విద్యార్థుల మృతి కేసులో తీర్పు వెల్లడి
కంచికచర్ల : మునేరు నదిలో స్నానానికెళ్లి 15 మంది విద్యార్థులు మృతిచెందిన కేసులో నందిగామ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 2005వ సంవత్సరం నవంబర్ నెలలో కృష్ణా జిల్లా కీసర గ్రామంలోని మునేరు సమీపంలో ఉన్న మామిడితోటలో వనసమారాధనకు వచ్చిన విజయవాడ రవీంద్రభారతి పాఠశాల విద్యార్థులు 15 మంది మునేరు నదిలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం పాఠశాల కరస్పాండెంట్ వీరమాచినేని వెంకటేశ్వరరావుతో మరో ఏడుగురికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. దాంతో పాటు ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ నందిగామ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్‌రావు తీర్పు వెలువరించారు.