National Highway Development
-
ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు
సాక్షి, తిరుపతి: ఏపీ ప్రభుత్వంపై కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర నిధులు రాబట్టడంలో పనితీరు కనబరుస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు మేజర్ పోర్టులను అభివృద్ధి చేస్తోందని అన్నారు. దేశంలోనే విశాఖపట్నం మేజర్ పోర్టు అని, దాని అభివృద్ధి జరుగుతోందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా ఏపీలో మరింత పారిశ్రామికాభివృద్ధి జరగనుందని తెలిపారు. కాగా తిరుపతిలో రూ.2,900 కోట్ల జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రూ. 500 కోట్లతో ఏపీ ప్రభుత్వం-నేషనల్ హైవే సంస్థ మధ్య ఎంవోయూ కుదిరిందని.. తిరుపతిలో ఇంటర్నేషనల్ సెంట్రల్ బస స్టేషన్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఆర్క్ టెక్ నిర్మాణం చేస్తామని అన్నారు. దేశంలో ఏడు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులు అభివృధ్ది చేస్తున్నామని చెప్పారు. రూ. 500 కోట్లతో తిరుపతి బస్టాండ్ విస్తరణ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరామని స్థానిక ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. కపిల తీర్థం నుంచి అంజిమేడు రోడ్డు అభివృధ్ది చేయాలని కోరినట్లు తెలిపారు. తడ శ్రీకాళహస్తి మధ్య స్టేట్ హైవేను జాతీయ రహదారిగా మార్చాలని, తిరుపతి - తిరుత్తణి-చెన్నై జాతీయ రహదారిను సిక్స్ లైన్ జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కోరినట్లు వెల్లడించారు. చదవండి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీలో అత్యధిక పెన్షన్ విధానం -
రూ.500 కోట్లివ్వండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి అభివృద్ధికి రూ.500 కోట్ల అదనపు నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు గురువారం లేఖ రాశారు. హైదరాబాద్‌కు అత్యంత కీలకమైన ఈ రహదారి మహానగర పరిధిలో 25 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందన్నారు. ఈ రహదారిపై నగర పరిధిలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో హై లెవల్ జంక్షన్లు, సర్వీసు రోడ్డు వంటి సౌకర్యాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. లేన్ల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ రూ.500 కోట్లతో డిటైల్డ్ ప్లానింగ్ రిపోర్టును తయారు చేసిందని వెల్లడించారు. నగర విస్తరణకు అనుగుణంగా వసతులు.. హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టిందని మంత్రి కేటీఆర్.. గడ్కరీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్‌కు కేంద్రం నుంచి మంజూరైన నాలుగు అర్బన్ ప్రాజెక్టులకు సంబంధించి మూడింటి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులకు భూ సేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ వంటి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. ఐటీ రంగంలో అగ్రగామి సంస్థలతో పాటు ఫార్మా, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో పెద్ద ఎత్తున తయారీ పరిశ్రమలు వస్తున్నాయన్నా రు. హైదరాబాద్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టుతో పాటు ఎస్ఆర్డీపీ కార్యక్రమంలో భాగంగా ఫ్లై ఓవర్లు, రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జీలు పూర్తి చేయడంతో పాటు లింకు రోడ్లను నిర్మించామన్నారు. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అదనపు నిధులు కేటాయించడం ద్వారా మద్దతు ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. -
అర మీటర్‌కు అడ్డు
వరంగల్ : జాతీయ రహదారి అభివృద్ధికి పట్టిన గ్రహణం వీడడం లేదు. జాతీయ రహదారి విభాగం అధికారులు ఎన్ని వివరణలు, ప్రత్యామ్నాయాలు చూపినా అటవీశాఖ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం వరకు ఉన్న రహదారిని 2002లోజాతీయ రహదారిగా మార్చేందుకు కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి వరంగల్, ములుగు, ఏటూరునాగారం మీదుగా రాష్ట్రంలో 307 కిలోమీటర్ల మేరకు ఉంది. హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా పసరా వరకు రెండులేన్లుగా అభివృద్ధి చేసేందుకు సుమారుగా పదేళ్లకు పైగా పట్టింది. జాతీయ రహదారిలో పస్రా-ఏటూరునాగారం మధ్య 27 కిలో మీటర్ల సింగిల్ రోడ్డు అభివృద్ధికి అటవీ శాఖ పలు రకాల కొర్రీలు పెట్టింది. ఈ ప్రాంతం మొత్తం అభయారణ్యంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలో ఉన్నందున ఉన్న రహదారి కంటే ఎక్కువగా వెడల్పు చేసేందుకు వీలు లేదని అభివృద్ధి పనులు అడ్డుకుంది. దీంతో ఎన్‌హెచ్ అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1957లో వచ్చిందని అంతకు ముందే నిజాం ప్రభుత్వంలో ఈ రహదారి 100 ఫీట్లు ఉందన్న రికార్డులు తీసుకువెళ్లి ఢిల్లీలోని భూఉపరితల రవాణ శాఖకు అప్పగించారు. ఈ రికార్డులను సుప్రీంకోర్టుకు సమర్పించడంతో అనుమతి లభించింది. కోర్టు ఆదేశాల మేరకు అటవీశాఖ పలు సూచనలతో 2013 జనవరి 17న క్లియరెన్స్ ఇచ్చింది. క్లియరెన్స్ ఇవ్వడంతో ఎన్‌హెచ్ అధికారులు టెండర్లు నిర్వహించి ఖరారు చేశారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మార్చి నెలాఖరులో అగ్రిమెంటు చేసుకున్నారు. ఈ రహదారి నిర్మాణం మొత్తం ఈపీసీ పద్ధతిలో ఉండడం వల్ల కాంట్రాక్టర్ సర్వే చేయించడంతో మరో మూడు నెలలు పట్టింది. అర మీటర్‌తో ఇబ్బంది.. పసరా-ఏటూరునాగారంల మధ్య ఉన్న రహదారి ప్రస్తుతం మూడున్నర మీటర్లు ఉంది. దీన్ని 7 మీటర్ల వరకు వెడల్పు చేసేందుకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. రెండు లైన్ల రహదారి అంటే 7 మీటర్లు కచ్చితంగా ఉండాల్సిందే. ఈ రహదారికి ఇరుపక్కల అర మీటరు చొప్పున సైడ్ బర్మ్స్ నిర్మించాల్సి ఉంటుంది. సైడ్బర్మ్స్ లేకుంటే వర్షాలకు రోడ్డు కోతకు గురి అయ్యే ప్రమాదం ఉంటుంది. దీనికి తోడుగా రోడ్డు పక్కనే చెట్లు ఉండడం ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. దీని కోసం అర మీటర్ వరకు అనుమతి ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఎన్‌హెచ్ ఇంజనీర్లు కోరినా పట్టించుకోవడం లేదు. వణ్యప్రాణులకు ప్రత్యేక కల్వర్టులు.. ఈ రహదారికి అనుమతి ఇచ్చిన అటవీశాఖ పలు సూచనలు చేసేంది. ఈ రహదారి పూర్తిగా అభయారణ్యంలో ఉన్నందున వన్యప్రాణి చట్టం ప్రకారం వాటికి ఇబ్బంది లేకుండా నిర్మాణాలు ఉండాలని సూచించింది. అందువల్ల ఈ 27 కిలోమీటర్ల రహదారిలో సుమారు 10 ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జీలు నిర్మిస్తారు. ఈబ్రిడ్జీల నిర్మాణం వల్ల ఇటు ఉన్న వణ్యప్రాణులు స్వేచ్ఛగా మారో పక్కకు వెళ్లేందుకు వీలు ఉంటుంది. ఈ బ్రిడ్జీలు ఎక్కడ నిర్మించాలన్న విషయాలు ఇటీవలే అటవీశాఖ అధికారులు ఎన్‌హెచ్ అధికారులుకు తెలిపారు. అయినా రహదారి 7 మీటర్ల లోపలే పనులు చేసుకోవాలని వారు సూచించినట్లు తెలిసింది. పనులు జరిగే సమయంలో రహదారికి ఇరుపక్కల మీటరు వరకు యంత్రాలు ఉపయోగానికి స్థలం అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇన్నీ జరుగుతున్నా పాలక వర్గ నేతలు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. మేడారానికి మళ్లీ తిప్పలే.. పసరా-ఏటూరునాగారంల మధ్య రహదారి రెండు లైన్లుగా అభివృద్ధి కాకుంటే వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతరకు ట్రాఫిక్ తిప్పలు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. రిజర్వు ఫారెస్టులో వేలాది ఎకరాలు పోడు జరుగుతున్నా చూసీచూడనట్లు వహిస్తున్న అటవీశాఖ ప్రజలకు నిత్యం ఉపయోగపడే రహదారులను అడ్డుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధిలో భాగస్వాములమని అని ఊదర గొడుతున్న ప్రజాప్రతినిధులు ఈ రహదారి అభివృద్ధికి ఏం చొరవ తీసుకుంటారో చూడాల్సిందే.