National team
-
విల్ పకోవ్‌స్కీకి తొలి అవకాశం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న 22 ఏళ్ల విల్ పకోవ్‌స్కీకి జాతీయ జట్టు పిలుపు లభించింది. భారత్‌తో జరిగే నాలుగు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం సెలక్టర్లు పకోవ్‌స్కీని ఎంపిక చేశారు. వార్నర్‌తో పాటు అతను ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉంది. విక్టోరియాకు చెందిన పకోవ్‌స్కీ షెఫీల్డ్ షీల్ట్ టోర్నీలో గత రెండు మ్యాచ్‌లలో వరుసగా రెండు డబుల్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఓవరాల్‌గా 22 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 55.48 సగటుతో అతను 1720 పరుగులు సాధించాడు. 17 మంది సభ్యుల బృందంలో పకోవ్‌స్కీతో పాటు చోటు లభించిన మరో నలుగురు ఆటగాళ్లు కూడా ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున టెస్టులు ఆడలేదు. కామెరాన్ గ్రీన్, మిషెల్ స్వెప్సన్, మైకేల్ నెసెర్, సీన్ అబాట్‌లు జట్టులోకి ఎంపికయ్యారు. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 17నుంచి అడిలైడ్‌లో తొలి టెస్టు జరుగుతుంది. జట్టు వివరాలు: టిమ్ పైన్ (కెప్టెన్), సీన్ అబాట్, జో బర్న్స్, ప్యాట్ కమిన్స్, కామెరాన్ గ్రీన్, హాజల్‌వుడ్, ట్రవిస్ హెడ్, లబ్‌షేన్, లయన్, నెసెర్, ప్యాటిన్సన్, పకోవ్‌స్కీ, స్టీవ్ స్మిత్, స్టార్క్, స్వెప్సన్, వేడ్, వార్నర్ -
నేను ఎందుకు నవ్వనంటే...
న్యూఢిల్లీ: పేరుకు తగినట్లుగానే క్రికెటర్ గౌతం గంభీర్ వదనం ఎప్పుడూ గంభీరంగానే కనిపించేది. ఏ స్థాయి మ్యాచ్‌లోనైనా అతను మనసారా నవ్వడాన్ని దాదాపుగా ఎవరూ చూసి ఉండరు! ఇటీవలే రిటైర్ అయిన గంభీర్ దీనికి కారణాన్ని వెల్లడించాడు. జీవితంలో తనకు ఏదీ సునాయాసంగా దక్కలేదని, ప్రతీదాని కోసం శ్రమించాల్సి రావడంతో అదే తరహాలో ఉండటం అలవాటైందని అతను చెప్పాడు. ‘చాలా మంది నన్ను ఈ విషయం గురించి అడిగారు. కానీ దానికో నేపథ్యం ఉంది. ప్రతీ ఒక్కరు హాయిగా నవ్వాలని, సరదాగా ఉండాలని భావిస్తారు. కానీ అండర్–12 స్థాయినుంచి జాతీయ జట్టులోకి వచ్చే వరకు నేను చాలా కష్టపడ్డాను. బాగా ఆడినా జట్టు నుంచి తప్పించిన రోజులు, ప్రతీసారి జట్టులో చోటు కోసం పోరాడాల్సి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. 2007 వరల్డ్‌కప్‌లో చోటు దక్కకపోయేసరికి నేను మరింత సీరియస్‌గా మారిపోయాను. బహుశా అదే నేను నవ్వకపోవడానికి, సరదాగా గడపకపోవటానికి కారణమైంది. ఐపీఎల్లో కూడా భారీ మొత్తానికి నన్ను తీసుకోవడం వల్ల తీవ్రమైన ఒత్తిడి ఉండేది. నాకు తగినంత స్వేచ్ఛ ఇచ్చినా, రెండు సార్లు టైటిల్ గెలిచినా ఆ ఒత్తిడి మాత్రం తగ్గలేదు. బహుశా షారుఖ్ కొంత తక్కువ మొత్తం ఇస్తే బాగుండేదేమో’ అని గంభీర్ వివరించాడు. -
రిషభ్ బ్యాటింగ్ ఘనం
న్యూఢిల్లీ: పరిస్థితులకు తగినట్లుగా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం, పట్టుదల రిషభ్ పంత్‌లో బలంగా ఉన్నాయని భారత ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ‘సాధారణంగా పంత్ దూకుడుగా ఆడటాన్ని ఇష్టపడతాడు. అదే అతని శైలి. అయితే ఎర్ర బంతితో ఆడినప్పుడు కూడా జట్టు అవసరానికి తగినట్లు తనను తాను మలచుకోగలడు. అతను జాతీయ జట్టులోకి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఇప్పటినుంచి అతను తన కెరీర్ మరింత బాగా మలచుకోగలడని నమ్ముతున్నా’ అని ద్రవిడ్ అన్నాడు. ‘ప్రస్తుత ఇంగ్లండ్ ‘ఎ’ పర్యటనలో వివిధ సవాళ్లకు తగినట్లుగా ఆడే విధంగా రిషభ్‌కు అవకాశం కల్పించాం. వన్డే టోర్నీ ఫైనల్లో అర్ధ సెంచరీ, విండీస్ ‘ఎ’తో నాలుగు రోజుల మ్యాచ్‌లో జయంత్‌తో వందకు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం మనం చూశాం’ అని ద్రవిడ్ వివరించాడు. మరోవైపు భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ మాట్లాడుతూ ఇంగ్లండ్‌పై గెలవాలంటే కోహ్లి సేన ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలని సూచించాడు. -
పెళ్లి నుంచి తప్పించుకొని.. జాతీయ జట్టుకు ఆడుతూ
సాక్షి, హైదరాబాద్ : బాల్యవివాహం నుంచి తప్పించుకున్న హైదరాబాద్‌కు యువ క్రీడాకారిణి నేడు జాతీయ రగ్బీ జట్టుకు ఎంపికైంది. వివరాల్లోకి వెళ్తే గత ఏడాది హైదరాబాద్‌కు చెందిన బి అనూష అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్న సమయంలో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వివాహం ఇష్టం లేని అనూష చైల్డ్‌లైన్ అధికారులను ఆశ్రయించింది. పెళ్లికి పదిరోజుల ముందు చైల్డ్‌లైన్ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో అనూష వివాహాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహం నేరమౌతుందని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్యవివాహం నుంచి బయటపడిన అనూష ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతోంది. అంతే కాకుండా మహిళల రగ్బీఆటలో ప్రతిభ చూపింది. జాతీయ జట్టుకు ఎంపికైంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం తన లక్ష్యం అని అనూష తెలిపింది. గతంలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన మహిళల అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో తెలంగాణ తరపున ఆడింది. -
జాతీయ జట్టులో చోటు సాధించాలి
హకీ రాష్ట్ర జట్టుకు ఎంపికైన వీకే రాయపురం విద్యార్థి సామర్లకోట : జాతీయ స్థాయి హాకీ జట్టులో స్థానం సంపాదించి, పాకిస్థా¯ŒSతో ఆడి విజయం సాధించాలనేది తన లక్ష్యమని గొలుసు వీరబాబు తెలిపాడు. సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామానికి చెందిన ఇతడు జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతూ రాష్ట్ర స్థాయి హకీ జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 22 నుంచి 26 వరకు బోపాల్‌లో జరిగే జాతీయ స్థాయి చాంపియ¯ŒS షిప్ పోటీలలో అండర్- 17 విభాగంలో పాల్గొంటున్నాడు. ఇటీవల అండర్-17 విభాగంలో నెల్లూరు జిల్లాలో 12, 13, 14 తేదీలల్లో జరిగిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీలో జిల్లా జట్టు తరఫున ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్టు హకీ జిల్లా కోచ్ రవిరాజ్ ‘సాక్షి’కి తెలిపారు. 2014లో పైకా టోర్నమెంటులో పాల్గొన్న వీరబాబు 2015లో జిల్లా జట్టులో స్థానాన్ని స్థిరం చేసుకున్నాడని తెలిపారు. వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చి పాఠశాలలో చదువుకొంటున్నాడని, తల్లి అదే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలిగా పని చేస్తోందన్నారు. డిగ్రీ పూర్తి చేసి స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం సంపాదించాలని ఉందని వీరబాబు ఆశాభావం వ్యక్తం చేశాడు. రాష్ట్ర హాకీ జట్టుకు ఎంపికైన విద్యార్థి వీరబాబును పాఠశాల హెచ్ఎం అనురాధ, గ్రామ సర్పంచ్ కుర్రా నారాయణస్వామి, కోచ్ రవిరాజ్‌లు, గ్రామ నాయకులు అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి బోపాల్ బయలు దేరాడు. -
ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు బాలికల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారని ఏపీ స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. తద్వారా జిల్లా కీర్తిని ఇనుమడింపజేసిన ఆ క్రీడాకారులను శనివారం స్థానిక కొత్తూరు బాలుర పాఠశాలలో అభినందించారు. గత నెల 28–30 వరకు తిరుపతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచిన వీరు సెలెక్టర్ల మన్ననలు పొంది జాతీయ జట్టుకు ఎంపికయ్యారన్నారు. అక్కడ కూడా ఇలాగే ప్రతిభ కనబరచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. జాతీయస్థాయి క్రీడాపోటీలు బాలికలకు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌లోను, బాలురకు జమ్మూకాశ్మీర్‌లోనూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ విజయ, కోచ్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ............ జాతీయ జట్టుకు ఎంపికైన బాలికలు లక్ష్మీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆత్మకూరు. లావణ్య, మహాత్మ జూనియర్ కళాశాల, ఉరవకొండ. వరలక్ష్మీ, హేమావతి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉరవకొండ. మల్లిక, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కళ్యాణదుర్గం .............. జాతీయ జట్టుకు ఎంపికైన బాలురు రహమాన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అనంతపురం -
రె‘ఢీ’
విశాఖపట్నం : జాతీయ స్థాయిలో పోటీపడేందుకు జూనియర్ అథ్లెట్లు సిద్ధమయ్యారు. విశాఖ పోర్ట్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా పండగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాక్, ఫీల్డ్ అంశాల్లో అండర్14కు ఐదు అంశాల్లో, అండర్16కు పది అంశాల్లో బాల, బాలికలకు వేర్వేరుగా ఈ పోటీలు జరగనున్నాయి. పరుగు నిర్వహించేందుకు 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్, త్రో ఈవెంట్స్‌కు సర్కిల్స్, జంప్ ఈవెంట్‌కు పిట్లను సిద్ధం చేశారు. జావెలిన్, హైజంప్‌లకు సైతం సామగ్రిని అందుబాటులో ఉంచారు. జాతీయ జట్టుకు ఎదిగేందుకు ప్రాథమిక ఎంపిక ఈ మీట్ నుంచే జరగనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా స్థాయిలోనే ప్రతిభను గుర్తించేందుకు జాతీయ కోచ్‌లు కూడా మీట్‌కు రానున్నారు. 30మంది విజేతలతో పాటు చక్కటి ప్రతిభ కనబరిచిన అథ్లెట్లను ప్రాబబుల్స్‌గా ఎంపిక చేస్తారు. జూనియర్ అథ్లెట్లు ఏ మేరకు అవకాశాన్ని వినియోగించుకోనున్నారో తేలాల్సి ఉంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పతకాలు ఈ మీట్‌ను రాష్ట్ర మంత్రులు ఉద యం ఎనిమిదిన్నరకు ప్రారంభిస్తా రు. సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పతకాలు అందజేస్తారు. తొలిరోజు శనివారం అండర్ 14 బాలుర లాంగ్‌జంప్, అండర్16 షాట్‌పుట్ అంశాల్లో విజేతల్ని తేల్చేయనున్నారు. బాలికల అండర్16 జావెలిన్ త్రోతో పాటు అండర్ 14 బాల బాలికల విభాగాల్లో 600 మీటర్ల పరుగు ఫైనల్స్‌ను ముగించి విజేతలకు పతకాలు ఇస్తారు. జిల్లా జట్టుకు కిట్ పంపిణీ జిల్లా జట్టుకు ఎంపికైన 13 మంది జూనియర్ అథ్లెట్లకు స్పోర్ట్స్ కిట్లను శుక్రవారం అందించారు. క్రీడాదుస్తుల్ని స్టేట్బాంక్ గ్రూప్ ప్రతినిధి ప్రసాద్ అందించగా షూలను విశ్రాంత డీఎస్పీ టిఎస్ఆర్ ప్రసాద్ అందచేశారు. అండర్14 బాలుర విభాగంలో నలుగురు, బాలికల విభాగంలో ముగ్గురు, అండర్ 16 బాలుర విభాగంలో ఐదుగురు, బాలికల విభాగంలో ఒక్కరు జిల్లా తరపున మీట్లో తలపడనున్నారు. ఏర్పాట్లపై సమీక్ష శుక్రవారం ఉదయాన్నే జిల్లా కలెక్టర్‌తో పాటు నిర్వాహక కమిటీ ఇన్‌చార్జ్‌లు పోర్ట్స్టేడియానికి చేరుకున్నారు. ప్రారంభ వేడుక ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. స్టేడియంలో పోటీపడే ట్రాక్, ఫీల్డ్‌లో ఏర్పాట్లు సమీక్షించారు. మంచినీటి ఏర్పాటుతో పాటు స్టేడియంలో ఏర్పాటు చేయాల్సిన వసతులను నోడల్ ఆధికార్లు పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. తొలి రోజు పోటీ అంశాలు అండర్ 14 బాలికల 600 మీటర్ల హీట్స్‌తో పోటీలు మొదలుకానున్నాయి. అండర్ 14, 16ల్లో బాల, బాలికల విభాగాల్లో లాంగ్‌జంప్, షాట్‌పుట్ క్వాలిఫయింగ్ రౌండ్స్ జరగనున్నాయి. బాలుర అండర్ 14లో 600మీటర్ల హీట్స్, అండర్16 బాలుర 100 మీటర్ల తొలిరౌండ్, అండర్ 16 బాలికల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్స్, అండర్ 16 బాలికల 100 మీటర్ల తొలిరౌండ్ పో టీల అనంతుం భోజన విరామం ఉంటుంది. 100 మీటర్ల రెండో రౌం డ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్ ఫైనల్స్, 100మీటర్ల రెండో రౌండ్, జావెలిన్ త్రో ఫైనల్స్, హైజంప్ క్వాలిఫయింగ్ రౌండ్స్, 100 మీటర్ల సెమీ స్, వెయ్యిమీటర్లు హీట్స్ అనంతరం 600మీటర్ల ఫైన ల్స్తో ఆయా కేట గిరిల్లో తొలిరోజు పోటీలు ముగుస్తాయి. జిల్లా యంత్రాంగానిదే వసతి బాధ్యత మూడు వేలకు పైగా జూనియర్ అథ్లెట్లు, 500కు పైగా టెక్నికల్ అఫిషియల్, కోచ్, మేనేజర్లు ఈ మీట్ కోసం రానున్నారు. రిసెప్సన్, రవాణా, వసతి, రక్షణ, వైద్య తదితర సేవల్ని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. దాదాపు పాల్గొనే అథెట్లు అంతా విశాఖ చేరుకున్నట్లే. అర్హత కలిగిన వారు పోటీలకు అనుమతిస్తారు. మీట్ జరిగే మూడు రోజులు భోజన వసతి సమాఖ్య చూసుకుంటుంది. -జిల్లా కలెక్టర్ యువరాజ్ -
అయ్యా.. మీరే దిక్కు
-
అయ్యా.. మీరే దిక్కు
సిద్దిపేట రూరల్: ‘అయ్యా, మాకు మీరే దిక్కు.. అకాల వర్షాృతో పంటలను పోగొట్టుకున్నాం... అప్పుల పాలయ్యాం... ప్రభుత్వం ఆదుకోకపోతే రోడ్డున పడతాం.. మా పరిస్థితిని అర్థం చేసుకొని పరిహారమిచ్చి ఆదుకోండి’ అంటూ రైతులు కేంద్ర బృందం సభ్యులతో మొరపెట్టుకున్నారు. కేంద్ర బృందం సభ్యులైన సెంట్రల్ జాయింట్ సెక్రటరీ ఉత్పాల్ కుమార్‌సింగ్, సెంట్రల్ ౄయింట్ డెరైక్టర్ దీనానాథ్, నీతి ఆయోగ్ డిప్యూటీ అడ్వైజర్ మానస్ చౌదరిలు మంగళవారం జిల్లాలోని సిద్దిపేట మండలం బక్రిచెప్యాల, నంగునూరు మండలం ముండ్రాయి, సిద్దన్నపేట గ్రామాల్లో పర్యటించారు. మే 3న కురిసిన వడగళ్ల వానతో నష్టపోయిన పంటల వివరాలను సేకరించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. సిద్దిపేట మండలం బక్రిచెప్యాల రైతు ఐలు మల్లయ్య మాట్లాడుతూ... ఎకరం విస్తీర్ణంలో వరి వేయగా అకాల వర్షానికి రెండు క్వింటాళ్ల ధాన్యమే చేతికందిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గోపాల్ అనే రైతు మాట్లాడుతూ మూడు ఎకరాలకు గాను ఎకరం విస్తీర్ణంలో వరి వేయగా 2 క్వింటాళ్లు మాత్రమే చేతికొచ్చిందన్నాడు. గతంలో ఎకరంలో 20 క్వింటాళ్ల ధాన్యం పండేదని తెలిపాడు. లింగయ్య అనే రైతు మాట్లాడుతూ.. ఐదు ఎకరాల్లో వరి పంట వేయగా మూడు క్వింటాళ్లు కూడా చేతికి రాలేదని వాపోయాడు. నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పది ఎకరాల్లో మామిడి తోట సాగు చేయగా సుమారు లక్షకుపైగా నష్టం వాటిల్లిందని బోరుమన్నాడు. బక్రిచెప్యాల గ్రామ వాసి స్వప్న మాట్లాడుతూ ఇటీవల కురిసిన వడగళ్ల వానకు తన ఇళ్లు పూర్తిగా ధ్వంసమైందని తెలిపింది. అధికారులు నష్టం వివరాలు సేకరించలేదని ఆమె బృందం సభ్యుల ఎదుట వాపోయింది. వారివెంట కలెక్టర్ రాహుల్ బొజ్జా, డీఆర్ఓ దయానంద్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఎంపీపీ ఎర్ర యాదయ్య, జేడీఏ హుక్యానాయక్, వెటర్నరీ జేడీఏ లక్ష్మారెడ్డి, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏడీఏహెచ్ అంజయ్య, ఎంపీడీఓ సమ్మిరెడ్డి, తహశీల్దార్ ఎన్‌వైగిరి, ఏఓ అనిల్‌కుమార్, సర్పంచ్ సూరం అనిత రవి తదితరులు ఉన్నారు. నంగునూరు మండలంలో.. నంగునూరు మండలం ముండ్రాయి, సిద్దన్నపేట గ్రామాల రైతులు సైతం తమ సమస్యలను కేంద్ర బృందానికి వివరించారు. ముండ్రాయికి చెందిన రైతు అంజిరెడ్డి, శనిగరం మల్లయ్య, సర్పంచ్‌లు బెదురు గిరిజ, చాట్లపల్లి రజిత మాట్లాడుతూ.. పంట చేతికొచ్చే దశలో వడగళ్లవాన కురవడంతో వరి గింజలు రాలి తీవ్ర నష్టం జరిగిందన్నారు. తమ ప్రాంతంలో కాలువలు లేనందున బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామన్నారు. యూరియా, విత్తనాలు, కూలీ ఖర్చులు కలిపి మొత్తం ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టినట్టు చెప్పారు. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, ధాన్యం అమ్ముకుంటే రవాణ ఖర్చులతోపాటు పెట్టుబడులు పోనూ రూ.10 వేలు మిగిలేవని బాధిత రైతులు బృందం సభ్యులకు వివరించారు. అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇళ్లు కూడా కూలిపోయాయని తమను ఆదుకోకుంటే అప్పుల్లో కూరుకుపోతామని వాపోయారు. కేంద్రం ఆదేశాల మేరకే పర్యటన.. అనంతరం సిద్దన్నపేటలో బృందం సభ్యుడు ఉత్పాల్ కుమార్‌సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్నట్టు తెలిపారు. నష్టం అంచనా వివరాలు సేకరించామని, త్వరలో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని చెప్పారు. వారి వెంట జేడీఏ హుక్యానాయక్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఉద్యాన అధికారి రామలక్ష్మి, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, నాయకులు దువ్వల మల్లయ్య, బి.తిరుపతి, రాజయ్య, రాజిరెడ్డి, కనకారెడ్డి పాల్గొన్నారు. -
డబ్బులివ్వండి...ఆడి వస్తాం!
భారత ఐస్ హాకీ జట్టు విజ్ఞప్తి న్యూఢిల్లీ : అంతర్జాతీయ మ్యాచ్ ఆడితే చాలు కనకవర్షం కురిసే క్రీడలున్న మన దేశంలో... ఒక టోర్నీలో పాల్గొనేందుకు జాతీయ జట్టు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తోంది. తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తోంది. వివరాల్లోకెళితే... భారత ఐస్ హాకీ జట్టు ఈ నెలాఖరులో కువైట్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్ (డివిజన్-1)కు అర్హత సాధించింది. అయితే ఆ టోర్నీలో పాల్గొనేందుకు అయ్యే మొత్తం జట్టు వద్ద లేదు. జట్టులో మొత్తం 26 మంది సభ్యులున్నారు. కనీస ఖర్చు రూ. 12 లక్షల వరకు అవుతుంది. ఆటగాళ్లంతా ఒక్కొక్కరు రూ. 20 వేలు చొప్పున వేసుకోగా...మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్, మరికొందరు సన్నిహితులు సహకరించడంతో ఈ మొత్తం రూ. 5 లక్షలకు చేరింది. అయితే జట్టుకు ఇంకా రూ. 7 లక్షలు కావాలి. దాంతో ఆటగాళ్లు భారత ఐస్ హాకీ వెబ్సైట్ ద్వారా తమకు సహాయం అందించమని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి టోర్నీ ఆడాలన్న వారి కోరిక ఎలా తీరుతుందో చూడాలి. -
నిలకడతోనే చోటు సుస్థిరం: రహానే
ధర్మశాల: జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలంటే బ్యాటింగ్‌లో మరింత నిలకడగా రాణించాలని భారత ఓపెనర్ అజింక్యా రహానే కోరుకుంటున్నాడు. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మల్చడంపై ప్రధానంగా దృష్టిపెట్టానన్నాడు. ‘నా ఆటలో కొన్ని అంశాలను మెరుగుపర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా. ఇందుకోసం ప్రాక్టీస్ సెషన్‌ను బాగా ఉపయోగించుకుంటా. చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటా. గత పర్యటనల నుంచి ఇప్పటి వరకు నేను గమనించింది ఒక్కటే... నిలకడగా ఆడటం చాలా ప్రధానమని. మెరుగైన ఆరంభం లభించినా వాటిని పెద్ద స్కోర్లుగా మల్చలేకపోయా. ఓపెనింగ్‌లో నేను భారీ స్కోరు చేస్తే అది జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. అందుకోసం మరింత నిలకడగా ఆడాలని భావిస్తున్నా’ అని ఈ ముంబై బ్యాట్స్‌మన్ పేర్కొన్నాడు. రిస్క్ షాట్లు లేకుండా క్రికెట్ ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. ‘సరైన క్రికెట్ షాట్స్ ఆడటం నాకు చాలా ఇష్టం. బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనింగ్‌కు చాలా ప్రధాన్యం ఉంటుంది. లక్ష్యాన్ని ఛేదించాలన్నా... నిర్దేశించాలన్నా ఇది చాలా ముఖ్యం. పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రతను పెంచుకుంటున్నా. జట్టులో ఓపెనింగ్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. నా బలానికి అనుగుణంగా ఆడమని ధోని చెప్పాడు. అప్పట్నించీ నా సొంత ఆటతీరుపై దృష్టిపెడుతున్నా’ అని రహానే వెల్లడించాడు. -
ఆసియా కప్ హాకీ టోర్నీకి సౌందర్య, రజని
న్యూఢిల్లీ: గాయం నుంచి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య జాతీయ జట్టులో పునరాగమనం చేసింది. ఈనెల 21 నుంచి 27 వరకు కౌలాలంపూర్‌లో జరిగే ఆసియా కప్ మహిళల టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులోకి ఆమె ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఎతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా జట్టులో కొనసాగనుంది. మొత్తం 18 మంది సభ్యులుగల భారత జట్టుకు రీతూ రాణి నాయకత్వం వహిస్తుంది. చన్చన్ దేవి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఆసియా టోర్నీలో గ్రూప్ ‘ఎ’లో భారత్‌తో పాటు చైనా, మలేసియా, హాంకాంగ్ ఉన్నాయి. గ్రూప్ ‘బి’లో దక్షిణ కొరియా, జపాన్, కజకిస్థాన్, చైనీస్ తైపీ జట్లు ఉన్నాయి. ఈనెల 21న హాంకాంగ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో భారత్ టోర్నీని ప్రారంభిస్తుంది. వచ్చే ఏడాది జరిగే మహిళల ప్రపంచకప్‌కు దీనిని అర్హత టోర్నీగా పరిగణిస్తున్నారు. -
చెలరేగిన రోహిత్ భరద్వాజ్
జింఖానా, న్యూస్‌లైన్: రోహిత్ భరద్వాజ్ (107) చెలరేగడంతో ఆక్స్ఫర్డ్ బ్లూస్ 182 పరుగుల తేడాతో నేషనల్ సీసీ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆక్స్ఫర్డ్ బ్లూస్ జట్టు 382 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన నేషనల్ జట్టు 200 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆక్స్ఫర్డ్ బ్లూస్ బౌలర్లు భరన్, సాయితేజ, భరత్, వికాస్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. మరో మ్యాచ్‌లో హైదరాబాద్ బ్లూస్ బౌలర్ పుష్కర్ (6/66) విజృంభించినప్పటికీ జట్టుకు విజయం దక్కలేదు. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ బ్లూస్ జట్టు 219 పరుగులు చేసింది. అభిషేక్ (74), యుధిష్ (80) రాణించారు. తర్వాత బరిలోకి దిగిన వీనస్ సైబర్ టెక్ జట్టు 222 పరుగులు చేసి నెగ్గింది. వంశీ రెడ్డి (84), కార్తీక్ (50) చక్కని ప్రదర్శన కనబరిచారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు జిందా సీసీ: 243, చార్మినార్: 247/5 (మిర్ ఒబేద్ అలీ 46, ముజీబ్ 35 నాటౌట్, ప్రసాద్ 128 నాటౌట్; అవినాష్ 3/75). న్యూ బ్లూస్: 231, కేంబ్రిడ్జి ఎలెవన్: 235/9 (సయ్యద్ అలీ 30; ప్రకాశ్ 4/89) పాషా బీడీ: 201/8 (రహీమ్ 56, ఫిజాన్ 49; ప్రీతమ్ 5/40), రాజు సీసీ: 19/0; మ్యాచ్ డ్రా. -
యువ క్రికెటర్ల సత్తాకు పరీక్ష
ప్రిటోరియా: జాతీయ జట్టులో చోటు పదిలం చేసుకోవాలనుకుంటున్న భారత యువ ఆటగాళ్లకు ఓ మంచి అవకాశం లభించింది. దక్షిణాఫ్రికాలో బౌన్సీ పిచ్‌లపై చెలరేగితే జట్టులో దాదాపుగా చోటు ఖాయం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో పటిష్టమైన భారత్ ‘ఎ’ జట్టు నేడు (గురువారం) ఆస్ట్రేలియా ‘ఎ’తో తలపడనుంది. భారత సీనియర్ జట్టుకు ఆడిన సగం మంది ఆటగాళ్లు ప్రస్తుత టీమ్‌లో ఉన్నారు. చతేశ్వర్ పుజారా, రోహిత్, ధావన్, రైనా, హైదరాబాద్ బ్యాట్స్‌మన్ అంబటి తిరుపతి రాయుడులు భారీ స్కోర్లు సాధించి టీమిండియాలో చోటు ఖాయం చేసుకోవాలని భావిస్తున్నారు. జింబాబ్వే సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన పుజారా.. ఈ టోర్నీలో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికొస్తే ఈ టోర్నీలో కొత్త బౌలర్లను పరీక్షించే అవకాశం ఉంది. మహ్మద్ షమీ, జయదేవ్ ఉనాద్కట్లకు తోడుగా ఈశ్వర్ పాండే, సిద్ధార్థ్ కౌల్ తుది జట్టులో చోటు కోసం పోటీపడుతున్నారు. జమ్ము కాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్, జార్ఖండ్ స్పిన్నర్ షహబాజ్ నదీమ్‌లలో ఒక్కరికి చోటు దక్కొచ్చు. మరోవైపు తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన ఆసీస్ జట్టు మంచి ఊపుమీదుంది. ప్రొటీస్‌తో మ్యాచ్‌లో షాన్ మార్ష్ 137 బంతుల్లో 136 పరుగులు చేసి జట్టుకు చక్కని విజయాన్ని అందించాడు.మాక్స్వెల్, నీల్, భారత సంతతి బౌలర్ గురీందర్ సంధులు తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా పటిష్టమైన భారత బ్యాటింగ్ లైనప్‌కు నైపుణ్యం ఉన్న ఆసీస్ బౌలర్ల మధ్య పోరు రసవత్తరంగా జరగనుంది.