మామూలు చీర కాదు.. సిరి చందన పట్టు చీర.. ధర ఎంతంటే! | Fragrant Silk Sari Weaved by Sircilla Weaver Nalla Vijay Kumar | Sakshi
Sakshi News home page

Fragrant Silk Sari: పవర్‌లూమ్‌పై పరిమళాల పట్టుచీర

Published Mon, Oct 17 2022 2:23 PM | Last Updated on Mon, Oct 17 2022 2:23 PM

Fragrant Silk Sari Weaved by Sircilla Weaver Nalla Vijay Kumar - Sakshi

సిరిసిల్ల: అది మామూలు పట్టుచీర కాదు.. సుగంధాలు వెదజల్లే ‘సిరి చందన పట్టు చీర’.. ఒకటీ రెండు కాదు 27 రకాల సుగంధ ద్రవ్యాలను వినియోగించి తయారు చేసిన పట్టుచీర. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నల్ల విజయ్‌కుమార్‌ దీనిని రూపొందించారు. పవర్‌లూమ్‌పై నేసిన ఈ పట్టుచీరను ఇటీవలే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల చేతులమీదుగా ఆవిష్కరించారు కూడా. నాలుగు దశాబ్దాల కిందటే అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు కుమారుడే విజయ్‌ కుమార్‌. ఆయన 2012 నుంచీ మగ్గంపై ప్రయోగాలు చేస్తూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 


పట్టుపోగులకు సుగంధాలు అద్ది 

సుగంధాలు పరిమళించే పట్టుచీరను నేసేం­దుకు 27 రకాల సుగంధ ద్రవ్యాలను విజయ్‌కుమార్‌ వినియోగించారు. శ్రీగంధం, నాగకేసరాలు, బిల్వగుజ్జు, పాలసుగంధి, జాపత్రి, జాజికాయ, ఇలాచీ, జటామాంస, భావంచలు, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, కోష్టం, తుంగదుంపలు, గంధ కచోరాలు, ఎర్ర చందనం, కస్తూరి, పసుపు, వట్టివేళ్లు, జవ్వాజి, కురువేళ్లు, దేవదారు, వస, గులాబీ రేకులు, సంపంగి, విరజాజి, కృష్ణతులసి, తాలిసపత్రి మిశ్రమంతో ద్రావణాన్ని తయారు చేశారు. దాన్ని వేడిచేసి అందులో పట్టుపోగుల­ను రెండు రోజుల పాటు నానబెట్టారు. ఇలా సుగంధ పరిమళాలను సంతరించుకున్న పట్టు పోగులతో 15 రోజులపాటు శ్రమించి పట్టుచీరను నేశారు. 500 గ్రాముల బరువుతో 5.500 మీటర్ల పొడవుతో చీరను సిద్ధం చేశారు. ఈ చీర ధర రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుందని.. ఎవరైనా ఆర్డర్‌ చేస్తే రూపొందించి ఇస్తానని విజయ్‌కుమార్‌ చెబుతున్నారు. 

పదేళ్లుగా ఎన్నో ప్రయోగాలు 
సాంచాలపై వస్త్రోత్పత్తి సాగించే విజయ్‌కుమార్‌ 2012లో ప్రయోగాలు మొదలుపెట్టారు. తొలుత అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేశారు. తర్వాత ఉంగరంలోంచి దూరే చీర, దబ్బనంలోంచి దూరేంత సన్నని శాలువా, కుట్టు లేని జాతీయ పతాకం, కుట్టులేని లాల్చీపైజామా, అరటినారలతో శాలువా, తామర నారలతో చీర, వెండి కొంగుతో చీర, 220 రంగుల చీర, మూడు కొంగుల చీర.. ఇలా కొత్తగా రూపొందిస్తూ వచ్చారు. ఈ ప్రయోగాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది.

కొంతమంది నేరుగా విజయ్‌కుమార్‌ను సంప్రదించి ప్రత్యేకంగా పట్టువస్త్రాలను తయారు చేయించి తమవారికి బహుమతులుగా ఇస్తుంటారు. ఇటీవల సిద్దిపేటకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను విజయ్‌కుమార్‌ వద్ద రూ.12 వేలకు కొని తిరుమల శ్రీవారికి బహూకరించారు. అమెరికా, న్యూజిలాండ్, బెంగళూర్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు, ఎన్నారైలు ఆర్డర్లు ఇచ్చి విభిన్నమైన వస్త్రాలను తయారు చేయించుకుంటారు. (క్లిక్‌: సర్కారు బడుల్లో వన్‌ క్లాస్‌–వన్‌ టీవీ)


కొత్తగా ఏదైనా చేయాలని.. 

వస్త్రోత్పత్తి రంగంలో కొత్తగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో భిన్నమైన ప్రయోగాలు చేస్తున్నాను. ఊసరవెల్లిలా రంగులు మారే చీరను తయారుచేసే పనిలో ఉన్నాను. బంగారు పోగులతో కొంగును తయారు చేసే ఓ చీర ఆర్డర్‌ వచ్చింది. సున్నితమైన ఆ పనిని ముందుగా పూర్తి చేయాల్సి ఉంది. అది పూర్తయితే.. మరిన్ని ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నాను. తయారు చేసినవన్నీ వెంటనే అమ్ముడుపోతున్నాయి. 
– నల్ల విజయ్‌కుమార్, నేత కళాకారుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement