సాక్షి, హైదరాబాద్: తొలుత క్రీడాకారుడిగా రాణించి... ఆ తర్వాత కోచ్‌గా మారి భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చేసిన పుల్లెల గోపీచంద్, పీవీవీ లక్ష్మి కుటుంబం నుంచి మరో స్టార్ తయారవుతున్నాడు. తల్లి లక్ష్మి అడుగుజాడల్లో పయనిస్తూ ఇప్పటికే ఆమె కుమార్తె పుల్లెల గాయత్రి జూనియర్ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంటుండగా... తండ్రి గోపీచంద్ స్ఫూర్తితో తనయుడు పుల్లెల సాయి విష్ణు తొలిసారి సింగిల్స్ విభాగంలో జాతీయస్థాయిలో అదరగొట్టాడు. బెంగళూరులో జరిగిన జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో 14 ఏళ్ల సాయి విష్ణు అండర్–15 బాలుర సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన తొమ్మిదో సీడ్ సాయి విష్ణు ఫైనల్లో 21–14, 21–19తో మూడో సీడ్ యాకల సాయిసత్య సర్వేశ్ (పుదుచ్చేరి)పై విజయం సాధించాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సాయి విష్ణు రెండో రౌండ్‌లో 21–11, 21–8తో దివ్యాంశ్ (హిమాచల్‌ప్రదేశ్)పై, మూడో రౌండ్‌లో 21–12, 21–12తో తేజస్ (మహారాష్ట్ర)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–16, 20–22, 21–14తో నాలుగో సీడ్ ప్రణవ్ శర్మ (ఉత్తరాఖండ్)పై, క్వార్టర్ ఫైనల్లో 21–19, 21–18తో ఎనిమిదో సీడ్ అంకిత్ (బెంగాల్)పై, సెమీ ఫైనల్లో 21–13, 21–17తో టాప్ సీడ్ శంకర్ ముత్తుస్వామి (తమిళనాడు)పై గెలుపొందాడు. ఇదే టోర్నమెంట్ అండర్–17 బాలుర డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ గిరీశ్ నాయుడు తన భాగస్వామి శంకర్‌ప్రసాద్ ఉదయ్ కుమార్ (కేరళ)తో కలిసి టైటిల్ సాధించాడు. అండర్–17 బాలికల డబుల్స్ విభాగంలో ఎ.అభిలాష–కె.భార్గవి (తెలంగాణ) జంట రన్నరప్‌గా నిలిచింది.
అతనిపై ఒత్తిడి పెంచం!
సబ్ జూనియర్ నేషనల్స్‌లో విష్ణు విజేతగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. నాడు తొలిసారి జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలవడంతో గోపి విజయ ప్రస్థానం ప్రారంభమైంది. ఇప్పుడు సబ్ జూనియర్‌లోనే విష్ణు టోర్నీ గెలుచుకున్నాడు. గత కొంత కాలంగా డబుల్స్‌లో అతను నిలకడగా రాణిస్తూ టైటిల్స్ సాధించాడు. అయితే సింగిల్స్‌లో మాత్రం అతనికి చెప్పుకోదగ్గ విజయం లభించలేదు. ఇప్పుడు సింగిల్స్‌లో తొలిసారి టోర్నమెంట్‌ను గెలుచుకోవడం విష్ణు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మున్ముందు మరిన్ని విజయాలు సాధించేందుకు స్ఫూర్తినిస్తుంది. అండర్–15 విభాగంలో వయసు పరిమితి దాటిపోతుంది కాబట్టి వచ్చేసారి అతని లక్ష్యం అండర్–17లో సత్తా చాటడమే. అయితే మేం విష్ణుపై విజయాల కోసం ఎలాంటి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం లేదు. ఫలితాలు ప్రతికూలంగా వచ్చినా పట్టించుకోకుండా అతను ఆటను ఆస్వాదిస్తే చాలు.
– పీవీవీ లక్ష్మి, ఒలింపియన్ (విష్ణు తల్లి)
Comments
Please login to add a commentAdd a comment