mutetion
-
మానవ తప్పిదంతో కరోనా వేగంగా వ్యాప్తి
సాక్షి, హైదరాబాద్: మనిషి రోగనిరోధక శక్తి పటిష్టమైంది. అందుకే భయంకరమైన వైరస్‌లను కూడా తట్టుకోగలుగుతున్నాడు.. ఇప్పుడు కరోనా వైరస్ కూడా తన జన్యుపరమైన శక్తిని పెంచుకోవటం ద్వారా మనిషి రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోగలుగుతోందా? కోవిడ్ సెకండ్ వేవ్‌గా ప్రస్తుతం పరిగణిస్తున్న, కరోనా వైరస్ విస్తృతిని చూస్తుంటే ఔననే సమాధానం వస్తోందంటున్నారు వైద్య నిపుణులు. అంటే మనిషి తన రోగనిరోధక శక్తిని పటిష్టం చేసుకున్నట్టే, ఆ శక్తి నుంచి తట్టుకుని నిలిచేలా కరోనా వైరస్ కూడా తన నిరోధకతను (జన్యువులో మార్పు) శక్తిమంతం చేసుకుందంటున్నారు. దాన్ని మ్యుటేషన్‌గా భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ‘సాధారణంగా ఈ వైరస్ రెండో దశ ఇంత వేగంగా వచ్చే అవకాశం లేదు. కానీ వైరస్‌లో మ్యుటేషన్ వల్ల తిరిగి అది విజృంభిస్తోంది. గతేడాది మొదటి దశలో చూసిన వేగానికి ఇప్పుడు దాని వేగానికి అసలు పొంతనే లేదు. కేవలం వారం పది రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. చూస్తుండగానే దేశంలో రోజుకు రెండు లక్షలకు మించి కొత్త కేసులు నమోదవుతుండటమే దీనికి కారణం. ఇది వైరస్‌లో సంభవించిన మ్యుటేషన్లే కారణం’ అని విశ్లేస్తున్నారు ఇంటిగ్రేటెడ్ స్పెషలిస్టు, మైక్రో బయాలజిస్టు డాక్టర్ దుర్గా సునీల్ వాస. దీనికి మానవ తప్పిదమే కారణంగా నిలుస్తోందని, దీన్ని మళ్లీ నియంత్రించాలంటే మనమే మారాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. గతేడాది మార్చిలో కరోనా వైరస్ ప్రభావం వెలుగు చూసిన తర్వాత కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చి డిసెంబర్ నుంచి మళ్లీ బాగా తగ్గుముఖం పట్టాయి. జనవరిలో పరిస్థితి దాదాపు సాధారణ స్థితికి వచ్చినట్లే అనిపించింది. దీన్ని ప్రజలు అలుసుగా తీసుకోవటం వైరస్ విజృంభించేందుకు కారణమైంది. అది చివరకు మ్యుటేషన్లకు దారితీసింది. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి ఉంటే వైరస్‌కు పరివర్తనం చెందే అవకాశం వచ్చేది కాదు. కోవిడ్ లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. కోవిడ్ సోకిందని తేలిన వెంటనే చికిత్స ప్రారంభించుకునేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు వైరస్ ఎక్కువ రోజులు శరీరంలో ఉండే అవకాశం ఉండదు. ఇతరులకు సోకే ప్రమాదం ఉండదు. సరైన చికిత్స అవసరం.. వైరస్ సోకిందని సకాలంలో గుర్తించటమే కాకుండా దానికి సకాలంలో సరైన చికిత్స కూడా ప్రారంభించాలి. ఈ విషయంలో చాలామంది తోచిన మందులు వేసుకుంటున్నారు. కొన్ని చోట్ల సరైన అవగాహన లేని వైద్యులు కూడా సరైన చికిత్స అందించకుండా వైరస్ పెరిగేందుకు కారణమవుతున్నారు. యూరప్ లాంటి దేశస్తులకు మనకున్నంత రోగనిరోధక శక్తి ఉండదు. వారిపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన వైరస్‌ను మనం సులభంగానే తట్టుకోగలుగుతాం. కానీ మ్యుటేషన్ చెంది మన నిరోధకతను కూడా తట్టుకునేలా మార్పులు చేసుకుంది. మానవ తప్పిదంతో వేగంగా మ్యుటేషన్ చెంది రెట్టింపు వేగంతో విస్తరిస్తోంది. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తే వీలైనంత తొందరగా నియంత్రణలోకి వస్తుంది. చదవండి: ఈ పరికరం కరోనా బాధితులకు ఓ వరం -
విత్తం కొద్దీ విధానం
