సివిల్స్ టాపర్‌కు 55.30 శాతమే
న్యూఢిల్లీ: 2016 సివిల్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వెల్లడించింది. సివిల్స్ ఫలితాల్లో మొదటిస్థానంలో నిలిచిన నందిని కె.ఆర్ 55.30% మార్కులు సాధించినట్లు యూపీఎస్సీ తెలిపింది.
ప్రస్తుతం ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో విధులు నిర్వహిస్తున్న ఆమె 2,025 మార్కులకు గానూ1,120 (మెయిన్స్‌లో 927, ఇంటర్వూ్యలో 193) మార్కులు సాధించినట్లు కమిషన్ పేర్కొంది. ఇక రెండో ర్యాంక్ పొందిన అన్మోల్ షేర్ సింగ్ బేడీ 1,105 మార్కులు(54.56%) సాధించినట్లు యూపీఎస్సీ తెలిపింది. మూడో ర్యాంకు సాధించిన తెలుగు తేజం రోణంకి గోపాలకృష్ణకు 1,101 మార్కులు(54.37%) వచ్చినట్లు వెల్లడించింది. 2015లో సివిల్స్ టాపర్‌గా నిలిచిన టీనా దాబీ 1,063 మార్కులు(52.49%) మాత్రమే సాధించినట్లు కమిషన్ పేర్కొంది.