నేనొస్తే స్వచ్ఛమైన బీఫ్ అందిస్తా: బీజేపీ నేత
న్యూఢిల్లీ: బీఫ్ మాంసం నిషేధించాలా వద్ద అనేది తర్వాత తేలుస్తామని, ముందైతే తనను ఎన్నికల్లో గెలిపించాలని కేరళకు చెందిన బీజేపీ నేత ఎన్ శ్రీప్రకాశ్ కొంత వివాదాన్ని మూటగట్టుకునేలా మాట్లాడారు. వ్యక్తిగతంగా తాను కూడా బీఫ్‌కు వ్యతిరేకం అని, గోవధను ఒప్పుకోనని చెబుతూనే మాంసం విషయంలో ప్రజల ఇష్టం అని అన్నారు. వారు ఎలాంటి మాంసం అయినా తినవచ్చని చెప్పారు. ఏప్రిల్ 12న జరగనున్న మలప్పురం లోక్‌సభ స్థానంలో ఆయన బీజేపీ తరుపున ఎంపీగా బరిలోకి దిగుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆయనతో ఓ టీవీ చానెల్ మాట్లాడుతూ బీఫ్ నిషేధానికి మద్దతిస్తారా అని ప్రశ్నించగా ఈ విధంగా సమాధానం చెప్పారు. ‘నేను వ్యక్తిగతంగా గోవధకు అంగీకరించను. కానీ, కేరళ చట్టాలు బీఫ్ తినేందుకు అనుమతిస్తాయి. ప్రజలు ఎలాంటి మాంసం అయినా తినగలరు. నేను మలప్పురం ప్రజలకు ఒక హామీ ఇస్తున్నాను. మీకు క్వాలిటీ బీఫ్ అందిస్తాను. కబేళాలను ఎలాంటి సమస్యలు లేకుండా నడిపిస్తాను’ అని చెప్పారు. మలప్పురం నియోజకవర్గం ఎంపీ గత ఫిబ్రవరి 1న చనిపోయిన కారణంగా ఇప్పటి ఉప ఎన్నిక అనివార్యమైంది.