బీసీసీఐ అధ్యక్షునిగా మరోమారు శ్రీనివాసన్ ఎన్నిక
బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షునిగా మూడో సారి నారాయణస్వామి శ్రీనివాసన్ ఎన్నికయ్యారు. ఆదివారం చెన్నైలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీనివాసన్కు పోటీగా నిన్న సాయంత్రం వరకు ఎవరు బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయకపోవడంతో శ్రీనివాసన్ ఎన్నిక లాంఛనప్రాయమైంది. దాంతో శ్రీనివాస్ ఎన్నికైనట్లు బీసీసీఐ ఆదివారం ప్రకటించింది.
అంతేకాకుండా దక్షిణాదిలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, హైదరాబాద్, గోవాలలోని క్రికెట్ సంఘాలు మద్దతివ్వడంతో శ్రీనివాసన్ అధ్యక్షునిగా ఎన్నిక నల్లెరు మీద నడకలా సాగింది. బీసీసీఐ కార్యదర్శిగా సంజయ్ పటేల్ ఎన్నికయ్యారు. అలాగే హర్యాన క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిరుధ్ చౌదరి బీసీసీఐ కోశాధకారిగా నియమితులయ్యారు.
ఐదుగురు బీసీసీఐ ఉపాధ్యక్షులు కూడా ఎన్నికయ్యారు. శ్రీనివాసన్ రేపు బీసీసీఐ అధ్యక్షునిగా బాధ్యత స్వీకరించవలసి ఉంది. అయితే బీహార్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిత్య వర్మ పిటిషన్ వేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత శ్రీనివాసన్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.