ఎస్ఐ కొట్టాడని ఆత్మహత్యాయత్నం
నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి యువకుడి తరలింపు
శాలిగౌరారం: కుటుంబ గొడవల నేపథ్యంలో ఇచ్చిన ఫిర్యాదులో ఎస్ఐ తనను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, అకారణంగా కొట్టాడంటూ ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లాల గ్రామానికి చెందిన పెరుమాండ్ల వీరయ్య, పెరుమాండ్ల సూరయ్య, పెరుమాండ్ల చలమంద అన్నదమ్ములు.
వీరి తల్లి మరణానంతరం వచ్చిన డబ్బుల పంపకం విషయంపై ముగ్గురు అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో పెరుమాండ్ల సూరయ్య, చలమంద కలిసి పెరుమాండ్ల వీరయ్య కుమారుడు నరేశ్(26)పై శాలిగౌరారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎస్ఐ మహేశ్ బుధవారం నరేశ్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెల్టుతో తీవ్రంగా కొట్టాడని బాధిత కుటుంబీకులు తెలిపారు. అవమానానికి గురైన నరేశ్ ఇంటికి వెళ్లిన తర్వాత రాత్రి పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబీకులు అతన్ని నకిరేకల్‌కు, తర్వాత నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నరేశ్ వ్యాయామఉపాధ్యాయుడు.
నరేశ్‌ను కొట్టలేదు : మహేశ్, ఎస్ఐ, శాలిగౌరారం
అసలు తాను పెరుమాండ్ల నరేశ్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలవలేదని, అతనే స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడని ఎస్ఐ మహేశ్ ‘సాక్షి’కి తెలిపారు. కుటంబంలో గొడవలు పెట్టుకోవద్దని, పంచాయితీని సామరస్యంగా పరిష్కరించుకోవాలని మాత్రమే సూచించినట్లు చెప్పారు. కానీ తాను అతన్ని కొట్టలేదన్నారు. పంచాయితీని గ్రామపెద్దల సమక్షంలో సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఆదివారం వరకు గడువుకావాలని కోరుతూ దరఖాస్తు పెట్టాడని, తాను అనుమతి ఇవ్వడంతో వెళ్లిపోయాడని పేర్కొన్నారు.