‘భారత్ ఆర్గానిక్స్’ ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్న కేంద్ర హోమ్, సహకార శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ
న్యూఢిల్లీ: కేంద్ర హోమ్, సహకార శాఖల మంత్రి అమిత్ షా నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సీఓఎల్)– ’భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌ను ఆవిష్కరించారు. రాబోయే సంవత్సరాల్లో ఇది భారత్ అలాగే విదేశాలలో అత్యంత ‘‘విశ్వసనీయ’’ బ్రాండ్‌గా ఉద్భవించనుందని ఉద్ఘాటించారు. ఇందులో భాగంగా, జాతీయ వృక్ష సంరక్షణ సంస్థ (ఎన్‌పీపీఓ) ఆమోదించిన ప్రస్తుత 34 ల్యాబ్‌ల సంఖ్యను దేశవ్యాప్తంగా మరింత పెంచనున్నట్లు వివరించారు.
ప్రారంభంలో ఎన్‌సీఓఎల్ భారతదేశంలో ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయిస్తుందని, అటు తర్వాత ఇతర దేశాల్లోకి విక్రయాలను విస్తరిస్తుందని అమిత్ షా తెలిపారు. ‘సహకార సంస్థల ద్వారా ఆర్గానిక్ ప్రొడక్టుల ప్రమోషన్’ అన్న అంశంపై ఎన్‌సీఓఎల్ న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక సిపోజియంలో ఎన్‌సీఓఎల్ లోగో, వెబ్‌సైట్, బ్రోచర్, కొన్ని ఉత్పత్తులను కూడా షా ఆవిష్కరించారు.
నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) సేంద్రీయ ఎరువును కూడా ఆయన ఈ కార్యక్రమంలో విడుదల చేశారు. ఐదు సహకార సంఘాలకు ఎన్‌సీఓఎల్ సభ్యత్వ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. నేషనల్ డైయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ)చీఫ్ ప్రమోటర్‌గా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 కింద ఈ ఏడాది జనవరి 25న ఎన్‌సీఓల్ రిజిస్టర్ అయ్యింది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మూడు కొత్త సహకార సంస్థలలో ఎన్‌సీఓఎల్ ఒకటి. మిగిలిన రెండు సహకార సంఘాలు విత్తనాలు– ఎగుమతుల రంగంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 7.89 కోట్ల సహకార సంఘాలు ఉండగా వీటిలో మొత్తం 29 కోట్ల మంది సభ్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment