకు వచ్చి ఉంది. ఏం జరిగిందో ముందు డాక్టర్లకు అర్థం కాలేదు. తర్వాత తెలిసిందేంటంటే పాపం ఆ వృద్ధురాలిని ఫ్రీజర్‌లో పెట్టిన తర్వాత బతికిందని, అందుకే బయటకు రావడానికి ప్రయత్నించి ఉంటుందని తెలిపారు డాక్టర్లు. మరణం తర్వాత జీవం ఎలా... వైద్యులు పరీక్షించి, మరణించారని నిర్ధారించిన తర్వాత కూడా వీరంతా మళ్లీ ఎలా బతుకుతున్నారన్నదే చాలా ఆశ్చర్చకరమైన విషయం. అయితే దీనికి వైద్యులు చెప్పే సమాధానం మరణించారని నిర్ధారించిన వ్యక్తులు కొన్నిసార్లు నిజంగానే మరణించరు. ఆ సమయంలో వారు ‘కాటలాప్సి’(కండరాలు బిగుసుకుపోవడం) అనే స్థితికి చేరుకుంటారు. ఆ సమయంలో వారి హృదయ స్పందనలు, శ్వాస తీసుకోవడం వంటి వాటిని గుర్తించలేనంత లో-లెవల్‌కు పడిపోతాయి. కాబట్టి వారు మరణించిన వారిలానే ఉంటారు. కండరాల బిగువు సడలిన తర్వాత వారి శరీరం సాధారణ స్థితిలోకి వచ్చి ఉన్నట్టుండి ఒక్కసారిగా బతుకుతున్నారని తెలిపారు వైద్యులు. -
అలా మజిల్స్ పెంచా!
సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘గురు’ స్టిల్స్‌లో వెంకటేశ్ కొత్తగా కనిపించారు. సాల్ట్ అండ్ పెప్పర్ సై్టల్ మాత్రమేనా... ఐదు పదుల వయసులోనూ కండలు పెంచి అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు. నేడు వెంకటేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మీ మజిల్స్ సీక్రెట్ ఏంటో చెప్పమని ‘సాక్షి’ అడగ్గా... వెంకటేశ్ మాట్లాడుతూ – ‘‘ఈ మేకోవర్ నాకు బాగా నచ్చింది. ‘గురు’లో నాది బాక్సింగ్ కోచ్ పాత్ర. మజిల్స్‌తో బాడీ మరింత ఫిట్‌గా కనిపిస్తే బాగుంటుందనుకున్నా. ఫిట్నెస్ ట్రైనర్ కునాల్ గిర్ దగ్గర కొన్ని నెలల పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నా. హై ప్రొటీన్, లో కార్బోస్ ఉన్న ఫుడ్ తీసుకున్నా. కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తినేవాణ్ణి’’ అన్నారు. ఈ ఏడాది ‘బాబు బంగారం’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన... మేనల్లుడు నాగచైతన్య ‘ప్రేమమ్’లో అతిథిగా కనిపించారు. త్వరలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. మొత్తం మీద ఈ ఏడాది చాలా సంతోషంగా గడిచిందన్నారు. అన్నట్టు... పుట్టినరోజు సందర్భంగా బయటికొచ్చిన కొత్త స్టిల్స్‌లో వెంకీ హ్యాండ్సమ్గా ఉన్నారు కదూ. ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’లో లుక్‌లోనే కనిపిస్తారట! ఆ సంగతలా ఉంచితే.. పుట్టినరోజు వేడుక జరుపుకోవడం తనకు అలవాటు లేదన్న వెంకీ.. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన వర్దా తుఫాను బాధితులకు సానుభూతి వ్యక్తం చేశారు.