'ప్రపంచ మ్యాప్‌లో పాక్ ఉండదు'
వాషింగ్టన్: సైన్యం, దాని అడుగుజాడల్లో నడిచే ఐఎస్ఐలే పాకిస్తాన్‌కు ప్రధాన శత్రువులని ఆ దేశ ప్రధాన ప్రతిపక్షం ముత్తహిదా క్వామీ మూవ్మెంట్(ఎంక్యూఎం) ఆరోపించింది. బలూచ్, మొహజిర్ల హక్కులను కాలరాస్తూ సైన్యం అకృత్యాలు ఇలాగే కొనసాగితే ప్రపంచపటం నుంచి పాకిస్తాన్ కనుమరుగవటం ఖాయమని ఎంక్యూఎం నేత అల్తాఫ్ హుస్సేన్ హెచ్చరించారు. తీవ్రవాదుల ఏరివేత పేరిట పాక్ సైన్యం బలూచిస్తాన్‌లో చేపట్టిన సైనిక చర్యలో వేలాది మంది బలూచ్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
సింథి, పక్తూన్, పంజాబ్ భూస్వాములు స్వార్థ ప్రయోజనాల కోసం పాక్ సైన్యానికి దాసోహం అంటున్నారని తెలిపారు. కరాచీ, బలూచిస్తాన్లలో ఆర్మీ తన కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. మొహజిర్, బలూచ్ నాయకత్వాలతో చర్చలు జరిపి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అలా కాకుండా, సైనిక చర్యలు కొనసాగితే దేశం నాశనం కావటం ఖాయమని పేర్కొన్నారు.
సైన్యం, ఐఎస్ఐ కుమ్మక్కై తీవ్రవాదులకు ఆశ్రయం, రక్షణ కల్పిస్తూ పొరుగు దేశాల్లో ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నాయని ఆరోపించారు. ఒసామా బిన్ లాడెన్ లాంటి అంతర్జాతీయ తీవ్రవాదులకు పాక్ ఆర్మీ, ఐఎస్ఐలు అండగా నిలబడి అనేక ఏళ్ల పాటు రక్షణ కల్పించాయని కూడా తెలిపారు. కాగా, అల్తాఫ్ హుస్సేన్ గత కొన్నేళ్లుగా లండన్‌లో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు.