వెలిగొండ.. కల సాకారం
సాక్షి, అమరావతి: ప్రజాసంకల్ప పాదయాత్రలో రైతులకిచ్చిన మరో మాటను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును సాకారం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టన్నెల్‌ను 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించిన సీఎం జగన్.. రెండో టన్నెల్ తవ్వకం పనులను ఈ ఏడాది జనవరి 21 నాటికి పూర్తిచేయించారు.
ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాల (ఇరిగేషన్ టన్నెల్స్)ను రికార్డు సమయంలో పూర్తిచేయడం ద్వారా ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ జంట సొరంగాలను బుధవారం సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. వచ్చే సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలు చేరి, నీటి మట్టం కనీస స్థాయికి అంటే 854 అడుగులకు చేరుకున్న వెంటనే వెలిగొండ జంట సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు తరలించడానికి రంగం సిద్ధంచేశారు.
తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రభావిత 30 మండలాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.. 15.25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు కూడా ఈ ప్రాజెక్టు పూర్తి ద్వారా సీఎం జగన్ శాశ్వత పరిషారం చూపారు.
చంద్రబాబు దోపిడీని కడిగేసిన కాగ్..
ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే ఖర్చుచేశారు. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ కోసం మాత్రమే. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు.
2014–2019 వరకూ రూ.1,385.81 కోట్లు ఖర్చుచేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. జీఓ–22 (ధరల సర్దుబాటు), జీవో–63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లను దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తిచేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు.
మరమ్మతు చేయకపోవడంవల్ల టీబీఎంలు ఎందుకూ పనికిరాకుండాపోయాయి. ఇక 2018, 2019 నాటికి పూర్తిచేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిస్తూ వచ్చిన చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, కమీషన్లు వసూలుచేసుకుని ప్రాజెక్టు పనులను గాలికొదిలేశారు. వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు దోచేయడాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగిపారేసింది.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్..
♦ 2019లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గత 58 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనావల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినాసరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిమీల పనులను 2019, నవంబరులో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించారు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగంలో రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. అలాగే, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదలచేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తిచేయించారు.
♦ ఇక రెండో సొరంగం మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వాటిని రద్దుచేసిన సీఎం జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ.ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు.
♦రెండో సొరంగంలో టీబీఎంకు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడం కూడా కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు.
మంగళవారం నాటికి రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. 7.685 కి.మీల పొడవున తవ్వకం పనులు, హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు. మరోవైపు.. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం.
♦ఇక టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను చేపట్టిన సీఎం వైఎస్ జగన్ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించనున్నారు.
♦ ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.978.02 కోట్లను సీఎం వైఎస్ జగన్ ఖర్చుచేశారు. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తిచేయించారు.
నల్లమలసాగర్.. ఓ ఇంజినీరింగ్ అద్భుతం
ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలిగొండలు అంటారు. వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల (గ్యాప్)ను కలుపుతూ 373.5 మీటర్ల పొడవు, 63.65 మీటర్ల ఎత్తు (సుంకేశుల డ్యామ్)తో.. 587 మీటర్ల పొడవు, 85.9 మీటర్ల ఎత్తు (గొట్టిపడియ డ్యామ్)తో 356 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తు (కాకర్ల డ్యామ్)తో మూడు డ్యామ్‌లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంది.
ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపునున్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలిస్తారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీ.ల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం.
దుర్భిక్ష ప్రాంతాల రూపురేఖల్లో సమూల మార్పు..
ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన దొనకొండ వద్ద 24,358 ఎకరాల్లో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. ఇందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేయడానికి వెలిగొండ ప్రాజెక్టులో 2.58 టీఎంసీలను ప్రభుత్వం కేటాయించింది. పామూరు, పెద్దచెర్లోపల్లి మండలాల్లో, ఉప్పలపాడు పరిసర ప్రాంతాల్లో 14 వేల ఎకరాల్లో నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ జోన్) ఏర్పాటుకూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఇందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు వెలిగొండ ప్రాజెక్టులో 1.27 టీఎంసీలు కేటాయించింది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో మెగా ఇండస్ట్రియల్ హబ్, నిమ్జ్‌లలో భారీఎత్తున పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. తద్వారా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. మరోవైపు.. సాగునీటి సరఫరా చేయడంవల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. వెలిగొండ ప్రాజెక్టు పూర్తవడంతో ఈ జిల్లాల రూపురేఖలు సమూలంగా మారిపోతాయని అధికారవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం
వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన జంట సొరంగాలను సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధి, అంకితభావంవల్లే పూర్తి చేయగలిగాం. టీబీఎంలు పనిచేయకపోవడంతో సంప్రదాయ పద్ధతి (బ్లాస్టింగ్ చేయడం, మనుషుల ద్వారా తవ్వడం)లో పనులు చేపట్టాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సంప్రదాయ పద్ధతిలో పనులు చేపట్టడంవల్లే రెండు సొరంగాలను పూర్తి చేయగలిగాం. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ
ఇదో మహోజ్వల ఘట్టం
వెలిగొండ ప్రాజెక్టును మహానేత వైఎస్సార్ చేపడితే.. ఆయన తనయుడు సీఎం జగన్ పూర్తిచేసి బుధవారం జాతికి అంకితం చేయనున్నారు. తండ్రి చేపట్టిన ప్రాజెక్టును తనయుడు పూర్తిచేసి జాతికి అంకితం ఇవ్వడం నీటిపారుదలరంగ చరిత్రలో మహోజ్వల ఘట్టం. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి సీఎం జగన్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు.– సి.నారాయణరెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్, ఏపీ జలవనరుల శాఖ
మహానేత వైఎస్సార్ ముందుచూపునకు తార్కాణం
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో... రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీ.ల పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్‌కు నీటిని తరలించి ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలని 1993–94లో డీపీఆర్ రూపొందించారు. కానీ, 2004 వరకూ పట్టించుకోలేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ డీపీఆర్‌ను సమూలంగా మార్చేశారు.
కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్‌లో నిల్వచేసి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిç³డియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో వైఎస్సార్ 2004, అక్టోబర్ 27న శ్రీకారం చుట్టారు.
రూ.3,610.38 కోట్లు ఖర్చుచేసి.. నల్లమలసాగర్‌తోపాటు సొరంగాల్లో చాలావరకు పనులు పూర్తిచేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసేలా 23 కి.మీల పొడవున ఫీడర్ చానల్ పనులను చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు.
నల్లమలసాగర్ రిజర్వాయర్సమగ్ర స్వరూపం
♦ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 53.85 టీఎంసీలు
♦ వినియోగించే జలాలు 43.50 టీఎంసీలు
♦ గరిష్ఠ నీటి మట్టం 244 మీటర్లు (సముద్ర మట్టానికి)
♦ కనీస నీటి మట్టం214.3 మీటర్లు
♦ డెడ్ స్టోరేజ్ 10.35 టీఎంసీలు
♦ పంటలకు అవసరమైన జలాలు 38.57 టీఎంసీలు
♦ తాగునీటికి కేటాయించినవి 1.57 టీఎంసీలు
♦ ఆవిరి నష్టాలు3.36 టీఎంసీలు
వెలిగొండ ప్రాజెక్టు పనులకు వ్యయం ఇలా..
♦ ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.10,010.54 కోట్లు
♦ పరిపాలన అనుమతి: రూ.8,043.85 కోట్లు
♦ 2004–14 (మహానేత వైఎస్ హయాంలో) వ్యయం: రూ.3,610.38 కోట్లు
పనులకు రూ.2,890.17 కోట్లు
భూసేకరణకు రూ.262.64 కోట్లు
పునరావాసం కల్పనకు రూ.20.53 కోట్లు
అటవీ అనుమతులకు రూ.437.04 కోట్లు
♦ 2014–19 మధ్య వ్యయం (చంద్రబాబు హయాంలో) : రూ.1,385.81 కోట్లు
పనులకు రూ.1,208.35 కోట్లు,
భూసేకరణకు రూ.114.89 కోట్లు
పునరావాసం కల్పనకు రూ.62.57 కోట్లు
♦ 2019 మే 30 నుంచి ఇప్పటివరకూ (సీఎం జగన్ హయాంలో) వ్యయం: రూ.978.02 కోట్లు
పనులకు రూ.822.08 కోట్లు
భూసేకరణకు రూ.79.21 కోట్లు
పునరావాసం కల్పనకురూ.76.73 కోట్లు
♦ మొత్తం వ్యయం: రూ.5,974.21 కోట్లు
♦ ప్రాజెక్టు పూర్తికి ఇంకా అవసరమైన నిధులు: రూ.4,036.33 కోట్లు