విహంగ విహారం : నైనితాల్ కేబుల్ కారు, బోట్ షికారు!
నైనితాల్... ఎనభైల నాటి సినిమాల్లో చూసిన ప్రదేశం. కథానుగుణంగా కొన్ని సీన్లను ఇక్కడ చిత్రీకరించేవారు. పాత్రలన్నీ మంకీ క్యాప్, ఉలెన్ స్వెటర్, ఫుల్ షూస్, షాల్‌తో ఇక్కడ చల్లగా ఉంటుందని చెప్పకనే చెప్పే దృశ్యాలుండేవి. ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఢిల్లీ నుంచి మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది. ఆధ్యాత్మికతకు, అడ్వెంచర్‌కి, ప్రశాంతంగా గడపడానికి, నేచర్‌ను ప్రేమించేవారికి అందరికీ, అన్ని వయసుల వారికీ అనువైన టూరిస్ట్ ప్రదేశం ఇది. అయితే పెద్దవాళ్లు మార్చి నుంచి జూన్ మధ్యలో వెళ్లడం బాగుంటుంది. హనీమూన్ కపుల్‌కి ఈ నెల మంచి సమయం. రెండు వేల మీటర్ల ఎత్తులో కుమావ్ పర్వత శ్రేణుల్లో ఉంది నైనితాల్. చుట్టూ హిమాలయ పర్వతాలు, దట్టమైన పచ్చని వృక్షాల మధ్య ఓ సరస్సు. పచ్చదనం మధ్యలో ఉండడం వల్లనేమో నీరు కూడా పచ్చలరాశిని తలపిస్తుంది. పౌరాణిక కథల ప్రకారం సతీదేవి కన్ను పడిన ప్రదేశం ఇదని చెబుతారు. ఈ సరస్సు పరిసరాల్లో ఉండే భీమ్తాల్, సాత్తాల్, నౌకుచియాల్తాల్లకు కూడా పౌరాణిక కథనాలున్నాయి. మనదేశంలో హిల్ స్టేషన్లను ఎక్స్ప్లోర్ చేసింది బ్రిటిషర్లే. చల్లని ప్రదేశాలను వేసవి విడుదులుగా డెవలప్ చేశారు వాళ్లు. దాంతో ఇక్కడ బ్రిటిష్ బంగ్లాల మధ్య విహరిస్తుంటే యూరప్‌ను తలపిస్తుంది. నైనితాల్‌లో బోట్ షికార్‌తో΄పాటు యాచింగ్, పెడలింగ్ చేయవచ్చు. ఇంకా గుడారాల్లో క్యాంపింగ్, పర్వతాల మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, పారా గ్లైడింగ్ చేయవచ్చు. ఏ అడ్వెంచర్ చేసినా చేయకపోయినా కేబుల్ కార్ మాత్రం ఎక్కాల్సిందే. కేబుల్ కార్లో వెళ్తూ తెల్లటి మంచు శిఖరాలను పై నుంచి చూడవచ్చు.