కథ పాతది... కిక్కు మాత్రం కొత్తది!
సోనీ చానెల్లో ప్రసారమయ్యే ‘మై న భూలూంగీ’ సీరియల్ కథ వింటే ‘గౌతమి’ అనే తెలుగు సినిమా గుర్తొస్తుంది. సుహాసిని ప్రధాన పాత్రలో నటించిన ఆ సిన్మాలో భర్త ఆమెను చంపాలనుకుంటాడు. ఆమె తప్పించుకుంటుంది. కానీ ముఖం కాలిపోతుంది. తర్వాత స్నేహితుడి సాయంతో అందంగా తయారై, వేషభాషలు మార్చుకుని వచ్చి పగ తీర్చుకుంటుంది. అచ్చు ఈ కథతో తీసిందే ‘మై న భూలూంగీ’. అయితే కథ పాతదే అయినా కథనంలో మాత్రం కొత్త కిక్కు ఉంది. రోజుకో కొత్త ట్విస్ట్‌తో ఉత్కంఠను రేకెత్తించే విధంగా సాగుతోంది.
శిఖా తెలివైన అమ్మాయి. వ్యాపారవేత్త సమీర్‌తో ప్రేమలో పడుతుంది. వారి వివాహం జరుగుతుంది. బాబు పుడతాడు. అయితే సమీర్ నిజ స్వరూపం... అతడు తనను చంపాలని ప్రయత్నించిన తర్వాత గానీ తెలియదు శిఖాకి. అతడి అసలు పేరు ఆదిత్య జగన్నాథ్ అని, తనను ఓ పథకం ప్రకారం పెళ్లాడాడని తెలుసుకుంటుంది. హత్యా ప్రయత్నంతో వికారంగా తయారైన తన ముఖాన్ని అందంగా మార్చుకుని, ఓ కొత్త రూపంలో అతడి ముందుకొస్తుంది. సమైరాగా పేరు మార్చుకుని, మోడల్‌గా పరిచయం చేసుకుంటుంది. అతడి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారి అతడికి దగ్గరవుతుంది. అతడితో ఆడుకుంటోంది.
ఈ సీరియల్‌కి ప్రధాన ఆకర్షణ... ఐశ్వర్యా సకూజా. అమాయకురాలైన ‘శిఖా’గా, మైండ్‌గేమ్ ఆడే ‘సమైరా’గా ఆమె నటనకు హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి. గతంలో ‘సాస్ బినా ససురాల్’తో మంచి మార్కులు కొట్టేసిన ఆమె... ఇప్పుడీ సీరియల్‌తో టెలివిజన్ ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతస్థానం సంపాదించింది. ఆదిత్యగా వికాస్, సమైరా స్నేహితుడు నీరజ్‌గా అవినేష్ రేఖీల నటన కూడా ప్రశంసనీయమైనది. మరి ముందు ముందు కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే!