షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయం
షాద్‌నగర్: మున్సిపల్ కార్యాలయంలో పని ఉందా..? మీరు రోజుల తరబడి కార్యాలయాలకు తిరగాల్సిన పనిలేదు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు అని మున్సిపల్ అధికారులు చెప్పిన మాటలు వింటున్నారా..? అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. మున్సిపల్ సేవల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా ప్రభుత్వం ఆన్‌లైన్ సేవలను ప్రారంభించింది. ఉన్నతాధికారులు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని అనుకుంటున్నా.. క్షేత్రస్థాయి సిబ్బంది మూలంగా అది నీరుగారిపోతుంది. కిందిస్థాయి సిబ్బంది, మధ్యవర్తుల హవానే మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతుందని మున్సిపల్ ఆవరణలో పలువురు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.
ఒక్కో పనికి ఒక్కో రేటు..
మున్సిపల్ కార్యాలయంలో పనిని బట్టి రేటు ఫిక్స్ చేస్తున్నారు.. గవర్నమెంటు రేటు కాదండి వారి రేటు... పనికి తగ్గ రేటు ఇస్తే మీ పని క్షణాల్లో అయిపోతుంది.. ఇంకా త్వరగా కావాలా..? ఇంకాస్త ఎక్కువ రేటు ఇస్తే మీకు కావాల్సిన కాగితం ఇంటికే నడిచి వస్తుంది. ‡జనన, మరణ ధృవీకరణ పత్రాలు, భవన నిర్మాణ, వ్యాపార అనుమతులు, యాజమాన్య పేరు మార్పు, ఓనర్‌షిప్ సర్టిఫికెట్‌లకు ఒక రేటు అంటూ ఫిక్స్ చేస్తున్నారు. రేటు ఇవ్వని వారి కాళ్లకు ఉన్న చెప్పులు అరగాల్సిందే.
పెండింగ్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులు
ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులు కూడా పెండింగ్‌లో ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల విషయంలో నేరుగా ప్రజలు వెళ్లి మధ్వవర్తులను ఆశ్రయిస్తేనే పని జరుగుతుందని వాపోతున్నారు. జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం మున్సిపల్ అధికారులకు అమ్యామ్యాలు చెల్లించాల్సిందే.. లేదా రోజుల తరబడి కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగే దాకా తిరగాల్సిందే. ధృవీకరణ పత్రాల కోసం బాహాటంగానే డబ్బులు అడుగుతున్నారని విమర్శలు వినవస్తున్నాయి.
మధ్యవర్తులదే హవా..
షాద్‌నగర్ మున్సిపల్ ప్రజలు ఏ విధమైన సేవలు పొందాలన్నా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అనంతరం పని పూర్తయిందనుకుంటే పొరపాటే. మీ ఫైల్ ముందుకు కదలాలంటే మధ్యవర్తులు, పురపాలక కిందిస్థాయి సిబ్బంది సేవలు వినియోగించాల్సిందే. ఏ పనికి రేటు ఎంత ఇస్తారో ముందు బేరం కుదుర్చు కోవాల్సిందే.
మ్యూటేషన్ చేయడం లేదు
గత నెల రోజులుగా మ్యూటేషన్(యాజమాన్య పేరు మార్పిడి) చేయడం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సమాచారం రాకపోవడంతో మ్యూటేషన్ చేయడం లేదు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నామనేది అసత్యం. కార్యాలయంలో ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురండి. చర్యలు తీసుకుంటాము. – శరత్‌చంద్ర, మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment