nagireddy pet
-
పెళ్లికూతురు మెడలోంచి తాళి మాయం..!
నాగిరెడ్డిపేట్(ఎల్లారెడ్డి) : నిజామాబాదు జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని కన్నారెడ్డిలో జరిగిన వివాహ వేడుకలో ఏకంగా పెళ్లికూతురు మెడలో నుంచి పుస్తెల తాడును అపహరించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కన్నారెడ్డికి చెందిన పేరుపల్లి బాల పోచయ్య బుధవారం తన కూతురి పెళ్లి వేడుకను నిర్వహించారు. కాగా ముగ్గురి మహిళలు పెళ్లి కుమారుని తరఫున బంధువుల మాదిరిగా వివాహ కార్యక్రమానికి హాజరై పెళ్లి కూతురు మెడలో పూల దండలను సర్దుతూ ఆమె మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించారు. కొద్దిసేపటికే మెడలో పుస్తెల తాడు లేకపోవడాన్ని గమనించిన పెళ్లి కూతురు తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో అప్రమత్తమైన పెళ్లి బృందం సభ్యులు పుస్తెల తాడు కోసం గాలించారు. కాగా పెళ్లి కూతురు మెడలో నుంచి పుస్తెల తాడును అపహరించడాన్ని గమనించిన వారి బంధువు వెంటనే మిగతా వారిని అప్రమత్తం చేశారు. పెళ్లి కూతురు వద్ద తచ్చాడిన ముగ్గురు మహిళల గురించి ఆరా తీశారు. అదే సమయంలో ముగ్గురు మహిళలు కారులో ఎక్కి వెళ్లిపోతుండగా గ్రామస్తులు వెళ్లి వారిని అడ్డుకున్నారు. దీంతో పాటు మహిళలను, కారులో సోదా చేయగా కారులోని మ్యాట్ కింద పుస్తెలతాడు కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన పెళ్లి బృందం సభ్యులతోపాటు గ్రామస్తులు వారికి దేహశుద్ధి చేసి నాగిరెడ్డిపేట పోలీసులకు అప్పగించారు. కారులో లభించిన పుస్తెల తాడును పోలీసులు పెళ్లి బృందం సభ్యులకు అప్పగించడంతో పెళ్లి తంతు యథావిధిగా కొనసాగింది. పెళ్లి కూతురి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బిడ్డ భవిష్యత్ ఏమౌతుందోనని..
తన కుమార్తెకు అంగవైకల్యం.. కట్టుకున్న రెండో భార్యకు సరిగాలేని మానసిక స్థితి.. అయితే భవిష్యత్‌లో తన కుమార్తె పరిస్థితి కూడా తన రెండోభార్యలాగే ఉంటుందేమోనని మనస్థాపం చెందాడో తండ్రి.. రానున్నరోజుల్లో తన బిడ్డ ఆ కష్టం పడకుండా ఉండాలని భావించాడు.. అలా అనుకుని కన్నకూతుర్ని చెరువులో తోసేశాడు.. తన బిడ్డ పోయాక తానుమాత్రం ఎందుకు బతికుండాలని అనుకున్నాడేమో.. తనుకుడా చెరువులో దూకి ప్రాణాలు విడిచాడు.. నాగిరెడ్డిపేట: అంగవైకల్యంతో పుట్టిన కూతురి భవిష్యత్‌ను ఊహించలేక మనస్థాపానికి గరైన ఓ తండ్రి తన కుమార్తెను చెరువులో ముంచి, తానుకూడా అదే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అక్కంపల్లిలో జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. అక్కంపల్లికి చెందిన ఎరుకుల లోకయ్య(32) తన పెద్ద కూతురు కీర్తన(10)తో కలిసి ఆదివారం రాత్రి గ్రామశివారులోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోకయ్యకు 12ఏళ్ల క్రితం లక్ష్మి అనే మహిళతో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు కీర్తన అంగవైకల్యంతో పుట్టింది. కాగా లోకయ్య భార్య చెల్లెలు గంగమణికి మానసికస్థితి సరిగ్గా లేదు. దీంతో ఈనెల 7వ తేదీన మొదటి భార్య లక్ష్మి తన చెల్లెల్ని లోకయ్యకు ఇచ్చి వివాహం జరిపించింది. ఈ క్రమంలో కూతురు కీర్తనను తీసుకొని గోపాల్‌పేటలోని జాతరకు బయల్దేరుతున్నానని ఇంట్లోనుంచి ఆదివారం బయటకు వెళ్లిన లోకయ్య రాత్రయినా ఇంటికి చేరుకోలేదు. సోమవారం ఉదయం బహిర్భూమి కోసం గ్రామశివారుకు వెళ్లిన గ్రామస్తులు చెరువులో తేలిన తండ్రి,కుమార్తె మృతదేహాలను గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో నాగిరెడ్డిపేట ఎస్సై శేఖర్ గ్రామానికి చేరుకొని చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీయించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ చంద్రశేఖర్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని తండ్రి, కూతురి మృతదేహాలను పరిశీలించారు. కాగా అంగవైకల్యం కలిగిన తన కూతురి భవిష్యత్ కూడా తన రెండో భార్యలాగే ఉంటుందేమోనని లోకయ్య ఆందోళనకు గురై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
పంట నష్టంపై సర్వేకు ఆదేశించాం : మంత్రి పోచారం
నాగిరెడ్డిపేట :తెలంగాణలో అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై జిల్లాల వారీగా సర్వేకు ఆదేశించామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలలో సోమవారం ఆయన 'మిషన్ కాకతీయ' పనులను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... భారీవర్షంతో రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, జొన్న, కుసుమలు, సజ్జలు, పసుపు పంటలకు నష్టం జరిగిందన్నారు. సర్వే చేసిన అనంతరం అధికారులు ఇచ్చే నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. నష్ట పరిహారంపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు.