పులుల లెక్కే లేదు!
అచ్చంపేట: నల్లమల అభయారణ్య ప్రాంతంలో వన్యప్రాణుల గణన చేపట్టి ఏడాదిదాటినా ఇంతవరకు వాటి లెక్క తేలలేదు. పులులు, చిరుతలు, ఇతర జంతువులతో పాటు పక్షుల లెక్కలు కూడా ఇందులో రావాల్సి ఉంది. ప్రతి నాలుగేళ్లకోసారి దేశావ్యాప్తంగా పులుల గణన జరుగుతుంది. అందులో భాగంగా గత ఏడాది జనవరి 18 నుంచి 25 వరకు ఉమ్మడి రాష్ట్రంలోని శ్రీశైలం-నాగార్జునసాగర్, ఆదిలాబాద్ జిల్లా కావల్-జన్నారం అటవీ ప్రాంతంలో జంతువుల లెక్కింపు చేపట్టారు.
పులులు సంచరించే ప్రాంతం నుంచి శాస్త్రీయ పద్ధతుల్లో పాదముద్రలు (ప్లగ్ మార్కులు) సేకరించారు. వాటిని జాతీయ పులుల సంరక్షణ సంస్థ(ఎన్‌టీసీఏ)కు పంపారు. అయితే ఇప్పటికీ పులుల సంఖ్య ఎంతో ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎన్‌టీసీఏ పరిధిలో ఉన్న 44 టైగర్ ప్రాజెక్టుల అభయారణ్యంలో చివరిసారిగా 2010లో పులుల గణన జరిగింది. అప్పట్లో శ్రీశైలం-నాగార్జునసాగర్ ఆభయారణ్యంలో 53-67 మధ్య పులులు ఉన్నట్లు తేల్చారు.
అటవీశాఖ లోతట్టు అటవీప్రాంతాల్లో లెక్కలు తీయడం లేదనే విమర్శలున్నాయి. సంప్రదాయ గణనను విశ్వసించని కేంద్రం ప్రతిఏటా కెమెరా ట్రాప్ మానిటరింగ్ టెక్నాలజీ ద్వారా పులుల గణన చేపడుతోంది. 2006 లెక్కల ప్రకారం 39 పులులుంటే... 2013లో ఆ సంఖ్య 19కి వచ్చింది. అటవీశాఖ కూడికలు, తీసివేతల ప్రకారం పులులు, చిరుతల లెక్కలు చెబుతున్నారే తప్ప వాస్తవంగా ఎన్ని ఉన్నాయన్న విషయం ఎవరికీ తెలియదు.
విభజన తర్వాత..
నల్లమల అటవీప్రాంతమైన నాగార్జునసాగర్-శ్రీశైలం రాజీవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు మహబూబ్‌నగర్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నల్లగొండ జిల్లాల పరిధిలో 3,568 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 2,220 చదరపు కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌కు 1,348 చదరపు కిలోమీటర్లు కేటాయించారు. తెలంగాణ పరిధిలో 15 నుంచి 20, ఆంద్రప్రదేశ్ పరిధిలో 33నుంచి47 వరకు పులులుంటాయని అధికారులు భావిస్తున్నారు.
పులుల సంరక్షణకు అనుకూలం...
ప్రకృతి సంపదకు పుట్టినిల్లు అయిన నల్లమల అడవి ప్రాంతంలో వన్యప్రాణులను అటవీశాఖ కాపాడుకోలేకపోతుంది. రాజీవ్ టైగర్ ప్రాజెక్టు అభివ ృద్ధికి కేంద్రం ప్రతి ఏటా రూ. కోట్లు ఖర్చు చేస్తోంది. గతంలో నల్లమలలో పర్యటించిన వన్యప్రాణుల విభాగం జాతీయ బృందం పులుల సంరక్షణకు అనుకూలమైన ప్రాంతమని తేల్చి చెప్పింది.
ఎన్‌టీసీఏ నుంచి రావాల్సి ఉంది..
-వెంకటరమణ, డీఎఫ్‌ఓ అచ్చంపేట
నల్లమలలో సేకరించిన జంతువుల వివరాలకు సంబంధించి జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ)కు పంపించాం. అక్కడి నుంచి పూర్తి లెక్కలు రావాల్సి ఉంది. 2013లో సేకరించిన లెక్కల ప్రకారం అచ్చంపేట సబ్‌డివిజన్ పరిధిలో 19 పులులున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరోసారి పులుల గణన జరుగుతుంది.