ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరపాలి
- వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు
పిఠాపురం:
కొత్తపల్లి మండలం నాగులాపల్లి పంచాయతీలో జరిగిన అవినీతిపై నిష్పక్షపాతంగా ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే పోరాటంచేస్తామని వైఎస్సార్సీపీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు హెచ్చరించారు. ఆయన శుక్రవారం నాగులాపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన విచారణ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ పాలక వర్గాన్ని పట్టించుకోకుండా నిధులు పక్కదోవపట్టించారని ఆరోపించారు. రికార్డులు చూపించాలని అడిగితే తప్పుడు కేసులు పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని, పోలీసు కేసులకు భయపడేది లేదన్నారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే అధికారులు ఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. తమ బండారం బయటపడుతుందనే రికార్డులు మాయం చేశారని, పోలీసుల సమక్షంలో స్వాధీనం చేసుకున్న రికార్డులు విచారణకు ఎందుకు తీసుకురాలేదో అధికారులు చెప్పాలన్నారు. అన్ని రికార్డులు బహిర్గతం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత వడిశెట్టి నారాయణరెడ్డి, అబ్బిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
.