సమైక్య విజయం
=శంఖారావం సభకు అనుమతిపై హర్షం
=ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు మాదే
=సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేసేది మేమే
=వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి
సాక్షి, విజయవాడ : రాష్ట్ర రాజధానిలో వైఎస్సార్ సీపీ నిర్వహించతలపెట్టిన సమైక్య శంఖారావం సభకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా హైకోర్టు అనుమతి ఇవ్వడం.. సమైక్యవాదులందరి విజయమని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి చెప్పారు. బుధవారం ఆయన నగరంలో పార్టీ బీసీ విభాగం జిల్లా కన్వీనర్ పడమట సురేష్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి ఎం. రాముతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ మూడు ప్రాంతాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలతో సమైక్య శంఖారావం సభ జరపాలని నిర్ణయిస్తే ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభకు హైకోర్టు అనుమతి ఇవ్వడం ప్రజాస్వామిక విజయమని హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమ అరెస్టు నుంచి ఇప్పటివరకు తమ పార్టీ చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా ప్రజా ఉద్యమాలు చేస్తోందని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ నిరంకుశ విధానంపై చట్టబద్ధంగానే పోరాడి సభ నిర్వహిస్తున్నామన్నారు. సమైక్య శంఖారావం సభకు అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలు తరలిరావాలని నాగిరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే మొదటగా నష్టపోయేది వ్యవసాయరంగమేనన్నారు.
రైతు సంక్షేమం కోసం ఎక్కువగా కృషిచేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేశారు. పార్టీ పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త సురేష్‌బాబు మాట్లాడుతూ సమైక్య శంఖారావం సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం ఎన్ని కుట్రలు పన్నినా హైకోర్టు అనుమతి ఇవ్వడం హర్షణీయమన్నారు. చట్టంపై తమకు గౌరవం ఉందని చెప్పారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎం.రాము మాట్లాడుతూ సమైక్య శంఖారావం సభకు సమైక్యవాదులంతా పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి కూడా ఎక్కువమంది వస్తారని చెప్పారు.