nalla Vijay Kumar
-
మామూలు చీర కాదు.. సిరి చందన పట్టు చీర.. ధర ఎంతంటే!
సిరిసిల్ల: అది మామూలు పట్టుచీర కాదు.. సుగంధాలు వెదజల్లే ‘సిరి చందన పట్టు చీర’.. ఒకటీ రెండు కాదు 27 రకాల సుగంధ ద్రవ్యాలను వినియోగించి తయారు చేసిన పట్టుచీర. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నల్ల విజయ్‌కుమార్ దీనిని రూపొందించారు. పవర్లూమ్పై నేసిన ఈ పట్టుచీరను ఇటీవలే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల చేతులమీదుగా ఆవిష్కరించారు కూడా. నాలుగు దశాబ్దాల కిందటే అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు కుమారుడే విజయ్ కుమార్. ఆయన 2012 నుంచీ మగ్గంపై ప్రయోగాలు చేస్తూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. పట్టుపోగులకు సుగంధాలు అద్ది సుగంధాలు పరిమళించే పట్టుచీరను నేసేందుకు 27 రకాల సుగంధ ద్రవ్యాలను విజయ్‌కుమార్ వినియోగించారు. శ్రీగంధం, నాగకేసరాలు, బిల్వగుజ్జు, పాలసుగంధి, జాపత్రి, జాజికాయ, ఇలాచీ, జటామాంస, భావంచలు, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, కోష్టం, తుంగదుంపలు, గంధ కచోరాలు, ఎర్ర చందనం, కస్తూరి, పసుపు, వట్టివేళ్లు, జవ్వాజి, కురువేళ్లు, దేవదారు, వస, గులాబీ రేకులు, సంపంగి, విరజాజి, కృష్ణతులసి, తాలిసపత్రి మిశ్రమంతో ద్రావణాన్ని తయారు చేశారు. దాన్ని వేడిచేసి అందులో పట్టుపోగులను రెండు రోజుల పాటు నానబెట్టారు. ఇలా సుగంధ పరిమళాలను సంతరించుకున్న పట్టు పోగులతో 15 రోజులపాటు శ్రమించి పట్టుచీరను నేశారు. 500 గ్రాముల బరువుతో 5.500 మీటర్ల పొడవుతో చీరను సిద్ధం చేశారు. ఈ చీర ధర రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుందని.. ఎవరైనా ఆర్డర్ చేస్తే రూపొందించి ఇస్తానని విజయ్‌కుమార్ చెబుతున్నారు. పదేళ్లుగా ఎన్నో ప్రయోగాలు సాంచాలపై వస్త్రోత్పత్తి సాగించే విజయ్‌కుమార్ 2012లో ప్రయోగాలు మొదలుపెట్టారు. తొలుత అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేశారు. తర్వాత ఉంగరంలోంచి దూరే చీర, దబ్బనంలోంచి దూరేంత సన్నని శాలువా, కుట్టు లేని జాతీయ పతాకం, కుట్టులేని లాల్చీపైజామా, అరటినారలతో శాలువా, తామర నారలతో చీర, వెండి కొంగుతో చీర, 220 రంగుల చీర, మూడు కొంగుల చీర.. ఇలా కొత్తగా రూపొందిస్తూ వచ్చారు. ఈ ప్రయోగాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. కొంతమంది నేరుగా విజయ్‌కుమార్‌ను సంప్రదించి ప్రత్యేకంగా పట్టువస్త్రాలను తయారు చేయించి తమవారికి బహుమతులుగా ఇస్తుంటారు. ఇటీవల సిద్దిపేటకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను విజయ్‌కుమార్ వద్ద రూ.12 వేలకు కొని తిరుమల శ్రీవారికి బహూకరించారు. అమెరికా, న్యూజిలాండ్, బెంగళూర్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు, ఎన్నారైలు ఆర్డర్లు ఇచ్చి విభిన్నమైన వస్త్రాలను తయారు చేయించుకుంటారు. (క్లిక్: సర్కారు బడుల్లో వన్ క్లాస్–వన్ టీవీ) కొత్తగా ఏదైనా చేయాలని.. వస్త్రోత్పత్తి రంగంలో కొత్తగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో భిన్నమైన ప్రయోగాలు చేస్తున్నాను. ఊసరవెల్లిలా రంగులు మారే చీరను తయారుచేసే పనిలో ఉన్నాను. బంగారు పోగులతో కొంగును తయారు చేసే ఓ చీర ఆర్డర్ వచ్చింది. సున్నితమైన ఆ పనిని ముందుగా పూర్తి చేయాల్సి ఉంది. అది పూర్తయితే.. మరిన్ని ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నాను. తయారు చేసినవన్నీ వెంటనే అమ్ముడుపోతున్నాయి. – నల్ల విజయ్‌కుమార్, నేత కళాకారుడు -
అట్లాంటాకి తండ్రి.. గోల్కొండకు కొడుకు
నాడు-నేడు / పతాక ప్రదానం అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత చేనేత పట్టుచీరను మగ్గంపై నేసి భారతీయ చేనేత కళానైపుణ్యాన్ని, నేత వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చేనేత శిల్పి నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్ చేనేత మగ్గంపై కుట్టులేని జాతీయ జెండాను నేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన విజయ్‌కుమార్ మూడు రంగుల జాతీయ జెండాను ఎలాంటి కుట్టు లేకుండా, అతుకు లేకుండా చేనేత మగ్గంపై నేశారు. మూడు రోజుల పాటు చేనేత మగ్గంపై శ్రమించి త్రివర్ణ పతాకాన్ని నేసిన నేత కార్మికుడు నల్ల విజయ్‌కుమార్ నిత్య ప్రయోశాలిగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సాధించారు. కుట్టు లేని ‘పట్టు’కళ సిరిసిల్ల సాయినగర్‌కు చెందిన నల్ల విజయ్‌కుమార్ తండ్రి నల్ల పరంధాములు చేనేత శిల్పిగా గుర్తింపు పొందారు. తండ్రి చేనేత కళావారసత్వాన్ని తనయుడు విజయ్‌కుమార్ కొనసాగిస్తున్నారు. తొలిసారిగా నల్ల పరంధాములు 1987లో ఎనిమిది మీటర్ల పొడవున్న చీరను పట్టుదారాలతో అగ్గిపెట్టె ఇమిడిపోయే విధంగా నేసి చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. కుట్టులేని షర్ట్‌ను, కుట్టు లేని జాకెట్‌ను మగ్గంపై నేసి చేనేతలో అద్భుతాలను ఆవిష్కరించారు. 1997లో నల్ల పరంధాములు నేసిన 112 మీటర్ల జాతీయ జెండాను అట్లాంటాలో జరిగిన ఒలింపిక్ వేడుకల్లో భారతీయ క్రీడాకారులు ప్రదర్శించారు. ఎలాంటి కుట్టు లేకుండా పరంధాములు చేనేత మగ్గంపై దానిని నేశారు. చేనేత మగ్గంపై పరంధాములు చేసిన అద్భుతాలకు అవార్డులు వచ్చాయి. కానీ రెక్కాడితే కానీ డొక్క నిండని కార్మికుడైన పరంధాములు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పరంధాములు చేనేత మగ్గంపై వస్త్రం నేస్తూ.. బీడీలు చుడుతూ.. కుటుంబాన్ని పోషించారు. ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తూ.. 2006 ఆగస్ట్ 13న పరంధాములు కన్నుమూశారు. మొన్న శనివారం నాటికి పరంధాములు మరణించి పదేళ్లు అవుతోంది. అదే మగ్గం.. అవే అద్భుతాలు! పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్ తండ్రి బాటలోనే చేనేత మగ్గంపై ప్రయోగాలు చేస్తున్నారు. తండ్రి చేనేత వారసత్వాన్ని కొనసాగిస్తూ.. 2012లో అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరను నేశారు. 8 మీటర్ల పొడవుండే పట్టు చీరను కేవలం వంద గ్రాముల బరువుతో నేసి అబ్బురపరిచారు. 2012లోనే అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు శాలువాను నేశారు. 2013లో దబ్బనంలో దూరే ఐదు మీటర్ల చీరను నేశారు. 2014లో మూడు రకాల డిజైన్లతో మూడు కొంగులతో చీరను, బంగారం పోగులతో మగ్గంపై బ్రాస్లెట్ను చేనేత మగ్గంపై నేసి శభాష్ అనిపించుకున్నారు. 2015 అరటి నారలతో శాలువాను నేసి ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బహుకరించారు. సిరిసిల్ల నల్ల విజయ్‌కుమార్ చేనేత ప్రయోగాలకు గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ చేనేత కార్మికుడి అవార్డును రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందించింది. తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా విజయ్‌కుమార్ నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే చీరను అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్ రోశయ్య ఆవిష్కరించి సత్కరించారు. నాలుగేళ్లుగా విజయ్‌కుమార్ నిత్య ప్రయోగాలతో ముందుకు సాగుతున్నారు. తన తండ్రి నల్ల పరంధాములు జ్ఞాపకార్థం ఆయన నేసిన చేనేత మగ్గాన్ని తన ఇంట్లో భద్రపరచుకుని అదే మగ్గంపై అద్భుతాలను సృష్టిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మూడు రంగుల జాతీయ జెండాను కుట్టు లేకుండా చేనేత మగ్గంపై నేశారు. - వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’, సిరిసిల్ల కష్టాన్ని గుర్తిస్తేనే కళకు గుర్తింపు మా నాన్న చేనేత కళా వారసత్వాన్ని కొనసాగించేందుకు ఈ ప్రయోగాలు చేశాను. ఆర్థికంగా ఇబ్బందులున్నా.. ఇలాంటి ప్రయోగాలతో గుర్తింపు సాధించాలని పని చేస్తున్నాను. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందిస్తే.. చేనేత కళావైభవాన్ని భావితరాలకు చాటిచెప్పేందుకు కృషి చేస్తాను. - నల్ల విజయ్‌కుమార్, చేనేత కార్మికుడు, సిరిసిల్లా