nallajarla
-
రిపోర్ట్‌లో అసలు గుట్టు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని..
నల్లజర్ల(తూర్పుగోదావరి జిల్లా): అగ్నిసాక్షిగా పెళ్లాడి, తోడునీడగా నిలుస్తానంటూ ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడిగా మారాడు. భార్యను హతమార్చి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పోస్టుమార్టం నివేదికలో అసలు గుట్టు తేలడంతో.. తొలుత అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. దీనిని హత్యగా మార్చారు. నల్లజర్ల సీఐ లక్ష్మణరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. నల్లజర్లకు చెందిన బుసనబోయిన నాగేశ్వరావు, లక్ష్మి దంపతుల కుమార్తె తేజశ్రీకి చిన్నాయగూడేనికి చెందిన సంకుల రాంబాబుతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 13 నెలల పాప నందినీ సాయిదుర్గ ఉంది. ఏ పనికీ వెళ్లకపోవడంతో రాంబాబును అత్తింటివారు నల్లజర్ల తీసుకువచ్చి ఆటోమొబైల్ షాపులో గుమస్తాగా పెట్టారు. ఇటీవల దురలవాట్లకు బానిసైన రాంబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్య తేజశ్రీని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. దీనికితోడు తేజశ్రీకి శరీరంపై ఎలర్జీ రావడంతో డాక్టర్ వద్దకు తీసుకువెళ్లకుండా సూటిపోటి మాటలతో వేధించేవాడు. ఒక రోజు పురుగు మందు తీసుకువచ్చి తాగుతావా లేదా అంటూ ఒత్తిడి చేశాడు. ఈ నెల 10న ఇంట్లో ఎవరూ లేని సమయంలో తేజశ్రీని రాంబాబు దవడపై కొట్టాడు. దీంతో సొమ్మసిల్లి పడిపోయిన భార్యను గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం ఏమీ తెలియనట్టు ఆమే ఫ్యానుకు ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించాడు. అప్పట్లోనే కుటుంబ సభ్యులు అతడిని అనుమానించారు. తేజశ్రీ మృతిపై పోలీసులు అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసు విచారణలో రాంబాబే తన భార్యను గొంతు నులిమి హత్య చేసినట్టు వెల్లడైంది. దీంతో రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: అన్నా చెల్లెళ్ల ముసుగులో సహజీవనం.. ఫ్లాట్ అద్దెకు తీసుకుని.. చివరికి.. -
గంజాయి రవాణా ముఠా అరెస్ట్
సాక్షి, నల్లజర్ల(పశ్చిమ గోదావరి) : ఒక కారులో గట్టుచప్పుడు కాకుండా నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను నల్లజర్ల పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే. విచారణ అనంతరం గురువారం రాత్రి ముఠా సభ్యులను తాడేపల్లిగూడెం పట్టణ సీఐ ఆకుల రఘు, తహసీల్దార్ కనకదుర్గ నిందితుల్ని అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టుకు హాజరుపర్చినట్టు ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కాట్రోడ్డు నవీన్, వడిపే సంజీవ్, విశాఖపట్టణానికి చెందిన వెంకటలక్ష్మి బృందంగా ఏర్పడి కమిషన్‌పై గంజాయి రవాణా చేస్తుంటారు. ఇలా అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారివద్ద నుంచి 80 ప్యాకెట్లలో ఉన్న 160 కిలోల గంజాయి, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
దళారీలకు నాయకుడు చంద్రబాబు నాయుడు
-
జగన్ చెప్పిన ‘మూడు రాళ్లు.. మూడు కథలు’
సాక్షి, నల్లజర్ల: రాష్ట్ర ప్రజానీకాన్ని అన్ని రకాలుగా దోచుకుంటోన్న దళారీలు జన్మభూమి కమిటీలైతే.. ఆ దళారీలకు నాయకుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. పొగాకు, ఆయిల్‌పామ్, వరి, మొక్కజొన్న.. ఏ ఒక్కపంటకూ గిట్టుబాటు ధర కల్పించలేని ముఖ్యమంత్రి.. మరోవైపు తన హెరిటేజ్ సంస్థ కోసం రైతులను నిలువునా ముంచేస్తున్నారని, పంటల్ని తక్కువ ధరకు కొనుగోలుచేసి, మూడింతల లాభలకు అమ్ముకుంటూ తానే పెద్ద దళారీగా అవతరించాడని ఆరోపించారు. 165వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. పైసలు మింగుతున్నారుతప్ప పోలవరం పూర్తిచేయట్లేదు: ‘‘ఇక్కడి రైతులు, జనం నాతో చాలా విషయాలు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మా నియోజకవర్గం కూడా సస్యశామలం అవుతుందని, ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు పూర్తికావడంలేదని బాధపడుతున్నారు. నిజమే, 30 లక్షల క్యూబిక్ మీటర్ల పనిలో 6లక్షల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే పూర్తయింది. అసలు కేంద్రం పూర్తిచేయాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు తీసుకోవడమేంటి? సిమెంట్, ఇసుక.. ధరలన్నీ తగ్గినా కాంట్రాక్టుల రేట్లు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. నామినేషన్ పద్ధతితో తన బినామీలకు సబ్ కాంట్రాక్టులు అప్పగించారు. కేవలం డబ్బులు దండుకోవడమేతప్ప పనులు పూర్తిచేయాలన్న ధ్యాసేలేదు. రాష్ట్రానికి వరదాయినిలాంటి ప్రాజెక్టును ఇంత దారుణంగా విస్మరిస్తున్నారు. నిజానికి చంద్రబాబుకు ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు, ప్రాజెక్టులు గుర్తుకువస్తాయన్నది తెలిసిందే. దీని గురించి ఇక్కడి రైతులే నాకొక కథ చెప్పారు.. అది ‘‘మూడు రాళ్ల కథ..’ మూడు రాళ్లు.. మూడు కథలు: గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలోని ఇదే నియోజకవర్గం చుట్టుపక్కల మూడు ప్రాజెక్టులకు శిలాఫలాకాలు ఆవిష్కరించారు. ఒకటి తాడేపూడి ప్రజెక్టు. సుమారు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఆ ప్రాజెక్టుకు చంద్రబాబు రాయి వేసి ఊరుకుంటే.. మహానేత వైఎస్సార్ మాత్రం పనులు దాదాపు పూర్తిచేయించారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు వచ్చి తాడేపూడి ప్రాజెక్టుకు పిల్లకాలువలు కూడా తవ్వించలేకపోయారు. రెండోది కొవ్వాడ కాలువపై ఎల్లెండిపేట వద్ద రిజర్వాయర్ నిర్మాణం. దానికీ చంద్రబాబే రాయివేసి వెళ్లిపోయారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందే అవకాశమున్న ఆ ప్రాజెక్టునూ వైఎస్సారే కట్టించారు. ఇక మూడోది ద్వారకా తిరుమల మండలం సీహెచ్ పోతేపల్లి వద్ద గిరియమ్మ ప్రాజెక్టు. చంద్రబాబు శిలాఫలకం మాత్రమే వేసిన ఆ ప్రాజెక్టును వైఎస్సార్ 2010లోనే పూర్తిచేసి, ట్రయల్‌రన్ చేయించారు. ఇప్పటివరకూ ఆ ప్రజెక్టుకు పిల్లకాలువలు కట్టించే పనులు పూర్తికాలేదంటే రైతులపట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మోసగాళ్లు అవసరమా?: ఎన్నికల సమయంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. అందులో ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. అబద్ధాలు చెబుతూ, మోసాలు చేసేవాళ్లు నాయకులు మనకు అవసరమా? ఒకప్పుడు రేషన్ షాపులో 185 రూపాయలకే అన్ని నిత్యావసరాలు వచ్చేవి. ఇవాళ రేషన్ కార్డులనే ఎత్తేసే పరిస్థితి. పెట్రోల్, డీజిల్‌పై విపరీతంగా పన్నులు బాదుతున్నారు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ టికెట్ల ధరలు అదుపులేకుండా ఉన్నాయి. బాబు చేతిలో మోసపోనివారంటూ ఎవరూలేరు. హోదాపై బాబు దగా: చంద్రబాబు చేసిన అన్ని మోసాల్లోకి ప్రత్యేక హోదా అంశంలో దారుణంగా మోసం చేశాడు. నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగిన ఆయనకు ప్రత్యేక హోదా గుర్తుకురాలేదు. అనునిత్యం హోదా నినాదాన్ని అవమానించి, చులకన చేస్తూ మాట్లాడాడు. వైఎస్సార్సీపీ ఆందోళనలు చేస్తే అడ్డుకున్నాడు. మొన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజు వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. అదే సమయంలో టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసుంటే హోదా వచ్చేదే. ఆ పనిచేయకుండా దీక్షల పేరుతో నాటకాలకు తెరలేపారు చంద్రబాబు. ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పేవాళ్లకు బుద్ధిచెప్పాలి. పొరపాటున క్షమిస్తే రేపు ఇంటికో కేజీ బంగారం, కారు ఇస్తానని ముందుకొస్తాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వరాలు: రేప్పొద్దున ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే ప్రజాప్రభుత్వంలో ఏమేం చెయ్యబోతున్నది నవరత్నాల ద్వారా ఇప్పటికే చెప్పాం. అందులో నుంచి డ్వాక్రా మహిళలకు ఏమేం చెయ్యబోతున్నామో మరోసారి గుర్తుచేస్తాను.. మన ప్రభుత్వ రాగానే పొదుపు సంఘాల అప్పు ఎంత ఉందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా వారి చేతికే ఇస్తాం. సున్నా వడ్డీకి రుణాలు ఇప్పిస్తాం. ప్రతి పేద వాడికీ ఇల్లు కట్టిస్తాం. ఆ ఇంటిని మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇంటిని తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి పావలా వడ్డీకి అప్పు తీసుకునేలా ఏర్పాటు చేయిస్తాం..’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
ఏ దిల్ ‘మేంగో’ మోర్..!
నల్లజర్ల : వేసవికాలంలో మామిడి కాయలు కాయడం సహజం. కొన్ని కాలానికి విరుద్ధంగా కాస్తాయి అవి పునాస మామిడి చెట్లు. కానీ ఇక్కడ ఏ కాలంలోనైనా కాయలు కాస్తూ ఓ మామిడి చెట్టు ‘ఏ దిల్ ‘మేంగో’ మోర్ అంటోంది. నల్లజర్ల కొత్తపేట ఎస్సీ కాలనీకి చెందిన గుదే వెంకట సుబ్బారావు ఇంటి వద్ద ఉన్న మామిడి చెట్టు ఏడాది పొడవునా కాయలు కాస్తూనే ఉంది. కడియపు లంక నుంచి తీసుకువచ్చి మొక్కను నాటినట్టు ఆయన చెప్పారు. రెండేళ్ల నుంచి నిత్యం కాయలు కాస్తూనే ఉందన్నారు. పచ్చిగా ఉన్నపుడు పప్పుల్లోను, పండిన తర్వాత పళ్లుగాను ఈ వీధివారంతా వినియోగిస్తున్నట్టు సుబ్బారావు చెప్పారు. -
కట్టుకున్నవాడే కాలయముడై..!
