ఉద్యమం ఎగసిపడితేనే విభజన ఆగేది
పాలకొల్లు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడితేనే విభజన ప్రక్రియ ఆగుతుందని రాష్ట్ర రైతు జేఏసీ అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మంగళవారం స్థానిక గాంధీబొమ్మల సెంటర్లో నిర్వహించిన రైతు సమైక్య గర్జన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర విభజన విషయంపై రైతులు తీవ్రంగా స్పందించకపోతే పెనుముప్పు తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమంలో రైతులు కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంత రాజకీయనాయకులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఐక్యమత్యంగా పనిచేస్తే సీమాంధ్ర ప్రాంతంలోని నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమబాట పట్టాలని నాగేంద్రనాథ్ డిమాండ్ చేశారు. ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సమైక్యవాదం, ఢిల్లీ పెద్దల ముందు వేర్పాటువాదాన్ని వినిపిస్తున్న సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలను తమ పదవులకు రాజీనామా చేయాలంటూ గట్టిగా నిలదీసినప్పుడే ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. సీమాంధ్ర ఎమ్మెల్యేల్లో కొంతమంది దొంగలున్నారని కేంద్రంతో ప్యాకేజీలు మాట్లాడుకుని విదేశాలకు వెళ్లేపోయే ప్రయత్నం చేస్తున్నారని అటువంటివారిని ఎట్టిపరిస్థితిలోను వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు. సభకు అద్యక్షత వహించిన జిల్లా రైతు జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఎగువ ప్రాంతంలోని ఎత్తిపోతల పథకాలు పూర్తయ్యి, విభజన జరిగితే సీమాంధ్రకు నీరు వచ్చే అవకాశం లేదని తద్వారా ఈప్రాంత భూములన్నీ బీడువారక తప్పదని అందువల్ల రైతులంతా మరింత తీవ్రంగా ఉద్యమించాలన్నారు.
ఈనాటి సభలో రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు మాగంటి సీతారామస్వామి, రాష్ట్ర రైతు జేఏసీ కార్యదర్శి శ్యాంప్రసాద్‌ముఖర్జీ, రాష్ట్ర వ్యవసాయాధికారుల సంఘం అధ్యక్షుడు కె.కమలాకర్‌శర్మ, జిల్లా వ్యవసాయాధికారుల సంఘం అధ్యక్షుడు పి.మురళీకృష్ణ. మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ కృష్ణయ్య, జిల్లా రైతు జేఏసీ కార్యదర్శి పరిమి రాఘవులు, జంగం కుమారస్వామి, చిలుకూరి సత్యవతి, ఎస్ మనోరమ, యడ్ల తాతాజీ, గుమ్మాపు సూర్యవరప్రసాద్, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, కొప్పుసత్యనారాయణ, డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి తహసిల్దార్లు పి.వెంకట్రావు, వి.స్వామినాయుడు, సీహెచ్ గురుప్రసాదరావు, ఉద్యోగసంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తీర్మానాలు ఇవీ
రైతు గర్జన సభలో ఏకగ్రీ వంగా ఆమోదించిన తీర్మానాలు ఇలా ఉన్నాయి. విభజనకు వత్తాసు పలుకుతున్న ఎంపీలు, మంత్రులను భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయ బహిష్కరణ చేస్తూ ప్రతి గ్రామ పొలిమేరల్లో బహిష్కరణ బోర్డులు పెట్టి ప్రజ లను చైతన్యవంతం చేయడం, విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతం సాగు, తాగునీరు లేక తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొంటాయి.. అందువల్ల ప్రస్తుత దాళ్వాకు పంట విరామం ప్రకటించి సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించారు. గతనెలలో కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ్రపభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలి. స్వామినాథన్ కమిషన్ సిపార్సులను అమలుచేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి.