National Champion
-
లలితా ప్రసాద్‌కు రజతం
న్యూఢిల్లీ: ఇరాన్లో జరుగుతున్న మక్రన్ కప్‌లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. ఇరాన్‌లోని చబహర్ నగరంలో జరిగిన ఈ పోటీల్లో భారత్ ఒక స్వర్ణంతో పాటు ఐదు రజతాల్ని గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ యువ బాక్సర్ పోలేపల్లి లలితా ప్రసాద్ (52 కేజీలు) రజతం సాధించాడు. జాతీయ చాంపియన్ దీపక్ సింగ్ 49 కేజీల కేటగిరీలో బంగారం గెలుపొందాడు. ఫైనల్లో అతను... జాఫర్ నసెరిపై నెగ్గాడు. మరో ఐదుగురు భారత బాక్సర్లు మాత్రం తుదిపోరులో కంగుతిన్నారు. ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ రజత విజేతలైన మనీశ్ కౌషిక్ (60 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), దుర్యోధన్ సింగ్ నెగి (69 కేజీలు), సంజీత్ (91 కేజీలు), లలితా ప్రసాద్ (52 కేజీలు) ఓడిపోవడంతో రజత పతకాలు లభించాయి. ప్రసాద్... ఒమిద్ సఫా అహ్మద్ చేతిలో, దుర్యోధన్... సజ్జద్ జాదే కెజిమ్ చేతిలో, మనీశ్... డానియెల్ షా బ„Š చేతిలో, సతీశ్... మొహమ్మద్ చేతిలో, సంజీత్... ఎల్డిన్ చేతిలో ఓటమి చవిచూశారు. ఇదివరకే ఈ టోర్నీలో రోహిత్ టొకస్ (64 కేజీలు), మన్జీత్ సింగ్ (75 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. -
శభాష్... సాయి విష్ణు
సాక్షి, హైదరాబాద్: తొలుత క్రీడాకారుడిగా రాణించి... ఆ తర్వాత కోచ్‌గా మారి భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చేసిన పుల్లెల గోపీచంద్, పీవీవీ లక్ష్మి కుటుంబం నుంచి మరో స్టార్ తయారవుతున్నాడు. తల్లి లక్ష్మి అడుగుజాడల్లో పయనిస్తూ ఇప్పటికే ఆమె కుమార్తె పుల్లెల గాయత్రి జూనియర్ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంటుండగా... తండ్రి గోపీచంద్ స్ఫూర్తితో తనయుడు పుల్లెల సాయి విష్ణు తొలిసారి సింగిల్స్ విభాగంలో జాతీయస్థాయిలో అదరగొట్టాడు. బెంగళూరులో జరిగిన జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో 14 ఏళ్ల సాయి విష్ణు అండర్–15 బాలుర సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన తొమ్మిదో సీడ్ సాయి విష్ణు ఫైనల్లో 21–14, 21–19తో మూడో సీడ్ యాకల సాయిసత్య సర్వేశ్ (పుదుచ్చేరి)పై విజయం సాధించాడు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సాయి విష్ణు రెండో రౌండ్లో 21–11, 21–8తో దివ్యాంశ్ (హిమాచల్‌ప్రదేశ్)పై, మూడో రౌండ్లో 21–12, 21–12తో తేజస్ (మహారాష్ట్ర)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–16, 20–22, 21–14తో నాలుగో సీడ్ ప్రణవ్ శర్మ (ఉత్తరాఖండ్)పై, క్వార్టర్ ఫైనల్లో 21–19, 21–18తో ఎనిమిదో సీడ్ అంకిత్ (బెంగాల్)పై, సెమీ ఫైనల్లో 21–13, 21–17తో టాప్ సీడ్ శంకర్ ముత్తుస్వామి (తమిళనాడు)పై గెలుపొందాడు. ఇదే టోర్నమెంట్ అండర్–17 బాలుర డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ గిరీశ్ నాయుడు తన భాగస్వామి శంకర్‌ప్రసాద్ ఉదయ్ కుమార్ (కేరళ)తో కలిసి టైటిల్ సాధించాడు. అండర్–17 బాలికల డబుల్స్ విభాగంలో ఎ.అభిలాష–కె.భార్గవి (తెలంగాణ) జంట రన్నరప్‌గా నిలిచింది. అతనిపై ఒత్తిడి పెంచం! సబ్ జూనియర్ నేషనల్స్‌లో విష్ణు విజేతగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. నాడు తొలిసారి జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలవడంతో గోపి విజయ ప్రస్థానం ప్రారంభమైంది. ఇప్పుడు సబ్ జూనియర్లోనే విష్ణు టోర్నీ గెలుచుకున్నాడు. గత కొంత కాలంగా డబుల్స్‌లో అతను నిలకడగా రాణిస్తూ టైటిల్స్ సాధించాడు. అయితే సింగిల్స్‌లో మాత్రం అతనికి చెప్పుకోదగ్గ విజయం లభించలేదు. ఇప్పుడు సింగిల్స్‌లో తొలిసారి టోర్నమెంట్‌ను గెలుచుకోవడం విష్ణు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మున్ముందు మరిన్ని విజయాలు సాధించేందుకు స్ఫూర్తినిస్తుంది. అండర్–15 విభాగంలో వయసు పరిమితి దాటిపోతుంది కాబట్టి వచ్చేసారి అతని లక్ష్యం అండర్–17లో సత్తా చాటడమే. అయితే మేం విష్ణుపై విజయాల కోసం ఎలాంటి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం లేదు. ఫలితాలు ప్రతికూలంగా వచ్చినా పట్టించుకోకుండా అతను ఆటను ఆస్వాదిస్తే చాలు. – పీవీవీ లక్ష్మి, ఒలింపియన్ (విష్ణు తల్లి) -
జాతీయ చాంపియన్ బందిపోటయ్యాడు
పాన్‌సింగ్ తోమర్... నేటి తరానికి పెద్దగా పరిచయం లేని చాంపియన్ అథ్లెట్. సుదీర్ఘ పరుగులో సూపర్ హీరో ఈ సుబేదార్. ఆర్మీలో కొనసాగుతూ అథ్లెటిక్స్ వైపు ఆకర్షితుడై వరుసగా ఏడేళ్ల పాటు జాతీయ చాంపియన్‌గా దుమ్మురేపాడు. ఇలాంటి ఆటగాడు ఆ తర్వాత ఏ స్థాయికి ఎదగాలి... కానీ...ప్రత్యేక పరిస్థితుల్లో బందిపోటుగా మారి ఎన్‌కౌంటర్‌కు బలయ్యాడు...! మధ్యప్రదేశ్‌లోని మోరీనా జిల్లాకు చెందిన బిదోస గ్రామం పాన్‌సింగ్ స్వస్థలం. 1932లో పేద కుటుంబంలో జన్మించాడు. ఆ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. నీరుంటే సాగుబడి... లేదంటే కూలీ పనితో ఆ కుటుంబం గడిపేది. దీంతో పాఠశాల చదువుతోనే అతని విద్యాభ్యాసం ముగిసింది. ఆ చదువుతో పాటు ఆరడుగుల ఒక్క అంగుళం ఎత్తున్న తనకు ఆర్మీలో కొలువొచ్చింది. 1949లో బెంగాల్ ఇంజినీర్ గ్రూప్ జవాన్‌గా పనిచేశాడు. ఆర్మీలోనే తొలి అడుగులు తోమర్ కడుపేదరికంలో మగ్గినా... మొదట్లో ఎవరికీ కీడు చేయని గుణం. తన పనేదో తాను చేసుకొని సెలవు దొరికితే తమ పొలంలో పనులకు వెళ్లేవాడు. కాయకష్టం తెలిసిన ఆ చేతులకి కష్టం విలువ బాగా తెలుసు. ఆర్మీలో చేరిన మొదట్లో అథ్లెటిక్స్ అంటే అంతగా ఆసక్తి చూపని పాన్‌సింగ్ ఒక్కసారి అటువైపు వెళ్లాక ఇక వెనుదిరిగి చూడలేదు. సుదీర్ఘ పరుగులో సూపర్ హీరో పాన్‌సింగ్ ఎత్తు అథ్లెటిక్స్‌లో రాణించేందుకు దోహదపడింది. అలా ఈ సుబేదార్ కాస్తా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా మారాడు. 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ ఈవెంట్లో విశేషంగా రాణించడం మొదలుపెట్టాడు. 