నల్లజర్ల: నల్లజర్ల కోనేటి కాలనీలో ఓ మహిళ హత్యకు గురైంది. శుక్రవారం రాత్రి ఘటన జరిగిందని తాడేపల్లిగూడెం రూరల్ సీఐ జి.మధుబాబు శనివారం విలేకరులకు చెప్పారు. వివరాలిలా ఉన్నా యి.. కాలనీకి చెందిన కొవ్వల శ్రీను అదేకాలనీకి చెందిన లక్షి్మని ఏడేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. దీంతో ఇరుపక్షాల వారు వీరిని దగ్గరకు రానివ్వకపోవడంతో కాలనీ శివారులో పూరింట్లో నివాసముంటున్నారు. వారికి ఆరేళ్ల కుమార్తె అనిత ఉంది. వ్యసనాలకు బానిసైన శ్రీను తరచూ లక్షి్మతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మ«ధ్యాహ్నం నుంచే భార్యభర్తలిద్దరూ తగదా పడినట్టు పరిసర ప్రాంత వాసులు చెబుతున్నారు. రాత్రి 9 గంటల సమయంలో లక్ష్మి స్నేహితురాలు కృష్ణవేణి వచ్చి చూసేసరికి లక్ష్మి నేలపై అచేతనంగా పడి ఉంది. దీంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి పోలీసులకు సమాచారం అందించింది. అనంతపల్లి ఎస్సై వెంకటేశ్వరావు, తాడేపల్లిగూడెం రూరల్ సీఐ మధుబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య కేసుగా నమోదు చేశారు. మృతురాలు లక్ష్మి (23) గొంతు మీద, చాతీ మీద గాయాలున్నాయి. ముఖం అంతా కమిలిపోయి ఉంది. భర్త శ్రీను అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు శ్రీను ప్రేమించినట్టు నటించి తన కూతురు జీవితం మట్టిపాలు చేశాడని మృతురాలి తండ్రి పాముల వెంకటేశ్వరావు, తమ్ముడు చిన్నబాబు, నాయనమ్మ తులసమ్మ ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మధుబాబు తెలిపారు. వ్యసనాలకు బానిసై.. వ్యసనాలకు బానిసైన శ్రీను కొంత కాలంగా భార్యతో వ్యభిచారం చేయిస్తున్నాడని కోనేరు కాలనీవాసులు చెబుతున్నారు. దీంతోపాటు ఆమెకు మద్యం అలవాటు చేశాడని, వ్యభిచారం చేయనంటే చితకబాదేవాడని అంటున్నారు. శుక్రవారం రాత్రి కూడా ఈ విషయంలోనే వీరి మధ్య గొడవ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాలనీ శివారు పడిపోయేస్థితిలో ఉన్న పూరింట్లో వీరు నివాసముంటున్నారు. లక్ష్మి మృతితో కుమార్తె అనిత అనాథగా మారింది. చిన్నారి బిత్తర చూపులు స్థానికులను కంటతడి పెట్టించాయి. -
చంద్రన్నా.. మా మొర ఆలకించన్నా..
నల్లజర్ల రూరల్ : ‘మేమంతా అర ఎకరం.. ఎకరం.. రెండు ఎకరాలు సాగు చేసుకుంటున్న దళిత, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలం. దశాబ్దాలుగా పోడు భూములను వ్యవసాయూనికి అనుగుణంగా బాగు చేసుకుని వాటిని సాగు చేసుకుని జీవిస్తున్నాం. ఇప్పుడిప్పుడే మా కష్టానికి తగిన ఫలాలు అందుకోబోతున్నాం. ఈ లోగా పరిశ్రమల స్థాపన అంటూ తరతరాలుగా మేం సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను లాక్కొని మా నోటి దగ్గర ముద్దను దూరం చేసేందుకు మీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చంద్రన్నా.. నీవన్నా మా మొర ఆలకించి ఆ భూములను లాక్కోవద్దనా’.. అంటూ నల్లజర్ల మండలంలోని రైతులు వాపోతున్నారు. నల్లజర్ల మండలం దూబచర్లలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్క్‌కు 586.25 ఎకరాల భూమిని తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిపై రైతులు మూకుమ్మడిగా ఆరు నెలలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మరోపక్క కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ భూముల్లో 58.25 ఎకరాలు జిరాయితీ భూమి కాగా 18 ఎకరాలు ప్రభుత్వం పోరంబోకు,510 ఎకరాలు అసైన్డ్ భూమి ఉంది. తాతలు, దండ్రుల నాటి