సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా హైదరాబాద్ రానున్నారు. శనివారం రాత్రి 8.30 గంటలకు ఆయన హకీంపేట ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న నేషనల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ అకాడమీ (నీసా)లో రాత్రి పూట బసచేస్తారు. సీఐఎస్‌ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం అక్కడే నిర్వహించనున్న కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం కేరళలోని కొచ్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళతారు.
కాగా, శనివారం రాత్రి లేదా ఆదివారం ఆయన రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు, ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్ష, ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో ప్రశ్నించేందుకు కవితకు ఈడీ నోటీసులు, కేంద్రం, ప్రధాని మోదీ, బీజేపీలపై బీఆర్‌ఎస్, ఇతర విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడం, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతున్న తీరు.. తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా సంగారెడ్డిలో వివిధ రంగాలకు చెందిన మేధావులతో భేటీ కావాలని భావించారు. అయితే కొచ్చి కార్యక్రమం కారణంగా ఈ సమావేశం రద్దయినట్టు పార్టీ నేతలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment