
న్యూఢిల్లీ: పేరుకు తగినట్లుగానే క్రికెటర్ గౌతం గంభీర్ వదనం ఎప్పుడూ గంభీరంగానే కనిపించేది. ఏ స్థాయి మ్యాచ్‌లోనైనా అతను మనసారా నవ్వడాన్ని దాదాపుగా ఎవరూ చూసి ఉండరు! ఇటీవలే రిటైర్ అయిన గంభీర్ దీనికి కారణాన్ని వెల్లడించాడు. జీవితంలో తనకు ఏదీ సునాయాసంగా దక్కలేదని, ప్రతీదాని కోసం శ్రమించాల్సి రావడంతో అదే తరహాలో ఉండటం అలవాటైందని అతను చెప్పాడు. ‘చాలా మంది నన్ను ఈ విషయం గురించి అడిగారు. కానీ దానికో నేపథ్యం ఉంది.
ప్రతీ ఒక్కరు హాయిగా నవ్వాలని, సరదాగా ఉండాలని భావిస్తారు. కానీ అండర్–12 స్థాయినుంచి జాతీయ జట్టులోకి వచ్చే వరకు నేను చాలా కష్టపడ్డాను. బాగా ఆడినా జట్టు నుంచి తప్పించిన రోజులు, ప్రతీసారి జట్టులో చోటు కోసం పోరాడాల్సి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. 2007 వరల్డ్‌కప్‌లో చోటు దక్కకపోయేసరికి నేను మరింత సీరియస్‌గా మారిపోయాను. బహుశా అదే నేను నవ్వకపోవడానికి, సరదాగా గడపకపోవటానికి కారణమైంది. ఐపీఎల్‌లో కూడా భారీ మొత్తానికి నన్ను తీసుకోవడం వల్ల తీవ్రమైన ఒత్తిడి ఉండేది. నాకు తగినంత స్వేచ్ఛ ఇచ్చినా, రెండు సార్లు టైటిల్ గెలిచినా ఆ ఒత్తిడి మాత్రం తగ్గలేదు. బహుశా షారుఖ్ కొంత తక్కువ మొత్తం ఇస్తే బాగుండేదేమో’ అని గంభీర్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment