Nanded passenger train
-
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: రైల్వే పోలీసులు
హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు ప్రమాద ఘటనపై రైల్వే పోలీసులు తమ దర్యాప్తు పూర్తి చేశారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని వారు తమ నివేదికలో పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, దక్షిణ మధ్య రైల్వే, కాకతీయ టెక్నో స్కూల్‌కు రైల్వే పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. కాకతీయ టెక్నో స్కూల్‌కు విద్యాశాఖ అనుమతి ఉందని, బస్సు ఫిట్నెస్ సరిగానే ఉందని నివేదికలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు సైకిలిస్టులు, పాలు విక్రయించే వ్యక్తుల నుంచి రైల్వే పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఘటన జరిగినప్పుడు బస్సు డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడలేదని పేర్కొన్నారు. త్వరలో రైల్వే అధికారులు ఈ కేసును మూసివేయనున్నట్లు సమాచారం. కాగా గత నెల 24న మాసాయిపేట వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సహా 16మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. ఇప్పటికీ ఓ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం
రైల్వే పోలీసుల నిర్ధారణ హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేటవద్ద గురువారం స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటనకు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా రైల్వే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అలాగే ఆ బస్సుకు ఫిట్నెస్ ఉందా లేదా అనేది నిర్ధారించడానికి నిపుణులతో పరీక్షలు చేయించనున్నారు. ఈ ఘటనపై అన్నికోణాల నుంచి ై నిజామాబాద్ రెల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. కాగా రైల్వేలెవెల్ క్రాసింగ్ వద్ద పట్టాలను దాటే సమయంలో తగిన జాగ్రత్తలను తీసుకోకుండా బస్సుడ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన తెలిపారు. రైలు వస్తున్న సమయంలో డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతుండటాన్ని చూసినట్టు స్థానికులు చెప్పారని ఆయన తెలిపారు. కాగా ఈ దుర్ఘటనపై సర్కార్‌కు సమగ్ర నివేదిక ఇచ్చేందుకు రైల్వేపోలీసు విభాగం ఇన్చార్జి డీజీ కృష్ణప్రసాద్ శుక్రవారం అధికారులతో సమీక్షించారు. -
నిర్లక్ష్యంతోనే ప్రాణాలు బలి
రాకాసి రైలు ముక్కు పచ్చలారని పాలబుగ్గలను చిదిమేసింది. అమాయక పిల్లల నిండు ప్రాణాలను బలిగొంది. ఎంతో మంది తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చింది. తన చిన్నారులు ఇక లేరని, తిరిగి రార ని ఓ తండ్రి గుండె పోటుతో మృతి చెందడం చూస్తే గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. మాసాయిపేట వద్ద రైలు ప్రమాదం ముమ్మాటికీ రైల్వే శాఖ నిర్లక్ష్యమేనని సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. - సాక్షి నెట్వర్క గార్డును నియమించాలి.. స్కూల్ వ్యాన్ నడిపే డ్రైవర్లు ఓపికతో ఉండాలి. నిష్ణాతుల్ని యాజమాన్యం నియమించుకుంటే మంచిది. అదే విధంగా రైల్వే క్రాసింగ్‌ల వద్ద తప్పకుండా గార్డును నియమించాలి. - తిరుమల, ఉపాధ్యాయురాలు గేట్లను ఏర్పాటు చేయాలి రైల్వే ప్రమాద ఘటనలో