షాద్‌నగర్: మున్సిపల్ కార్యాలయంలో పని ఉందా..? మీరు రోజుల తరబడి కార్యాలయాలకు తిరగాల్సిన పనిలేదు.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలు అని మున్సిపల్ అధికారులు చెప్పిన మాటలు వింటున్నారా..? అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. మున్సిపల్ సేవల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా ప్రభుత్వం ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. ఉన్నతాధికారులు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని అనుకుంటున్నా.. క్షేత్రస్థాయి సిబ్బంది మూలంగా అది నీరుగారిపోతుంది. కిందిస్థాయి సిబ్బంది, మధ్యవర్తుల హవానే మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతుందని మున్సిపల్ ఆవరణలో పలువురు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటు.. మున్సిపల్ కార్యాలయంలో పనిని బట్టి రేటు ఫిక్స్ చేస్తున్నారు.. గవర్నమెంటు రేటు కాదండి వారి రేటు... పనికి తగ్గ రేటు ఇస్తే మీ పని క్షణాల్లో అయిపోతుంది.. ఇంకా త్వరగా కావాలా..? ఇంకాస్త ఎక్కువ రేటు ఇస్తే మీకు కావాల్సిన కాగితం ఇంటికే నడిచి వస్తుంది. ‡జనన, మరణ ధృవీకరణ పత్రాలు, భవన నిర్మాణ, వ్యాపార అనుమతులు, యాజమాన్య పేరు మార్పు, ఓనర్షిప్ సర్టిఫికెట్లకు ఒక రేటు అంటూ ఫిక్స్ చేస్తున్నారు. రేటు ఇవ్వని వారి కాళ్లకు ఉన్న చెప్పులు అరగాల్సిందే. పెండింగ్‌లో ఆన్లైన్ దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులు కూడా పెండింగ్‌లో ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల విషయంలో నేరుగా ప్రజలు వెళ్లి మధ్వవర్తులను ఆశ్రయిస్తేనే పని జరుగుతుందని వాపోతున్నారు. జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం మున్సిపల్ అధికారులకు అమ్యామ్యాలు చెల్లించాల్సిందే.. లేదా రోజుల తరబడి కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగే దాకా తిరగాల్సిందే. ధృవీకరణ పత్రాల కోసం బాహాటంగానే డబ్బులు అడుగుతున్నారని విమర్శలు వినవస్తున్నాయి. మధ్యవర్తులదే హవా.. షాద్‌నగర్ మున్సిపల్ ప్రజలు ఏ విధమైన సేవలు పొందాలన్నా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అనంతరం పని పూర్తయిందనుకుంటే పొరపాటే. మీ ఫైల్ ముందుకు కదలాలంటే మధ్యవర్తులు, పురపాలక కిందిస్థాయి సిబ్బంది సేవలు వినియోగించాల్సిందే. ఏ పనికి రేటు ఎంత ఇస్తారో ముందు బేరం కుదుర్చు కోవాల్సిందే. మ్యూటేషన్ చేయడం లేదు గత నెల రోజులుగా మ్యూటేషన్(యాజమాన్య పేరు మార్పిడి) చేయడం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సమాచారం రాకపోవడంతో మ్యూటేషన్ చేయడం లేదు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నామనేది అసత్యం. కార్యాలయంలో ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురండి. చర్యలు తీసుకుంటాము. – శరత్చంద్ర, మున్సిపల్ కమిషనర్ -
దంపతుల ఆత్మహత్యాయత్నం
బెజ్జంకి (కరీంనగర్): కొనుగోలు చేసిన భూమికి తహశీల్దార్ మ్యుటేషన్ చేయడం లేదని.. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం కీలాపూర్ గ్రామంలో దంపతులు శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామానికి చెందిన అర్జున్, స్వరూప దంపతులు 2 ఎకరాల 37 గుంటల భూమిని కొనుగోలు చేశారు. దానికి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేయగా, రికార్డుల్లోని వివరాల ఆధారంగా 2 ఎకరాలకే మ్యుటేషన్ చేయడం వీలవుతుందని తహశీల్దార్ స్పష్టం చేశారు. 37 గుంటల భూమిని యజమాని అప్పటికే వేరొకరికి విక్రయించినట్టు ఆయన చెప్పారు. అయినప్పటికీ తాము కొనుగోలు చేసిన మొత్తం భూమికి మ్యుటేషన్ చేయాలని కోరగా, వీలు కాదని స్పష్టం చేయడంతో మనస్తాపం చెందారు. శనివారం అర్జున్, స్వరూప తమ ఇంట్లో పురుగుల ముందు తాగి పడిపోగా 108లో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.