1958లో టోక్యో ఆసియా గేమ్స్‌లో జాతీయ రికార్డు తిరగరాశాడు. ఇదే జోరుతో ఆ ఏడాది నుంచి 1964 వరకు ఈ విభాగంలో జాతీయ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకున్నాడు. 1958లో అతని రికార్డయితే పదేళ్ల పాటు రికార్డు పుస్తకాల్లో పదిలంగా నిలిచింది. ఆర్మీ కూడా అతన్ని బాగానే ప్రోత్సహించింది. అతని క్రీడా ప్రదర్శనను అంతర్జాతీయ స్థాయిలోనూ కొనసాగించాలనే లక్ష్యంతో చైనాతో, పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాల్లో అతన్ని అనుమతించలేదు. కానీ... క్రీడా జీవితానికి కలిసొచ్చిన కాలం నిజ జీవితానికి కలిసిరాలేదు. 1972లో అథ్లెటిక్స్‌కు వీడ్కోలు పలకడంతో పాటు ఆర్మీ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి అతని ‘కథ’ మరోలా మారింది. బందిపోటుగా మారిన పాన్‌సింగ్ ఇంటిబాట పట్టిన పాన్సింగ్కు పొలం తగాదాలు చికాకు పెట్టాయి. దాయాదులతో ఏర్పడిన పొరపొచ్చాలు ప్రాణాలు తీసుకునేంత వైరంగా మార్చాయి. ఈ క్రమంలో ఆ ఊరిలో మోతుబరి అయిన బాబూ సింగ్‌తో స్థల వివాదం ఏర్పడింది. గ్రామ పంచాయతీ పెద్దలు ఆ స్థలం పాన్‌సింగ్ దక్కించుకోవాలంటే రూ.3000 బాబూ సింగ్‌కు చెల్లించాలని తీర్మానించారు. దీనిపై మొదట ప్రతిఘటించినా ఆ తర్వాత పాన్‌సింగ్ చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు ఈ సమస్య జిల్లా కలెక్టర్ పేషీదాకా వెళ్లింది. డబ్బులిచ్చినా స్థలం తిరిగి ఇవ్వడానికి ఇష్టపడని బాబూసింగ్... తోమర్ ఇంటికెళ్లి 95 ఏళ్ల వయసున్న అతడి అమ్మపై చేయి చేసుకున్నాడు. పట్టలేని ఆగ్రహంతో తోమర్... బాబూసింగ్ను కాల్చి వేశాడు. తనకు సమస్యలు సృష్టిస్తున్న వారికి కూడా ఇదే గతి పట్టించాడు. ఆ తర్వాత చంబల్‌లో బందిపోటు ముఠాను ఏర్పాటు చేసి నాయకుడుగా చలామణి అయ్యాడు. పాన్‌సింగ్ ముఠా తమ చేష్టలతో ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. దీంతో పోలీసు రికార్డుల్లో దీన్ని ‘ఎ10 గ్యాంగ్’గా పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ అతని తలకు వెల కట్టారు. పాన్సింగ్ను సజీవంగా పట్టించినా, చంపినా రూ. 10 వేల నజరానాను ప్రకటించారు. అటు ప్రత్యేక పోలీసు బృందాల్ని కూడా నియమించారు. దీంతో పాన్సింగ్పై వేట ముమ్మరమైంది. 1981, అక్టోబర్ 1న ఇన్ఫార్మర్ల పక్కా సమాచారంతో వల పన్నిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 60 మంది సభ్యుల బృందం తూటాల వర్షం కురిపించి పాన్‌సింగ్ తోమర్‌ను బలిగొంది. అయితే కడు దయనీయ స్థితిలో గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు అడిగినా ఇవ్వకుండా ఈ మాజీ చాంపియన్‌ను చంపడం అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. తోమర్ ఒడిదుడుకుల జీవితంపై బాలీవుడ్లో ఓ చిత్రం తెరకెక్కింది. అతని యధార్థ కథతో ‘పాన్‌సింగ్ తోమర్’గా తెరకెక్కిన ఈ చిత్రం 2012లో విడుదలైంది. కథానాయకుడిగా ఇర్ఫాన్ ఖాన్ నటించగా, అతని భార్య పాత్రను మహీ గిల్ పోషించింది.