లెక్చరర్‌పై విద్యార్థిని యాసిడ్ దాడి
గుంటూరు : గుంటూరు జిల్లా నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాలో శనివారం దారుణం జరిగింది. ఓ లెక్చరర్‌పై విద్యార్థిని యాసిడ్‌తో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ లెక్చరర్ వెంకటరమణను ఆస్పత్రికి తరలించారు. కాగా తనను వివాహం చేసుకుంటానని వెంకటరమణ మోసం చేశాడని.. విద్యార్థిని సౌజన్య ఆరోపించింది. ఆమె చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి..
నరసరావుపేటకు చెందిన సౌజన్యను అదే పట్టణంలో ఓ ప్రైవేటు కాలేజిలో మాథ్స్ లెక్చరర్‌గా పనిచేసే వెంకటరమణ కొన్నాళ్ల పాటు ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి కొంతకాలం కలిసి తిరిగాడు. తర్వాత నల్లపాడు పాలిటెక్నిక్ కాలేజిలో చేరాడు. గత ఆగస్టు 15వ తేదీన అతడికి మరో యువతితో పెళ్లయింది. ఎందుకిలా మోసం చేశావంటూ దీనిపై సౌజన్య అతడిని నిలదీయగా, కావాలంటే రెండోపెళ్లి చేసుకుంటానంటూ నీచంగా మాట్లాడాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి, అవమానానికి గురైన సౌజన్య.. యాసిడ్ తీసుకుని కాలేజి వద్దకు వచ్చింది. వెంకటరమణను కాలేజి నుంచి బయటకు పిలిపించి, మొహం మీద, శరీరం మీద యాసిడ్ పోసింది. దాంతో అతడి ఒళ్లంతా కాలిపోయింది. ప్రస్తుతం అతడు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదు గానీ, తీవ్ర గాయాలు అయ్యాయని వైద్యులు చెబుతున్నారు. సౌజన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పూర్తిస్థాయిలో విచారించే అవకాశం ఉంది.