రైల్వే శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. భారత దేశ వ్యాప్తంగా దాదాపు 30 వేల రైల్వే క్రాసింగ్‌లు ఉండగా అందులో పదిహేను వేల వరకు గార్డులు లేని గేట్లే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికైనా రైల్వే శాఖ రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేట్లను ఏర్పాటు చేయాలి. - నవీన్, కరస్పాండెంట్, కాకతీయ టెక్నో స్కూల్, రాంనగర్ డ్రైవర్‌దే తప్పు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా పెరిగిన రోజుల్లో కూడా రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. రైల్వే క్రాసింగ్ వద్ద రెండు వైపులా చూసుకొని బస్సు నడపకపోవడం డ్రైవర్‌దే తప్పు. రైలు వస్తుందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్‌కు, క్లీనర్‌కు ఉండాలి. - రూపాధరణి, విద్యార్థిని ప్రమాదం జరిగినప్పుడే హడావుడి... రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేటు, సిగ్నల్స్, గార్డును నియమిస్తే ప్రమాదం జరిగి ఉండేది కాదు. సంఘటనలు జరిగిన సమయంలోనే అధికారులు హడావుడి చేస్తారే తప్ప ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోరు. - చప్పిడి సుభాన్‌రెడ్డి, నవీన విద్యా సంస్థల చైర్మన్ ఫిట్నెస్ చూడాలి బస్సు ఫిట్నెస్ను ఎలా చూసుకుంటున్నామో డ్రైవర్ కూడా ఫిట్నెస్ కలిగి ఉన్నాడో లేడో చూసుకోవాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యాలపై ఉన్నది. డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. - రామలింగం, ప్రిన్సిపాల్, క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీనగర్‌కాలనీ పునరావృతం కాకుండా చర్యలు... నిర్లక్ష్యానికి కారకులు ఎవరైనప్పటికీ చనిపోయిన విద్యార్థులను తిరిగి తీసుకురాలేరు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా బాధ్యులపై చర్యలు తీసుకుని డ్రైవర్లకు శిక్షణా తరగతులు నిర్వహించాలి. - ఇ.సుష్మ, విద్యార్థిని -
రక్షణ కరువే
నిజామాబాద్ అర్బన్: చిన్నపాటి నిర్లక్ష్యంతో జరిగే సంఘటనలు జీవి తాలను ఛిద్రం చేస్తాయి. వీటిని నివారించాలంటే ముం దు జాగ్రత్తలు తీసుకోవడమొక్కటే మార్గం. గురువారం మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన జరిగిన సంఘటన మనకు ఇదే గుణపాఠాన్ని నేర్పుతోంది. ఈ ప్రమాదంలో అభమూ, శుభమూ తెలియని 18 మంది చిన్నారులు ప్రా ణాలు కోల్పోయారు. వారి తల్లులకు అంతులేని గర్భశోకాన్ని మిగిల్చారు. మరో 20 మంది వరకు క్షతగాత్రులయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర దుర్ఘటనకు కారణం నిర్లక్ష్యమూ, ఆతురతే అనడంలో సందేహం లేదు. రైల్వే క్రాసింగుల వద్ద కొందరు ముందూ, వెనుక చూసుకోకుండా గేటు దాటిపోవాలని యత్నిస్తుంటారు. తొందరగా వెళ్లిపోవాలని ఆత్రుత పడుతుంటారు. ఇలాంటివే పెను ముప్పును తెచ్చిపెడతాయి. మరోవైపు కాపలా లేని లెవల్ క్రాసింగులు ప్రయాణి కుల ప్రాణాలను హరిస్తున్నాయి. ఆ రైలు సమయానికి నడిచి ఉంటే మాసాయిపేట విషాదానికి కారణమైన నాందేడ్ ప్యాసింజర్ రైలు నాలుగు గంటలు ఆలస్యంగా నడిచింది. పిల్లల పాలిట మృత్యు శకటంగా మారింది. అది సమయా నికి నడిచి ఉంటే ఘోరకలి తప్పేదేమో! రైల్వే క్రాసింగుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకుని ఉన్నా, ఈ ప్రమాదం చోటు చేసుకునేది కాదు. పదుల సంఖ్యలో కుటంబాలకు తీరని దుఃఖం మిగిలేది కాదు. వాస్తవానికి ఈ రైలు నాందేడ్ నుంచి నిజామాబాద్‌కు తెల్లవారు జామున రెండు గంటలకు చేరుకోవాలి, కాని ఉదయం 6.50కి చేరుకుం ది. 6.55కు హైదరాబాద్‌కు బయలుదేరింది. మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును ఢీకొంది. విషయం తెలియగానే రైల్వే అధికారులు మెడికల్ రీలీఫ్, యాక్సిడెంటల్ రి లీఫ్ వాహనాలలో సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ప్రమాద కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. 26 గేట్ల వద్ద కాపలా లేదు జిల్లాలో రైల్వే లైను మహారాష్ట్రలోని ముథ్కేడ్ నుంచి భిక్కనూరు మండలం వరకు ఉంది. దీని పరిధిలో 69 రైల్వే గేట్లు ఉన్నాయి. వీటిలో 26 గేట్లకు కాపాలా లేదు. ఇవి ప్రధాన రోడ్డు మార్గాలలోనే ఉన్నాయి. అయినా అధికారులకు పట్టిం పు లేదు. వాహనదారులు రైలు వస్తున్న శబ్దం వినో, ఇతర సంకేతాల ఆధారంగానో ఆగిపోవల సిందే. ఏమరపాటుగా ఉంటే ప్రమాదాలు తప్పవు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. నవీపేట మండలం అభంగపట్నం వద్ద రైలు ఎండ్లబండిని ఢీకొనడంతో ఒకరు చనిపోయారు. ఇదే ప్రాంతంలో కారు రోడ్డును దాటుతుండగా రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఇంకోసారి రైలు ఆర్టీసీ బస్సును ఢీకొంది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిజామాబాద్ మండలం మాధవనగర్ సమీపంలో రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉంది. బోధన్, నిజామాబాద్ మధ్య రైల్వే మార్గం సరిగా లేదు. రైల్వే గేట్లతోపాటు రైల్వే ట్రాక్ కూడా ప్రమాదకరమే. పశువులు పట్టాలపైకి వచ్చి, రైలు ఢీకొని చనిపోతున్నాయి. రైల్వే ట్రాక్ కిందికి ఉండడంతో నవీపేట మండలంలో ఏడాది కిందట 16 పశువులు రైలు ఢీకొని చనిపోయాయి. డిచ్‌పల్లిలో రెండు ఎడ్లు కూడా ఇలాగే చనిపోయాయి. రైల్వే అధికారులు ఇప్పటికైనా మేల్కొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారా? అభివృద్ధి కూడా అంతంతే జిల్లాలో రైల్వే వ్యవస్థ పని తీరు నాసిరకంగానే ఉంది. మోడల్ స్టేషన్లు ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్నా నిధుల జాడ లేదు. ఆరకొర నిధులతో నామమాత్రపు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రయాణికులకు సౌకర్యాలూ అంతంత మాత్రమే. నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందుకు తగినట్టుగా వసతులు కల్పించడంలో రైల్వేశాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ప్రమాదాలు జరిగితే తప్ప మేలుకోవడం లేదు. -
కన్నతల్లుల కడుపుకోత
ఆ చిన్నారులు తెల్లవారగానే లేచారు.. వడివడిగా తయారయ్యారు. పాఠశాలకు వెళుతూ అమ్మానాన్నలకు బైబై చెప్పారు. ఎంతో ఉషారుగా పాఠశాల బస్సెక్కారు. అంతలోనే ఆ పాలబుగ్గలను రైలు రూపంలో వచ్చిన మృత్యువు చిదిమేసింది. వెల్దుర్తి మండలం మాసాయిపేట కాపలాలేని రైల్వేగేట్ వద్ద గురువారం ఉదయం నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పాఠశాల బస్సును ఢీకొట్టిన ఘటనలో 14 మంది విద్యార్థులతోపాటు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన కన్నతల్లులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ►పసిమొగ్గలను చిదిమేసిన మృత్యుశకటం ►ఛిద్రమైన