పాంచ్ పటాస్
చెన్నై : కోలీవుడ్ జాతీయ స్థాయిలో పాంచ్ పటాస్ అంటూ మరోసారి తన సత్తా చాటుకుంది.ఉత్తమ చిత్రాలకు, కళాకారులకు పేరెన్నికలో మేమెప్పుడూ ఉంటామని తాజా జాతీయ అవార్డులతో మరోసారి రుజువు చేసుకుంది. ఈసారీ ఐదు జాతీయ అవార్డులు కోలీవుడ్‌ను పులకరింపజేశాయి.2015 ఏడాదికి గానూ కేంద్రప్రభుత్వం 63వ జాతీయ సినీ అవార్డులను గెలుచుకున్న చిత్రాలను, కళాకారులు, సాంకేతిక నిపుణుల పట్టికను సోమవారం ఉదయం ఢిల్లీలో వెల్లడించారు.అందులో తమిళ చిత్ర పరిశ్రమ ప్రధాన కేటగిరీల్లో ఐదు అవార్డులను గెలుచుకుని తన ఆధిక్యాన్ని నిలుపుకుంది.
విచారణైకి ముచ్చటగా మూడు
ఇక ఉత్తమ విలువలతో ఆలోచింపజేసే కథలతో చిత్రాలు రూపొందించడంలో తమిళ కళాకారులు దిట్ట అని ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి నిరూపణ అయ్యింది. వెట్రిమారన్ ఈయన తమిళసినిమా నమ్ముకున్న దర్శకులలో ఒకరు. ఇంతకు ముందు ఆడుగళం చిత్రంతో జాతీయ అవార్డును తమిళ సినిమాకు గెలిచిపెట్టిన వెట్రిమారన్ ఈ సారి విచారణై చిత్రంతో ఏకంగా మూడు జాతీయాలను అందించారు.జైలులో ఖైదీ జీవన విధానాన్ని అత్యంత సహజత్వంతో కళ్లకు కట్టినట్లు ఈయన తెరపై ఆవిష్కరించిన చిత్రం విచారణై.ఇటీవలే విడుదలై సగటు ప్రేక్షకుడితో పాటు విమర్శకులను సైతం మెప్పించిన చిత్రం విచారణై.
ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు,రివార్డులు అందుకున్న ఈ చిత్రం తాజాగా ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది.ఇక ఇందులో నటించిన దర్శకుడు సముద్రకనిని ఉత్తమ సహాయనటుడు అవార్డు వరించింది.ఇక ఇదే చిత్రానికి గాను ఆ మధ్య కన్ను మూసిన ఎడిటర్ కిశోర్‌ను జాతీయ అవార్డు వరించడం విశేషం.ఆయన ఇంతకు ముందు ఆడుగళం చిత్రానికి గాను ఉత్తమ జాతీయ అవార్డును అందుకున్నారన్నది గమనార్హం.అదే విధంగా తొలి చిత్రంతోనే సినీ పండితుల ప్రశంసలను అందుకున్న నటి రితిక ఇరుదుచుట్రు చిత్రానికి గాను ఉత్తమ నటిగా ప్రత్యేక అవార్డుకు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయం.నిజ జీవితంలో బాక్సర్ అయిన రితిక చిత్రంలోనూ అదే పాత్రలో జీవించారు. ఈమెకిదే తొలి చిత్రం కావడం విశేషం.కాగా జాతీయ అవార్డులను గెలుచుకున్న కళాకారుల అభిప్రాయాలను చూద్దాం.
ఆదరణకు ధన్యవాదాలు
జాతీయ ఉత్తమ సహాయ నటుడు అవార్డుకు ఎంపికైన దర్శకుడు సముద్రకని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నటుడిగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.విచారణై చిత్రానికి ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డు,ఎడిటర్ కిశోర్‌ను అవార్డు వరించడం సంతోషంగా ఉంది.
ఆస్కార్ అవార్డుగా
ఇక తొలి చిత్రంతోనే జాతీయ అవార్డుకు అర్హురాలైన నటి రితిక తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ అవార్డును ఊహించలేదు. దీన్ని ఆస్కార్ అవార్డుగా భావిస్తున్నాను.దీనికి కారణం అయిన దర్శకురాలు సుధ,రాజ్‌కుమార్ హిరాణి లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నారు.దర్శకుడు వెట్రిమారన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జాతీయ అవార్డులను గెలుచుకున్న వారందరికీ సూపర్‌స్టార్ అభినందనలు తెలిపారు.
సంగీతరాజాకు మరోసారి
భారతీయ చిత్ర పరిశ్రమలోనే సహస్ర చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఏకైక సంగీత దర్శకుడు ఇళయరాజా.సంగీత ప్రపంచంలో అనితరసాధ్యం కాని ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఈ సంగీత జ్ఞానికి తాజాగా మరో జాతీయ అవార్డుకు అలంకారం కానున్నారు.ఎస్.ఆయన సంగీతం అందించిన 1000వ చిత్రం తారై తప్పట్టై చిత్రంతోనే ఆయన ఉత్తమ సంగీత దర్శకుడుగా మరోసారి జాతీయ అవార్డును అందుకోనున్నారు.
బాలా వల్లే సాధ్యం అయ్యింది
తారై తప్పట్టై చిత్రానికి గానూ ఇళయరాజా ఉత్తమ సంగీతదర్శకుడు అవార్డును గెలుచుకున్న సందర్భంగా ఆ చిత్ర నిర్మాత, కథానాయకడు శశికుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇళయరాజా 1000వ చిత్రాన్ని నేను నిర్మించడం భాగ్యంగా భావిస్తున్నాను.నా కంపెనీ ప్రొడక్షన్లో నిర్మించిన పసంగ,తలైమురైగళ్ చిత్రాల వరుసలో జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రంగా తారైతప్పట్టై చేరడం ఆనందంగా ఉంది.ఇది దర్శకుడు బాలా వల్లే సాధ్యం అయ్యింది.
కొన్ని చిత్రాల గురించి ముందుగానే..
మూడు జాతీయ అవార్డులను కైవశం చేసుకున్న విచారణై చిత్ర నిర్మాత నటుడు ధనుష్ ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.కొన్ని చిత్రాలు ప్రారంభించినప్పుడే తెలిసి పోతుంది.అవి ముఖ్యమైన స్థానంలో నిలుస్తాయని.వెట్ట్రిమారన్ దర్శత్వంలో నేను నిర్మించిన ఈ విచారణై చిత్రం అలాంటి అంచనాలనే ఏర్పరచింది.ఈ చిత్రంలో నటించిన సముద్రకని ఉత్తమ సహాయ నటుడు అవార్డును,ఎడిటర్ కిశోర్‌కు అవార్డు వరించడం సంతోషంగా ఉంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెట్రిమారన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని ధనుష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.