నుంచి పోడు భూమిని అభివృద్ధి చేసి చదును చేసి వారు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో నిమ్మ, ఆయిల్‌పామ్, జీడిమామిడి, సీతాఫలం వంటి పంటలతో పాటు సంవత్సరానికి మూడు పంటలు పండే విధంగా బోర్లు వేశారు. వాటి ఫలాలు ఇప్పుడిప్పుడే వారికి చేతికి అందబోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ భూములను పరిశ్రమలకు కేటాయించాలంటూ ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నేడు సీఎం దృష్టికి సమస్య ప్రభుత్వం నిర్ణయం కనుక అమలు జరిగితే దాదాపు దళిత, బీసీ వర్గాలకు చెందిన 500 కుటుంబాలు వీధిన పడనున్నాయి. భూములు పోతే ప్రత్నామ్నాయం లేక వలసలు పోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జన్మభూమి-మా ఊరు సభలో పాల్గొనేందుకు శుక్రవారం నల్లజర్ల వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లనున్నట్టు రైతులు నందమూరి సుబ్రహ్మణ్యం, తాడిగడప శ్రీనివాసరావు, కారెం రాంబాబు, కారెం అచ్చియ్య, బోడిగడ్ల వెంకట సుబ్బారావు, సుసేశ్వరావు, పొంగులేటి అబద్ధం, తోట సుబ్బారావు తదితరులు తెలిపారు. తమ మొరను ముఖ్యమంత్రి ఆలకించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారంతా వాపోతున్నారు. పేదల భూములే కావాలా ? పరిశ్రమలు పెట్టడానికి పేదల భూములే కావాలా? చాలా మంది పెద్ద రైతుల వద్ద భూములున్నాయి. 80 ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుని అభివృద్ధి చేస్తే ఆ భూముల్ని మా దగ్గర లాక్కొని బడా పారిశ్రామిక వేత్తలకు ధారదత్తం చేయూలని చూడడం దారుణం. - కారెం రాంబాబు, రైతు, ముసుళ్ళగుంట పురోగమనమా? తిరోగమనమా? చంద్రబాబు గారి ప్రభుత్వం అభివృద్ధి పురోగమనమా? తిరోగమనమో అర్థం కావడం లేదు. పోడుభూముల్ని అభివృద్ధి చేసి ఇప్పుడిప్పుడే సుస్థిర పడుతున్నాం. ఇప్పుడు భూముల్ని లాక్కుంటే మేం ఎక్కడికి పోవాలి? మా పిల్లల బతుకులు ఏం కావాలి. రోడ్డున పడితే ఆయనకి సంతోషమా? - శొంఠి వరలక్ష్మి, రైతు, దూబచర్ల -
అనుమతి లేని ఆసుపత్రులపై చర్యలు
నల్లజర్ల రూరల్: అనుమతులు లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాడేపల్లిగూడెం క్లస్టర్ డాక్టర్, అడిషనల్ డీఎంహెచ్‌వో జి.సుజాత హెచ్చరించారు. నల్లజర్ల మండలంలోని దూబచర్ల, నల్లజర్ల గ్రామాల్లో మూడు ఆసుపత్రులు, మూడు ల్యాబ్‌ల అనుమతి పత్రాలను మంగళవారం ఆమె పరిశీలించారు. దూబచర్లలో కొల్లా విజయభాస్కర్ నిర్వహిస్తున్న క్లినిక్‌కు ఎటువంటి అనుమతి, అర్హత పత్రాలు లేనట్టు పరిశీలనలో వెల్లడైందని చెప్పారు. అక్కడ గోదావరి సూపర్ స్పెషల్ క్లినిక్ పేరిట ప్రిస్కిప్షన్ ప్యాడ్లు ఉన్నాయని తాను బీహెచ్ఎంఎస్ చదివినట్టు డాక్టర్ చెబుతున్నారన్నారు. తన సర్టిఫికెట్లు విజయవాడ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఉన్నాయని రెండు రోజుల్లో అందించగలనని విజయభాస్కర్ అధికారులకు తెలిపారు. అప్పటివరకు క్లినిక్‌ను మూసిఉంచాలని తాను ఆదేశించానని సుజాత తెలిపారు. నల్లజర్లలో శ్రీశ్రీ డెంటల్ ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ లేదని, వెంటనే చేరుుంచాలని డాక్టర్ గన్నమనేని శ్రీనివాస్‌కు ఆమె సూచించారు. పీఎంపీలు, ఆర్ఎంపీలు పరిధి దాటి వైద్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నల్లజర్ల పీహెచ్సీ డాక్టర్ జి.సుధీర్‌కుమార్, క్లస్టర్ హెల్త్ ఎడ్యుకేటర్ వీవీ శ్రీరామ్మూర్తి, సూపర్వైజర్ సుభాకర్ ఆమె వెంట ఉన్నారు. -
పోలీసులకు చిక్కిన నకిలీ డాక్టర్ రమేష్?
