National Dairy Development Board
-
భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: కేంద్ర హోమ్, సహకార శాఖల మంత్రి అమిత్ షా నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సీఓఎల్)– ’భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌ను ఆవిష్కరించారు. రాబోయే సంవత్సరాల్లో ఇది భారత్ అలాగే విదేశాలలో అత్యంత ‘‘విశ్వసనీయ’’ బ్రాండ్‌గా ఉద్భవించనుందని ఉద్ఘాటించారు. ఇందులో భాగంగా, జాతీయ వృక్ష సంరక్షణ సంస్థ (ఎన్‌పీపీఓ) ఆమోదించిన ప్రస్తుత 34 ల్యాబ్‌ల సంఖ్యను దేశవ్యాప్తంగా మరింత పెంచనున్నట్లు వివరించారు. ప్రారంభంలో ఎన్‌సీఓఎల్ భారతదేశంలో ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయిస్తుందని, అటు తర్వాత ఇతర దేశాల్లోకి విక్రయాలను విస్తరిస్తుందని అమిత్ షా తెలిపారు. ‘సహకార సంస్థల ద్వారా ఆర్గానిక్ ప్రొడక్టుల ప్రమోషన్’ అన్న అంశంపై ఎన్‌సీఓఎల్ న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక సిపోజియంలో ఎన్‌సీఓఎల్ లోగో, వెబ్సైట్, బ్రోచర్, కొన్ని ఉత్పత్తులను కూడా షా ఆవిష్కరించారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) సేంద్రీయ ఎరువును కూడా ఆయన ఈ కార్యక్రమంలో విడుదల చేశారు. ఐదు సహకార సంఘాలకు ఎన్‌సీఓఎల్ సభ్యత్వ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. నేషనల్ డైయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ)చీఫ్ ప్రమోటర్‌గా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 కింద ఈ ఏడాది జనవరి 25న ఎన్‌సీఓల్ రిజిస్టర్ అయ్యింది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మూడు కొత్త సహకార సంస్థలలో ఎన్‌సీఓఎల్ ఒకటి. మిగిలిన రెండు సహకార సంఘాలు విత్తనాలు– ఎగుమతుల రంగంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 7.89 కోట్ల సహకార సంఘాలు ఉండగా వీటిలో మొత్తం 29 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. -
లంపీ చర్మ వ్యాధి..: సంప్రదాయ చికిత్స
పశువుల చర్మంపై గడ్డల మారిదిగా వచ్చే ప్రాణాంతక వ్యాధి పేరు లంపీ చర్మ వ్యాధి. ఈ వ్యాధి గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో గో సంతతికి సోకింది. గత నెలలో గుజరాత్లో 5 జిల్లాల్లో 1,229 పశువులకు సోకింది. 39 పశువులు ప్రాణాలుకోల్పోయాయి. ఈ నేపథ్యంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రైతులకు ఇంటిపట్టున దొరికే సంప్రదాయ దినుసులతో కూడిన ఆయుర్వేద చికిత్సా పద్ధతులను రైతులకు అందుబాలోకి తెచ్చింది. లంపీ చర్మ వ్యాధి చికిత్సకు 2 పద్ధతులున్నాయి. 1) తినిపించే మందు: లంపీ చర్మ వ్యాధి చికిత్స కోసం సంప్రదాయ దినుసులతో నోటి ద్వారా తినిపించే మందు తయారు చేసే పద్ధతులు రెండు ఉన్నాయి. మొదటి విధానం: ఈ చికిత్సలో ఒక మోతాదుకు అవసరమయ్యే పదార్థాలు: తమలపాకులు 10, మిరియాలు 10 గ్రాములు, ఉప్పు 10 గ్రాములు. ఈ పదార్థాలన్నిటినీ గ్రైండ్ చేసి పేస్ట్‌లాగా తయారు చేయాలి. తయారు చేసిన పేస్ట్‌కు తగినంత బెల్లం కలిపి పశువుకు తినిపించాలి. మొదటి రోజున ఇలా తాజాగా తయారు చేసిన ఒక మోతాదు మందును ప్రతి 3 గంటలకోసారి పశువుకు తినిపించాలి. రెండో రోజు నుంచి.. రెండు వారాల పాటు.. రోజుకు మూడు సార్లు (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) తాజాగా తయారు చేసిన మందును తినిపించాలి. రెండవ విధానం: లంపీ చర్మ వ్యాధికి సంప్రదాయ పద్ధతిలో మందును రెండు మోతాదులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. వెల్లుల్లి 2 పాయలు, ధనియాలు పది గ్రాములు, జీలకర్ర పది గ్రాములు, తులసి ఆకులు గుప్పెడు, బిరియానీ ఆకులు పది గ్రాములు, మిరియాలు పది గ్రాములు, తమలపాకులు 5, ఉల్లిపాయలు చిన్నవి రెండు, పసుపు పది గ్రామలు, నేలవేము ఆకుల పొడి 30 గ్రాములు, కృష్ణ తులసి ఆకులు గుప్పెడు, వేపాకులు ఒక గుప్పెడు, నేరేడు ఆకులు ఒక గుప్పెడు.. ఇంకా బెల్లం వంద గ్రాములు. ఈ మందును కూడా ప్రతి సారీ తాజాగా తయారు చేయాలి. అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి, దానిలో బెల్లం కలపాలి. మొదటి రోజు ప్రతి 3 గంటల కోసారి తాజా మందు తయారు చేసి పశువుకు తినిపించాలి. రెండో రోజు నుంచి ప్రతిరోజూ మందును తాజాగా తయారు చేసి రోజుకు రెండుసార్లు చొప్పున పొద్దున్న, సాయంత్రం పశువు స్థితి మెరుగుపడే వరకు తినిపించాలి. 2) గాయంపై రాసే మందు: లంపీ చర్మం జబ్బు సోకిన పశువు చర్మంపై గాయం ఉంటే గనక, అందుకోసం ప్రత్యేకంగా సంప్రదాయ పద్ధతిలో మందు తయారు చేసి పై పూతగా పూయాలి. కావలసిన సామగ్రి: కుప్పింటాకులు 1 గుప్పెడు, వెల్లుల్లి పది రెబ్బలు, వేపాకులు ఒక గుప్పెడు, కొబ్బరి లేదా నువ్వుల నూనె 500 మిల్లీ లీటర్లు. పసుపు 20 గ్రాములు, గోరింటాకు ఒక గుప్పెడు, తులసి ఆకులు ఒక గుప్పెడు. తయారు చేసే విధానం.. అన్నిటినీ కలిపి మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేయాలి. దానిలో 500 మిల్లీ లీటర్ల కొబ్బరి లేదా నువ్వుల నూనె కలిపి మరిగించి, తర్వాత చల్లార్చాలి. రాసే పద్ధతి: గాయాన్ని శుభ్రపరచి దాని మీద ఈ మందును రాయాలి. గాయం మీద పురుగులు గనక ఉన్నట్లయితే.. సీతాఫలం ఆకుల పేస్ట్ లేదా కర్పూరం, కొబ్బరి నూనె కలిపి రాయాలి. National Dairy Development Board యూట్యూబు ఛానల్లో లంపీ చర్మ వ్యాధికి చికిత్సపై తెలుగు వీడియో అందుబాటులో ఉంది.. ఇలా వెతకండి.. Ethno-veterinary formulation for Lumpy Skin Disease-Telugu. -
క్షీర భగీరథుడు
మన దిగ్గజాలు - జూన్1 ప్రపంచ పాల దినోత్సవం దేశంలో క్షీరవిప్లవాన్ని తెచ్చిన దార్శనికుడు ఆయన. ఒకప్పుడు పాల కోసం అల్లాడిన భారతదేశాన్ని పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత ఆయన సొంతం. ఆయనే వర్ఘీస్ కురియన్. ‘ఆపరేషన్ ఫ్లడ్’ పేరిట ఆయన చేపట్టిన ఈ భగీరథ ప్రయత్నం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయానుబంధ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఈ క్షీరవిప్లవమే కురియన్ను ‘మిల్క్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రజలకు చేరువ చేసింది. దేశంలో పాడి పరిశ్రమ స్వయంసమృద్ధి సాధించిందంటే, అది ఆయన చలవే! అంతేనా, వంటనూనెల ఉత్పత్తిలోనూ దేశాన్ని స్వయంసమృద్ధి సాధించేలా చేయడంలోనూ గురుతర పాత్ర పోషించారాయన. కేరళ జన్మస్థలం... గుజరాత్ కార్యక్షేత్రం అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రావిన్స్‌లోని కాలికట్లో (ప్రస్తుతం ఇది కేరళలో ఉంది. దీనిపేరు కోజికోడ్గా మారింది) 1921 నవంబర్ 26న సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు వర్ఘీస్ కురియన్. కేరళలో పాఠశాల విద్య పూర్తయ్యాక కాలేజీ చదువుల కోసం మద్రాసు