'నందిగామలో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు'
హైదరాబాద్: నందిగామలో ఉప ఎన్నికలో తమ పార్టీకి దక్కిన ఓట్ల పట్ల ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. తమ సంప్రదాయ ఓట్లు తిరిగొచ్చాయని చెప్పారు. తంగిరాల ప్రభాకరరావు కుటుంబంపై సానుభూతి, నామినేషన్ తర్వాత విజయవాడను రాజధానిగా ప్రకటించడం వంటి కారణాల వల్ల టీడీపీ విజయం సాధించిందని అన్నారు.
నందిగామలో గెలుపు కోసం అధికార టీడీపీ విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టిందని, మద్యం ఏరులై పారించిందని ఆరోపించారు. ఎన్నికల అధికారులే ఇది నిజమని ఒప్పుకున్నారని తెలిపారు. పోలవరం కాంట్రాక్టర్ల నుంచి టీడీపీకి డబ్బు అందిందని ఆరోపించారు. వీరి పేర్లు త్వరలో బహిర్గతం చేస్తామన్నారు. ఉప ఎన్నికలో తాము రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. తమ అభ్యర్థి దగ్గర డబ్బు లేదు, తమ దగ్గర డబ్బు లేదని రఘువీరారెడ్డి చెప్పారు.