సిద్దిపేట రూరల్: ‘అయ్యా, మాకు మీరే దిక్కు.. అకాల వర్షాృతో పంటలను పోగొట్టుకున్నాం... అప్పుల పాలయ్యాం... ప్రభుత్వం ఆదుకోకపోతే రోడ్డున పడతాం.. మా పరిస్థితిని అర్థం చేసుకొని పరిహారమిచ్చి ఆదుకోండి’ అంటూ రైతులు కేంద్ర బృందం సభ్యులతో మొరపెట్టుకున్నారు. కేంద్ర బృందం సభ్యులైన సెంట్రల్ జాయింట్ సెక్రటరీ ఉత్పాల్ కుమార్‌సింగ్, సెంట్రల్ ౄయింట్ డెరైక్టర్ దీనానాథ్, నీతి ఆయోగ్ డిప్యూటీ అడ్వైజర్ మానస్ చౌదరిలు మంగళవారం జిల్లాలోని సిద్దిపేట మండలం బక్రిచెప్యాల, నంగునూరు మండలం ముండ్రాయి, సిద్దన్నపేట గ్రామాల్లో పర్యటించారు. మే 3న కురిసిన వడగళ్ల వానతో నష్టపోయిన పంటల వివరాలను సేకరించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
సిద్దిపేట మండలం బక్రిచెప్యాల రైతు ఐలు మల్లయ్య మాట్లాడుతూ... ఎకరం విస్తీర్ణంలో వరి వేయగా అకాల వర్షానికి రెండు క్వింటాళ్ల ధాన్యమే చేతికందిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గోపాల్ అనే రైతు మాట్లాడుతూ మూడు ఎకరాలకు గాను ఎకరం విస్తీర్ణంలో వరి వేయగా 2 క్వింటాళ్లు మాత్రమే చేతికొచ్చిందన్నాడు. గతంలో ఎకరంలో 20 క్వింటాళ్ల ధాన్యం పండేదని తెలిపాడు. లింగయ్య అనే రైతు మాట్లాడుతూ.. ఐదు ఎకరాల్లో వరి పంట వేయగా మూడు క్వింటాళ్లు కూడా చేతికి రాలేదని వాపోయాడు. నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పది ఎకరాల్లో మామిడి తోట సాగు చేయగా సుమారు లక్షకుపైగా నష్టం వాటిల్లిందని బోరుమన్నాడు.
బక్రిచెప్యాల గ్రామ వాసి స్వప్న మాట్లాడుతూ ఇటీవల కురిసిన వడగళ్ల వానకు తన ఇళ్లు పూర్తిగా ధ్వంసమైందని తెలిపింది. అధికారులు నష్టం వివరాలు సేకరించలేదని ఆమె బృందం సభ్యుల ఎదుట వాపోయింది. వారివెంట కలెక్టర్ రాహుల్ బొజ్జా, డీఆర్‌ఓ దయానంద్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఎంపీపీ ఎర్ర యాదయ్య, జేడీఏ హుక్యానాయక్, వెటర్నరీ జేడీఏ లక్ష్మారెడ్డి, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏడీఏహెచ్ అంజయ్య, ఎంపీడీఓ సమ్మిరెడ్డి, తహశీల్దార్ ఎన్‌వైగిరి, ఏఓ అనిల్‌కుమార్, సర్పంచ్ సూరం అనిత రవి తదితరులు ఉన్నారు.
నంగునూరు మండలంలో..
నంగునూరు మండలం ముండ్రాయి, సిద్దన్నపేట గ్రామాల రైతులు సైతం తమ సమస్యలను కేంద్ర బృందానికి వివరించారు. ముండ్రాయికి చెందిన రైతు అంజిరెడ్డి, శనిగరం మల్లయ్య, సర్పంచ్‌లు బెదురు గిరిజ, చాట్లపల్లి రజిత మాట్లాడుతూ.. పంట చేతికొచ్చే దశలో వడగళ్లవాన కురవడంతో వరి గింజలు రాలి తీవ్ర నష్టం జరిగిందన్నారు. తమ ప్రాంతంలో కాలువలు లేనందున బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామన్నారు. యూరియా, విత్తనాలు, కూలీ ఖర్చులు కలిపి మొత్తం ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టినట్టు చెప్పారు. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, ధాన్యం అమ్ముకుంటే రవాణ ఖర్చులతోపాటు పెట్టుబడులు పోనూ రూ.10 వేలు మిగిలేవని బాధిత రైతులు బృందం సభ్యులకు వివరించారు. అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇళ్లు కూడా కూలిపోయాయని తమను ఆదుకోకుంటే అప్పుల్లో కూరుకుపోతామని వాపోయారు.
కేంద్రం ఆదేశాల మేరకే పర్యటన..
అనంతరం సిద్దన్నపేటలో బృందం సభ్యుడు ఉత్పాల్ కుమార్‌సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్నట్టు తెలిపారు. నష్టం అంచనా వివరాలు సేకరించామని, త్వరలో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని చెప్పారు. వారి వెంట జేడీఏ హుక్యానాయక్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఉద్యాన అధికారి రామలక్ష్మి, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, నాయకులు దువ్వల మల్లయ్య, బి.తిరుపతి, రాజయ్య, రాజిరెడ్డి, కనకారెడ్డి పాల్గొన్నారు.
అయ్యా.. మీరే దిక్కు
Published Wed, May 27 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM
Advertisement
Advertisement