National Industrial Security Academy
-
భద్రత ఉంటేనే అభివృద్ధి సాధ్యం
సాక్షి, హైదరాబాద్/జవహర్‌నగర్: ఏ దేశమైనా అంతర్గతంగా సురక్షితంగా, శాంతిభద్రతలతో ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. దేశాన్ని అంతర్గతంగా సురక్షితంగా ఉంచడంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) అత్యంత కీలకంగా పనిచేస్తోందన్నారు. భవిష్యత్‌లో దేశ ఆర్థికాభివృద్ధి, అన్ని రంగాల వికాసంలోనూ సీఐఎస్ఎఫ్ ప్రముఖ పాత్ర పోషించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా)లో సీఐఎస్ఎఫ్ 54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమిత్‌షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత స్మారక స్తూపం వద్ద సీఐఎస్ఎఫ్ అమర జవాన్లకు ఆయన నివాళులర్పించారు. ఆ తర్వాత సీఐఎస్ఎఫ్ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని కేంద్ర ప్రభుత్వ భవన సముదాయాలు, ఎయిర్‌పోర్టుల వంటి అనేక కీలక సంస్థలకు భద్రత కల్పించడంలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని.. కేంద్ర హోం మంత్రిగా తాను ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ వందో స్వాతంత్య్ర వేడుకల వరకు 5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల సేకరణను లక్ష్యంగా నిర్ధేశించారని, ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చేందుకు భద్రత అనేది కీలక అంశమని అన్నారు. దేశంలో శాంతియుత వాతావరణం ఉంటేనే ఇది సాధ్యమని హోం మంత్రి అమిత్‌షా అభిప్రాయపడ్డారు. 1930 మార్చి 12న మహాత్మాగాంధీ దేశ స్వాతంత్య్రం కోసం ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారని, అదే రోజున సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ భద్రత విధుల్లో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ సమయంలోనూ సీఐఎస్ఎఫ్ సిబ్బంది, అధికారులు వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి, మానవీయ కోణంలో ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లలో సేవలందించారని ప్రశంసించారు. సమస్యలను సవాలుగా తీసుకుని ముందుకు సాగాలని జవాన్లకు సూచించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. గతంతో పోలిస్తే కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదుల హింసాత్మక ఘటనలు తగ్గాయని, ప్రజల్లోనూ కేంద్ర బలగాలపై విశ్వాసం పెరుగుతోందని అమిత్‌షా అన్నారు. భవిష్యత్తులోనూ ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, ప్రధాని మోదీ సర్కార్ అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతుందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ ఎంపీలు కె.లక్ష్మణ్, బండి సంజయ్, సీఐఎస్ఎఫ్ డీజీపీ షీల్వర్ధన్ సింగ్, నిసా డైరెక్టర్ కె.సునీల్ ఇమ్మాన్యుయెల్, తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న విన్యాసాలు.. సీఐఎస్ఎఫ్ 54వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హకీంపేటలోని నిసాలో ఆదివారం నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఉగ్రమూకల దాడులను ఎలా తిప్పికొడతారు.. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది పనితీరు, అగ్నిప్రమాదాల సమయంలో సహాయక చర్యల వంటి విన్యాసాలను కళ్లకుకట్టినట్టు సీఐఎస్ఎఫ్ సిబ్బంది చూపారు. మహిళా సిబ్బంది ప్రదర్శించిన కలరిపయట్టు విన్యా సాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకు ముందు నిసా ప్రాంగణంలోనే ‘అర్జున’పేరిట ఫైరింగ్ రేంజ్‌ను అమిత్‌షా ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన అధికారులు, జవాన్లకు బహుమతులను అందజేశారు. -
తెలంగాణకు అమిత్ షా.. బీజేపీ నేతలతో భేటీపై ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా హైదరాబాద్ రానున్నారు. శనివారం రాత్రి 8.30 గంటలకు ఆయన హకీంపేట ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న నేషనల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ అకాడమీ (నీసా)లో రాత్రి పూట బసచేస్తారు. సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం అక్కడే నిర్వహించనున్న కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం కేరళలోని కొచ్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళతారు. కాగా, శనివారం రాత్రి లేదా ఆదివారం ఆయన రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు, ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్ష, ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో ప్రశ్నించేందుకు కవితకు ఈడీ నోటీసులు, కేంద్రం, ప్రధాని మోదీ, బీజేపీలపై బీఆర్ఎస్, ఇతర విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడం, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతున్న తీరు.. తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా సంగారెడ్డిలో వివిధ రంగాలకు చెందిన మేధావులతో భేటీ కావాలని భావించారు. అయితే కొచ్చి కార్యక్రమం కారణంగా ఈ సమావేశం రద్దయినట్టు పార్టీ నేతలు వెల్లడించారు. -
ప్రతి ఒక్కరూ వీరసైనికుడు కావాలి
శామీర్‌పేట్, న్యూస్‌లైన్: దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ వీర సైనికుడి వలే తయారు కావాలని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ( సీఐఎస్ఎఫ్) డెరైక్టర్ జనరల్ రాజీవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రక్షణ ఇవ్వడమే కాకుండా రాబోయే రోజుల్లో నక్సలిజాన్ని అణిచివేయడానికి నిసా శిక్షకులు సన్నద్ధం కావడం హర్షణీయమని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం హకీంపేట్‌లోని నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీ(నిసా)లో సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, ఎల్డీసీఈ, ఎస్ఐలుగా శిక్షణ పూర్తి కావడంతో పాసింగ్ అవుట్ పేరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన డీజీ రాజీవ్ రక్షణ దళం ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించి ప్రసంగించారు. అనంతరం శిక్షణకాలంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కమాండర్లకు ప్రశంసా పత్రాలను అందించారు. అంతకుముందు నిసా డెరైక్టర్ అనీల్‌కుమార్ స్వాగతోపాన్యాసం చేశారు. విజేతలు వీరే... నిసాలో జరిగిన శిక్షణ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసి వారికి ప్ర సంశాపత్రాలతో పాటు మెమొంటోలను ము ఖ్యఅతిథి చేతుల మీదుగా బహుకరించారు. విజేతల్లో 39వ బ్యాచ్సబ్ఇన్స్పెక్టర్లలో మొ దటి ర్యాంకు మహమూద్( బెస్ట్ ఇన్ ఫైరింగ్(షూటింగ్విభాగం),సుజిత్‌కుమార్ (బెస్ట్ ఇన్ అవుట్డోర్ట్రయినింగ్), ప్రకాశ్‌సింగ్(బెస్ట్ ఇన్ ఇండోర్ ట్రయినింగ్), కపిల్‌దేవ్(ఆల్ రౌండ్ బెస్ట్), 7వ బ్యాచ్ అసిస్టెంట్ కమాం డెంట్( ఎల్డీసీఈ) విభాగంలో భన్వర్‌లాల్ (ఆల్ రౌండ్ బెస్ట్), 27వ బ్యాచ్ అసిస్టెంట్ క మాండెంట్ విభాగంలో అఖిలేష్‌కుమార్( బెస్ట్ ఇన్ఫైరింగ్), వికాస్కుమార్(బెస్ట్ అవుట్డోర్ ట్రయినింగ్), అఖిలేష్‌కుమార్ (బెస్ట్ ఇన్ ఇన్డోర్ ట్రయినింగ్), అఖిలేష్‌కుమార్(ఆల్ రౌండ్ బెస్ట్)లుగా నిలిచారు. కార్యక్రమం లో ఏడీ పీఐడీ రత్నాకర్ పాల్గొన్నారు.