నేడు అమిత్‌షా రాక
చెన్నై,సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షులు అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం చెన్నైకి రానున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయుత్తం చేసేందుకు తొలిసారిగా తమిళనాట కాలుమోపనున్నారు.బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఎందరో పనిచేసి నా వారందరికీ భిన్నమైన మనిషిగా అమిత్‌షా పేరుతెచ్చుకున్నారు. అట్టడుగున ఉన్న పార్టీని అగ్రస్థానం లో నిలబెట్టడంలో సిద్ధహస్తుడని తాజా పార్లమెంటు ఎన్నికలు నిరూపించాయి. పైగా సెంటిమెంట్ల ప్రభా వం అధికంగా ఉన్న బీజేపీలో కలిసొచ్చిన కమలనాథుడుగా అమిత్‌షా కీర్తి గడించాడు.
అందుకే కేంద్రం లో ప్రధాని తర్వాత ప్రాముఖ్యం అమిత్‌షాకే. తన రాజకీయ చతురత, వ్యూహంతో ఉత్తరాదిలో బీజేపీకి ఊహించని సీట్లు సాధించి పెట్టిన అమిత్‌షాపై ప్రస్తుతం దక్షిణాది భారం పడింది. నాలుగు దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడు రాజకీయ కల్లోలంలో పడింది. బలమైన అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత కేసులతో బలహీనపడడం, డీఎంకే పుం జుకోక పోవడం, కాంగ్రెస్ మట్టికరిచిపోవడం వంటి కారణాలతో తమిళనాడు కొట్టుమిట్టాడుతోంది. బీజేపీని బలోపేతానికి ఇదే అదనుగా కమలనాథులు కాలు కదుపుతున్నారు. 2016 నాటి ఎన్నికల్లో ఒంటరి గా లేదా కూటమి పార్టీలతో కలిసి జార్జికోటపై జెండా ఎగురవేయూలని బీజేపీ తహతహలాడుతోంది. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఏర్పడిన బీజేపీ కూటమికి బీటలువారాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, కూటమి పార్టీలకు మధ్య సఖ్యత కరువై అగాధం ఏర్పడింది.
అమిత్‌షా సమ్మోహనాస్త్రం
రాష్ట్ర బీజేపీ పార్లమెంటు ఎన్నికల సమయంలో బలం పుంజుకుని నేడు మళ్లీ బలహీనంగా తయారైంది. ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రధాని మోదీ అమిత్‌షాను రాష్ట్రానికి పంపే ఏర్పాట్లు చేశారు. ఈనెల 20న మధ్యాహ్నం కేరళ నుంచి చెన్నైకి చేరుకుంటారు. గిండీలోని ఒక ఐదు నక్షత్రాల హోటల్ సేదతీరి నగర శివార్లు మరైమలైనగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.30 నుంచి రాత్రి 7 గంటల వరకు సభలో పాల్గొని హోటల్‌కు చేరుకుంటారు. 7 గంటల అనంతరం పలు పార్టీలకు చెందిన నేతలు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశమవుతారు. 21వ తేదీ ఉదయం టీనగర్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు. హటల్‌లో మధ్యాహ్నం నుంచి కూటమి పార్టీ నేతలతో చర్చలు జరుపుతారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
సీఎం అభ్యర్థి నిర్మలాసీతారామన్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి తామే నాయకత్వం వహించబోతున్నట్లు డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే అధినేత రాందాస్ ఎవరికివారు ప్రకటించుకున్నారు. సీఎం అభ్యర్థి తానేనంటూ విజయకాంత్, అన్బుమణి రాందాస్ (పీఎంకే) ప్రచారం చేసుకుంటున్నారు. మోదీ చరిష్మానే ప్రధాన ఆకర్షణగా మారిన తరుణంలో సీఎం అభ్యర్థిత్వాన్ని మరో పార్టీకి కట్టబెట్టడం బీజేపీకి ఎంతమాత్రం ఇష్టంలేదు. ఈ తర్జనబర్జనలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రధానికి అత్యంత నమ్మకస్తురాలు, తమిళనాడు ఆడపడుచు కావడం ఆమెకున్న అర్హతలుగా భావిస్తున్నారు. అమిత్ షా పర్యటనలో సీఎం అభ్యర్థి పేరు ప్రస్తావనకు వస్తుందని ఆశిస్తున్నారు.
బిజీ బిజీ
బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమిత్ షా తొలిసారిగా రాష్ట్రంలో అడుగుపెట్టడంతో నేతలు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. 20వ తేదీ నాటి బహిరంగ సభ వేదికను అసెంబ్లీ భవనాన్ని తలపిం చేలా నిర్మిస్తూ జార్జికోటపై పార్టీ గురిపెట్టిందని చెప్పకనే చెబుతున్నారు. అమిత్ షా సమక్షంలో పలువురు ప్రముఖులు, ఇతర పార్టీలకు చెందిన వారు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. అలిగి దూరం గా ఉన్న కూటమి నేతలను సైతం బుజ్జగించే పనిలో పడ్డారు. విజయకాంత్ మినహా మిగిలిన వారు రాకపోవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.