చేరుకున్నారు. మద్రాసులోని లయోలా కాలేజీ నుంచి ఫిజిక్స్‌లో బీఎస్సీ పొందారు. ఆ తర్వాత మద్రాసు వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కొన్నాళ్లు జెమ్షెడ్పూర్లోని టాటా స్టీల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేశారు. భారత ప్రభుత్వం అందించిన స్కాలర్‌షిప్‌తో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ మిషిగాన్ స్టేట్ వర్సిటీ నుంచి 1948లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత విద్యార్హతలతో దేశానికి తిరిగి వచ్చిన ఆయనను భారత ప్రభుత్వం గుజరాత్‌లోని ఆనంద్‌లో ప్రారంభించిన ప్రయోగాత్మక పాలకేంద్రం విధులను అప్పగించింది. ఇక అప్పటి నుంచి ఆనంద్ ఆయన కార్యక్షేత్రంగా మారింది. మధ్యలోనే మానేద్దామనుకున్నారు ప్రభుత్వం పంపగా కురియన్ తొలుత అయిష్టంగానే ఆ పని చేపట్టారు. మధ్యలోనే ఆ ఉద్యోగం మానేసి, వేరే ఏదైనా పని వెదుక్కోవాలని భావించారు. అయితే, కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం వ్యవస్థాపకుడు త్రిభువన్దాస్ పటేల్ నచ్చచెప్పడంతో కురియన్ ఆనంద్‌లోనే ఉండిపోయారు. పటేల్ పాడి రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, వారందరూ ప్రభుత్వ పాల కేంద్రానికే పాలు సరఫరా చేసేలా చూశారు. అయితే, పాల కేంద్రం కార్యకలాపాల్లో తరచూ అధికారులు జోక్యం చేసుకుంటుండటంతో కురియన్ విసుగెత్తిపోయారు. దీనికి ఏదైనా పరిష్కారం సాధించాలనుకున్నారు. ఈ విషయమై తనకు మార్గదర్శిగా ఉన్న పటేల్‌తో చర్చించారు. అమూల్... అలా మొదలైంది సహకార పద్ధతిలో పాల సేకరణ మంచి ఫలితాలనే ఇస్తున్నా, అధికారుల జోక్యమే అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తోందని కురియన్, పటేల్ భావించారు. అందుకే స్వయంగానే ఏదైనా చేద్దామని భావించారు. వారి ఆలోచన నుంచి ‘అమూల్’ పుట్టింది. ఆనంద్‌లో ఏర్పాటు చేసిన ‘అమూల్’ ప్లాంట్‌ను అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. ‘అమూల్’ ద్వారా పాలపొడి, చీజ్, వెన్న ఉత్పత్తులు ప్రారంభమైన కొద్ది సంవత్సరాలలోనే దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయి. సహకార పద్ధతిలో పాలసేకరణ ద్వారా సాధించిన ఈ విజయం అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిని ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఆయన కురియన్ను ఆహ్వానించి, దేశానికి పాల కొరత తీర్చాలనే సంకల్పంతో జాతీయ పాడి అభివృద్ధి మండలి (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్) నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. దీంతో దేశంలో క్షీరవిప్లవానికి నాందీప్రస్తావన జరిగింది. ఇక ఆ తర్వాత కురియన్ సాధించిన విజయాలన్నీ చరిత్రను సృష్టించాయి. ఆయన సారథ్యంలోనే పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న అమెరికాను భారత్ అధిగమించగలిగింది. కురియన్ చలవ వల్ల లక్షలాది మంది పాడి రైతులు పేదరికం నుంచి బయటపడి స్వయంసమృద్ధిని సాధించగలిగారు. ఈ విజయాలన్నీ కురియన్‌కు ‘పద్మవిభూషణ్’ సహా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘అమూల్’ విజయం స్ఫూర్తితో బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ బెనగల్ రూపొందించిన ‘మంథన్’ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించడం మరో విశేషం. - వర్ఘీస్ కురియన్