నల్లజర్ల రూరల్ : పది రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న నల్లజర్ల వైబీ ఆసుపత్రి నకిలీ డాక్టర్ జువ్వల రమేష్ శనివారం ఏలూరులో పోలీసులకు చిక్కినట్టు సమాచారం. శుక్రవారం సీహెచ్.పోతేపల్లిలో ప్రత్యక్షమై పోలీసులకు చిక్కినట్టే చిక్కి మాయమయ్యాడు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు చివరకు ఏలూరులో చిక్కినట్టు తెలుస్తోంది. ఎటువంటి వైద్యానుభవం లేకున్నా మెడికల్ రిప్రెజెంటివ్‌గా పనిచేసిన అనుభవంతో వైబీ హాస్పటల్, జీ.వి.సాగర్, ఎమ్మెస్ జనరల్ పేరుతో మూడేళ్లుగా రమేష్ అనే వ్యక్తి నల్లజర్లలో ఆసుపత్రి నడుపుచున్నాడు. ఆసుపత్రిలో పనిచేసే నర్సు మృతికి కారణమైన అతడిపై కేసు నమోదవడంతో నకిలీ డాక్టర్ గుట్టు రట్టైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీహెచ్ పోతేపల్లి నుంచి పరారైన అతడు ఏలూరు పోలీసులకు చిక్కాడని తెలిసింది. -
నల్లజర్లకు చేరుకున్న వైఎస్ జగన్
-
'వైఎస్సాఆర్ పరిపాలనలో సంక్షేమం పరుగులు తీసింది'
-
ముగ్గుర్ని బలిగొన్న మృత్యువు
పుల్లలపాడు (నల్లజర్ల), న్యూస్‌లైన్ : శ్రమను, సేద్యాన్ని నమ్ముకున్న కష్టజీవులు వారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. చిన్నవెంకన్న వారి ఇంటి ఇలవేల్పు. ఏటా ఆయన్ను కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఆనవాయితీ. స్వామి వారిని దర్శించుకునేందుకు బయలుదేరిన ఆ కుటుంబంలోని ముగ్గురిని మృత్యువు కబళించింది. అంతులేని విషాదాన్ని నింపింది. నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద బుధవారం ఉదయం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆటో డ్రైవర్ సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి, మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లజర్ల మండలం శింగరాజుపాలెంకు చెందిన నెక్కలపూడి ప్రసాద్ కుటుంబానికి ఏటా చినవెంకన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. బుధవారం ఉదయం ప్రసాద్‌తో పాటు అతడి భార్య వరలక్ష్మి (55) కొడుకు నెక్కల పూడి వీరాస్వామి (బుజ్జిబాబు), కోడలు ధనలక్ష్మి (30), మనుమలు కీర్తి, మంజులతో కలిసి ఆటోలో ద్వారకాతిరుమల బయలుదేరారు. ఆటో పుల్లలపాడు సమీపంలోకి రాగా, ఎదురుగా విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఏపీ 16 బీజే 5803 నంబర్ కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో వరలక్ష్మి, చిన్నారి కీర్తి (8) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ధనలక్ష్మిని 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుం డగా మార్గమధ్యంలో భీమడోలు వద్ద మృతి చెందింది. ప్రమాదంలో గాయపడిన ప్రసాద్, వీరాస్వామి, ఆటోడ్రైవర్ మిర్యాల రమేష్‌లను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి రాజానగరం జీఎస్ఎల్ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్, అందులో ఉన్న వారు పరారయ్యారు. చెల్లాచెదురైన మృతదేహాలు ప్రమాదం జరిగిన తీరు స్థానికులు, వాహన చోదకులను కలచివేసింది. కారు ఆటోను బలంగా ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వరలక్ష్మి, కీర్తి ఎగిరి పది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టారు. ఈ ప్రమాదంతో శింగరాజుపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రసాద్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తమకున్న కొద్ది పొలంతో పాటు అదనంగా పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ప్రమాదంలో భార్య, కోడలు, మనుమరాలు మృతి చెందడం, మిగిలిన వారు తీవ్రంగా గాయపడడంతో వారి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై డి.భగవాన్ ప్రసాద్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని సీఐ చింతా రాంబాబు పరిశీలించారు.