ముగ్గుర్ని బలిగొన్న మృత్యువు | Auto collided with a car, beaten | Sakshi
Sakshi News home page

ముగ్గుర్ని బలిగొన్న మృత్యువు

Published Thu, Sep 12 2013 4:47 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Auto collided with a car, beaten

పుల్లలపాడు (నల్లజర్ల), న్యూస్‌లైన్  : శ్రమను, సేద్యాన్ని నమ్ముకున్న కష్టజీవులు వారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. చిన్నవెంకన్న వారి ఇంటి ఇలవేల్పు. ఏటా ఆయన్ను కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఆనవాయితీ. స్వామి వారిని దర్శించుకునేందుకు బయలుదేరిన ఆ కుటుంబంలోని ముగ్గురిని మృత్యువు కబళించింది. అంతులేని విషాదాన్ని నింపింది. నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద బుధవారం ఉదయం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆటో డ్రైవర్ సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి, మరో ఇద్దరు మహిళలు ఉన్నారు.  పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
 
 నల్లజర్ల మండలం శింగరాజుపాలెంకు చెందిన నెక్కలపూడి ప్రసాద్ కుటుంబానికి ఏటా చినవెంకన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. బుధవారం ఉదయం ప్రసాద్‌తో పాటు అతడి భార్య వరలక్ష్మి (55) కొడుకు నెక్కల పూడి వీరాస్వామి (బుజ్జిబాబు), కోడలు ధనలక్ష్మి (30), మనుమలు కీర్తి, మంజులతో కలిసి ఆటోలో ద్వారకాతిరుమల బయలుదేరారు. ఆటో పుల్లలపాడు సమీపంలోకి రాగా, ఎదురుగా విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఏపీ 16 బీజే 5803 నంబర్ కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో వరలక్ష్మి, చిన్నారి కీర్తి (8) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ధనలక్ష్మిని 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుం డగా మార్గమధ్యంలో భీమడోలు వద్ద మృతి చెందింది. ప్రమాదంలో గాయపడిన ప్రసాద్, వీరాస్వామి, ఆటోడ్రైవర్ మిర్యాల రమేష్‌లను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి రాజానగరం జీఎస్‌ఎల్ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్, అందులో ఉన్న వారు పరారయ్యారు. 
 
 చెల్లాచెదురైన మృతదేహాలు 
 ప్రమాదం జరిగిన తీరు స్థానికులు, వాహన చోదకులను కలచివేసింది. కారు ఆటోను బలంగా ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వరలక్ష్మి, కీర్తి ఎగిరి పది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టారు. ఈ ప్రమాదంతో శింగరాజుపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రసాద్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 
 
 తమకున్న కొద్ది పొలంతో పాటు అదనంగా పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ప్రమాదంలో భార్య, కోడలు, మనుమరాలు మృతి చెందడం, మిగిలిన వారు తీవ్రంగా గాయపడడంతో వారి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై డి.భగవాన్ ప్రసాద్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని సీఐ చింతా రాంబాబు పరిశీలించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement