national highways blockage
-
22న జాతీయ రహదారుల దిగ్బంధనం
చిత్తూరు కార్పొరేషన్ : ప్రత్యేక హోదా కోసం అఖిలపక్ష పార్టీలు గురువారం చేపట్టనున్న జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమానికి వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో సీపీఐ నాయకులు నాగరాజన్ అధ్యక్షతన మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జంగాలపల్లె మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సీపీఎం నాయకులు చల్లా వెంకటయ్య, చైతన్య మాట్లాడుతూ ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలను మోసం చేసి దగా చేసిన మోదీని తెలుగు ప్రజలు క్షమించరని తెలిపారు. తెలుగు రాష్ట్ర ప్రజల కోరిక మేరకు కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధించేంతవరకు పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమించడానికి నాయకులు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. ఈ పోరాటంలో భాగంగానే 22న జాతీయ రహదారుల దిగ్బంధనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు గజేంద్రబాబు, లోకేష్, అక్బర్, శరవణ, మునస్వామి, విజయగౌరి తదితరులు పాల్గొన్నారు. -
10న జాతీయ రహదారుల దిగ్భంధం: ఏపీసీసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) ఈ నెల 10వ తేదీన జాతీయ రహదారుల దిగ్భంధానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా గురువారం ఇందిరాభవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ ప్రధానకార్యదర్శి జంగా గౌతమ్, ఉపాధ్యక్షులు సూర్యా నాయక్, లీగల్ సెల్ చైర్మన్ సుందర రామశర్మలతో కలిసి మాట్లాడారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడులను ఉద్దేశించి రెండు ప్రశ్నలు వేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మార్చి1,2014న కేబినేట్ తయారు చేసిన బిల్లులో ఉందా లేదా?. రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై రెండుసార్లు తీర్మానం ఎవరిని మోసగించేందుకు? అని ప్రశ్నించారు. బుధవారం ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్లు పెట్టి ఏపీ ప్రజల ప్రయోజనాలను తుంగలో తొక్కారని అన్నారు. పార్లమెంటు సాక్షిగా ఓ మాజీ ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను.. ప్రస్తుతం ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్న నరేంద్ర మోదీ పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. గత పరిపాలకుల నిర్ణయాలను పట్టించుకోని మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు విలువేముంటుందని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని చెప్పారు.