సాక్షి, హైదరాబాద్/జవహర్‌నగర్: ఏ దేశమైనా అంతర్గతంగా సురక్షితంగా, శాంతిభద్రతలతో ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. దేశాన్ని అంతర్గతంగా సురక్షితంగా ఉంచడంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) అత్యంత కీలకంగా పనిచేస్తోందన్నారు. భవిష్యత్‌లో దేశ ఆర్థికాభివృద్ధి, అన్ని రంగాల వికాసంలోనూ సీఐఎస్‌ఎఫ్ ప్రముఖ పాత్ర పోషించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆదివారం హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా)లో సీఐఎస్‌ఎఫ్ 54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమిత్‌షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత స్మారక స్తూపం వద్ద సీఐఎస్‌ఎఫ్ అమర జవాన్లకు ఆయన నివాళులర్పించారు. ఆ తర్వాత సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని కేంద్ర ప్రభుత్వ భవన సముదాయాలు, ఎయిర్‌పోర్టుల వంటి అనేక కీలక సంస్థలకు భద్రత కల్పించడంలో సీఐఎస్‌ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని.. కేంద్ర హోం మంత్రిగా తాను ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ వందో స్వాతంత్య్ర వేడుకల వరకు 5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల సేకరణను లక్ష్యంగా నిర్ధేశించారని, ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చేందుకు భద్రత అనేది కీలక అంశమని అన్నారు.
దేశంలో శాంతియుత వాతావరణం ఉంటేనే ఇది సాధ్యమని హోం మంత్రి అమిత్‌షా అభిప్రాయపడ్డారు. 1930 మార్చి 12న మహాత్మాగాంధీ దేశ స్వాతంత్య్రం కోసం ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారని, అదే రోజున సీఐఎస్‌ఎఫ్ వ్యవస్థాపక వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సీఐఎస్‌ఎఫ్ భద్రత విధుల్లో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
కోవిడ్ సమయంలోనూ సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, అధికారులు వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి, మానవీయ కోణంలో ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లలో సేవలందించారని ప్రశంసించారు. సమస్యలను సవాలుగా తీసుకుని ముందుకు సాగాలని జవాన్లకు సూచించారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం..
గతంతో పోలిస్తే కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదుల హింసాత్మక ఘటనలు తగ్గాయని, ప్రజల్లోనూ కేంద్ర బలగాలపై విశ్వాసం పెరుగుతోందని అమిత్‌షా అన్నారు. భవిష్యత్తులోనూ ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, ప్రధాని మోదీ సర్కార్ అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతుందని స్పష్టంచేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ ఎంపీలు కె.లక్ష్మణ్, బండి సంజయ్, సీఐఎస్‌ఎఫ్ డీజీపీ షీల్‌వర్ధన్ సింగ్, నిసా డైరెక్టర్ కె.సునీల్ ఇమ్మాన్యుయెల్, తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న విన్యాసాలు..
సీఐఎస్‌ఎఫ్ 54వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హకీంపేటలోని నిసాలో ఆదివారం నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఉగ్రమూకల దాడులను ఎలా తిప్పికొడతారు.. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది పనితీరు, అగ్నిప్రమాదాల సమయంలో సహాయక చర్యల వంటి విన్యాసాలను కళ్లకుకట్టినట్టు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది చూపారు.
మహిళా సిబ్బంది ప్రదర్శించిన కలరిపయట్టు విన్యా సాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకు ముందు నిసా ప్రాంగణంలోనే ‘అర్జున’పేరిట ఫైరింగ్ రేంజ్‌ను అమిత్‌షా ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన అధికారులు, జవాన్లకు బహుమతులను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment