‘ఆర్ఎస్ఎస్ ఎజెండానే బీజేపీ విధానం’
షోలాపూర్, న్యూస్‌లైన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎజెండాను బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటోందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నసీంఖాన్ అన్నారు. వీరి బారి నుంచి దేశ ఐక్యతను కాపాడుకునేందుకు హిందూ-ముస్లింలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం తెలిపారు. స్థానిక సివిల్ ఆస్పత్రి సమీపంలోని షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) స్థలంలో ఉర్దూ భవన నిర్మాణానికి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో కలిసి నసీంఖాన్ సోమవారం ఉదయం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నసీంఖాన్ మాట్లాడుతూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్లో రక్తంతో హోలీ సంబరాలు జరుపుకున్నారని, ఆయన దేశానికి ప్రధాని కాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. ఆయన ప్రధాన మంత్రి పదవి కోసం పగటి కలలు కంటున్నారని, ఆ కలలను సాకారం కాకుండా చూసే బాధ్యత హిందూ-ముస్లింలదేనని పిలుపునిచ్చారు. కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సుశీల్ కుమార్ షిండేని రాష్ట్ర ప్రజలు ఆదరించాల్సి అవసరముందన్నారు. ఆయనను బలపరచడం ఇక్కడి వారందరి కర్తవ్యమన్నారు.
అంతకుముందు సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ ఉర్దూ మన భాషనేనని, పాకిస్తాన్ దానిని జాతీయ భాషగా మార్చుకోవడం మనకు గర్వకారణమన్నారు. ఈ ఉర్దూ భవనంలో చదువుకునే వారంతా విజ్ఞానవంతులు కావాలని, వారు మానవతా ధృక్పదంతో యువతరాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శాసన సభ్యులు దిలీప్ మానే, ప్రణతి శిందేలతోపాటు ధర్మ బోసుళే, ప్రకాశ్ మల్గుల్వార్, మాజీ మేయర్లు ఉమర్ఖాన్ బెరియా, హరీఫ్ శేఖ్, కార్పోరేటర్ తాపిక్ శేఖ్ తదితరులు పాల్గొన్నారు.