దేహాలు.. చెల్లాచెదురైన ఆశలు ►కన్నీటి సంద్రమైన మెతుకుసీమ ►ఘటనాస్థలికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మెదక్ : ఆ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం విద్యార్థుల నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. చదువులమ్మ ఒడిలో ఆడిపాడాల్సిన ఆ విద్యార్థులు.. మృత్యుఒడిలో విగతజీవులుగా మారారు. వెల్దుర్తి మండలం మాసాయిపేటలోని కాపలాలేని రైల్వే గేట్ వద్ద గురువారం ఉదయం రైలు వస్తున్నా చూసుకోకుండా బస్సును అలాగే పట్టాలెక్కించడంతో.. నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొని ఆ బస్సులోని విద్యార్థులతోపాటు, బస్సు డ్రైవర్, క్లీనర్ మృత్యువాతపడ్డారు. అప్పటిదాకా కేరింతలతో వున్న చిన్నారుల దేహాలు ఒక్కసారిగా ఛిద్రమవడాన్ని చూసి భరించలేని ఆ కన్నతల్లులు బోరున విలపించారు. ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి మృతదేహాలకు గురువారం మెదక్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. ఆ చిన్నారులను తలుచుకుంటూ.. వారి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ.. గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. వారి రోదనలను ఆపడం ఎవరితరం కాలేకపోయింది. ప్రమాదం విషయం తెలుసుకున్న మెదక్ ప్రజలు ఆస్పత్రికి పెద్దఎత్తున చేరుకుని చిన్నారుల మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కూలీనాలి చేసుకుంటూ.. కష్టనష్టాలు భరిస్తూ...పిల్లలను బడికి పంపితే మా కలలను కల్లలు చేస్తూ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారా.. బిడ్డా? అంటూ కన్నవారు గుండెలు బాదుకున్నారు. మేమేం పాపం చేశామని దేవుడు మాకే ఎందుకు ఈ శిక్ష విధించాడంటూ రోదించారు. ఇంటి దీపాలను ఆర్పేసిన నిర్లక్ష్యం.. అధికారులు, ప్రైవేట్ యాజమాన్యాలు, డ్రైవర్, క్లీనర్ల నిర్లక్ష్యం కన్నవారి కనుపాపలను కాటేసింది.ఈ ప్రమాదంలో పలు కుటుంబాల ఇంటిదీపాలే ఆరిపోయాయి. గౌసియా-అబ్దుల్ రషీద్, చరణ్-దివ్య, సుమన్-శ్రీవిద్య, శృతి-విశాల్-భువన అనే అన్నాచెల్లెలంతా దుర్మరణం చెందడంతో వారి కన్నవారి కలలు కల్లలయ్యాయి. తల్లిదండ్రులు ఎన్నో మొక్కులు మొక్కగా పండిన కలల పంట మల్లేష్ యాదవ్ సైతం ఈ ప్రమాదంలో మృత్యువాత పడటంతో వారి బాధ వర్ణానాతీతమైంది. వీరితోపాటు ఈ ప్రమాదంలో రమేష్, ధనుష్కోటి, వంశీ, విష్ణులతోపాటు డ్రైవర్ బిక్షపతిగౌడ్, క్లీనర్ రమేష్గౌడ్ల మృతదేహాలకు మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘోర ప్రమాదం వైద్యులను సైతం కన్నీరు పెట్టించింది. ఏమని ఓదార్చాలమ్మా..! కన్న బిడ్డల్ని పోగొట్టుకున్న మిమ్మల్ని ఏమని ఓదార్చాలమ్మా..? మేం ఏం సాయం చేసినా.. పోయిన మీ బిడ్డలను తేగలమా? అని కంటతడిపెడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డి, జి. జగదీశ్వర్‌రెడ్డి తదితరులు బాధితులను ఓదార్చారు. కాగా, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చిలుముల మదన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ప్రజా గాయకుడు గద్దర్, జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, టీఆర్ఎస్ నేతలు దేవేందర్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, నర్సారెడ్డి తదితరులు కూడా బాధితులను ఓదార్చారు.