పెళ్లయిన ఏడేళ్ల తరువాత మొదటిసారి అత్తవారింటికి
ఎస్ఎస్ తమన్.. నవతరం తెలుగు సినీ సంగీతంలో ఆయనో సంచలనం. ఎన్నో హిట్ సినిమాలకు బాణీలు అందించి, అనతికాలంలోనే అగ్రస్థాయి సంగీత దర్శకుడిగా ఎదిగారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన పూర్తి పేరు.. ఘంటసాల శివసాయి తమన్. కిక్ సినిమా నుంచి ఆగడు వరకూ సినిమాలకు తమన్ చక్కటి సంగీతం అందించారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో జరిగిన ‘గ్లిట్జ్-2014’లో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
సాక్షి : మీ కుటుంబ నేపథ్యం..
తమన్ : మా తాతగారు ఘంటసాల బలరామ్గారు సినీ నిర్మాత. అక్కినేని నాగేశ్వరరావుగారిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. ఆయన నిర్మాణ సంస్థ ప్రతిభ ప్రొడక్షన్స్‌లో ఏఎన్ఆర్గారితో 50 సినిమాల వరకూ తీశారు. మా తండ్రి శివకుమార్, తల్లి సావిత్రి. భార్య శ్రీవర్ధిని. మాకు ఆరేళ్ల పాప ఉంది.
సాక్షి : బాలుగారితో సాన్నిహిత్యం గురించి..
తమన్ : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారితోనే నా సంగీత ప్రయాణం మొదలైంది. ఆయనతో 300 పైగా ప్రోగ్రాంలు చేశాను. ఆయనతో అనుబంధం నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది.
సాక్షి : మీ సినీ ప్రయాణం గురించి..
తమన్ : మా తండ్రి శివకుమార్ తబలా విద్వాంసుడు కావడంతో చిన్ననాటి నుంచీ తబలా, డ్రమ్స్పై ఎక్కువ శ్రద్ధ చూపించేవాడిని. బాయ్స్ సినిమాతో నటన ప్రారంభించినా మ్యూజిక్ మీద ఉన్న ఆసక్తితో సంగీత దర్శకుడిని అయ్యాను.
సాక్షి : ఇప్పటివరకూ ఎన్ని సినిమాలకు సంగీతం అందించారు?
తమన్ :తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో 56 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాను.
సాక్షి : బాగా బ్రేక్ ఇచ్చిన సినిమా..
తమన్ : నేను పని చేసిన అన్ని సినిమాలూ నాకు బ్రేక్ ఇచ్చినవే. ప్రత్యేకంగా చెప్పాలంటే కిక్, దూకుడు, బిజినెస్ మేన్ సినిమా లు నాకు బాగా గుర్తింపునిచ్చాయి.
సాక్షి : తక్కువ కాలంలోనే ఇన్ని సినిమాలకు సంగీతం అందించడం ఎలా సాధ్యమైంది?
తమన్ : నిర్మాత చెప్పిన షెడ్యూల్ తగ్గట్టుగా పని చేస్తాను. చెప్పిన సమయంకంటే ముందుగానే సంగీతం అందిస్తాను.
నావల్ల ఏ సినిమా ఆలస్యం కాకూడదు. కానివ్వను. అందుకోసం మా టీమంతా చాలా కష్టపడి పని చేస్తుంది.
సాక్షి : కొత్త సినిమాల గురించి..
తమన్ : కిక్-2, పండగ చేస్కో సినిమాలతోపాటు రామ్‌చరణ్‌తో ఒకటి, బాలకృష్ణ 99వ చిత్రం, నాగార్జున కుమారుడు అఖిల్ హీరోగా తీయబోయే సినిమాకు సంగీతం అందించనున్నాను.
సాక్షి : దేవీశ్రీప్రసాద్‌తో పోటీ పడుతున్నట్టున్నారు?
తమన్ : కాంపిటీషన్ ఉండాలి. శత్రువు లేని యుద్ధం చేయలేం. పోటీ లేని ప్రపంచంలో ఎదగలేం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీయే ఉంది. ఇది మా ఇద్దరికీ మంచిదే.
సాక్షి : కోనసీమ గురించి..
తమన్ : ఇక్కడి సంస్కృతి, పచ్చని పొలాలు, స్వచ్ఛమైన మనుషులు ఎంతో నచ్చారు. నాకు కోనసీమతో ప్రత్యేక అనుబంధం ఉంది. నేను అమలాపురం అల్లుడినే. నా భార్య శ్రీవర్ధిని. ఆమె సింగర్. ఏడేళ్ల క్రితం మాకు వివాహమైంది. మామ కూచి దీక్షితులు తబలా విద్వాంసుడు. వారిది అమలాపురమే.
సాక్షి : అత్తారింటికొచ్చారన్నమాట..
తమన్ : (నవ్వుతూ) పెళ్లయిన ఏడేళ్ల తరువాత మొదటిసారి అత్తవారింటికి అమలాపురం వచ్చాను.
సాక్షి : ‘మేము సైతం’ కార్యక్రమం గురించి..
తమన్ : హుద్‌హుద్ తుపాను ఎందరికో నష్టాన్ని మిగిల్చింది. బాధితుల సహాయార్థం ఈ మధ్యనే రాక్‌గార్డెన్స్ ఆధ్వర్యంలో సినీ రచయిత కోన వెంకట్ సోదరి నీరజ ప్రోత్సాహంతో ఓ స్టేజ్ షో చేశాను. దానిద్వారా వచ్చిన రూ.6 లక్షలు తుపాను బాధితుల కోసం ఇచ్చాను. సినీ పరిశ్రమ తరఫున మేమంతా అండగా ఉంటాం. ఈ నెల 30న ‘మేము సైతం’ కార్యక్రమంలో సినీ హీరోలతో పాటలు పాడిస్తున్నాం. ఎన్టీఆర్, రవితేజలతో పాడిస్తాను.
సాక్షి : బాయ్స్ సినిమాలో నటించారు. మళ్లీ మేకప్ వేసుకునేదెప్పుడు?
తమన్ : నా పూర్తి కాన్సట్రేషన్ మ్యూజిక్‌పైనే ఉంది. ఇక నటించాలన్న ఆసక్తి లేదు.
సంగీత పాఠశాల ఏర్పాటు చేస్తా
వెలుగుబంద (రాజానగరం) : రాష్ట్రంలో ఒక సంగీత పాఠశాల ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని ఎస్ఎస్ తమన్ తెలిపారు. స్థానిక గైట్ కళాశాలను శనివారం సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్ముందు తమ ‘టమోటా బ్యాండ్’ అనే గ్రూపు ద్వారా వచ్చే సంపాదనను మ్యూజిక్ పాఠశాల నిర్వహణకు వినియోగిస్తానన్నారు. మ్యూజిక్ పాఠశాలను తమ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే అనువైన భవంతి సమకూరుస్తామని, గైట్ కళాశాల ఎండీ కె.శశికిరణ్‌వర్మ, ఈడీ కె.లక్ష్మి చెప్పడంతో తమన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.