IPL 2024, DC VS KKR: కేకేఆర్‌ తొలిసారి ఇలా..! | IPL 2024, DC vs KKR: KKR Won The First 3 Matches Of An IPL Season For The 1st Time | Sakshi
Sakshi News home page

IPL 2024, DC VS KKR: కేకేఆర్‌ తొలిసారి ఇలా..!

Published Thu, Apr 4 2024 1:05 PM | Last Updated on Thu, Apr 4 2024 1:16 PM

IPL 2024 DC VS KKR: KKR WON FIRST 3 MATCHES OF AN IPL SEASON FOR THE FIRST TIME - Sakshi

17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొలిసారి సీజన్‌ తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి రికార్డుల్లోకెక్కింది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌పై బంపర్‌ విక్టరీతో కేకేఆర్‌ ఈ ఘనత సాధించింది. గతంలో ఏ సీజన్‌లోనూ కేకేఆర్‌ సీజన్‌ తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించలేదు. ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్‌ హ్యాట్రిక్‌ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

కేకేఆర్‌..  సన్‌రైజర్స్‌, ఆర్సీబీ, ఢిల్లీపై వరుస విజయాలు సాధించి అజేయ జట్టుగా కొనసాగుతుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో 4 పరుగుల స్వల్ప తేడాతో బయటపడిన కేకేఆర్‌.. ఆతర్వాత ఆర్సీబీ (7 వికెట్ల తేడాతో), ఢిల్లీపై (106 పరుగుల తేడాతో) ఘన విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో అన్ని విభాగాల్లో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న కేకేఆర్‌.. ఆర్సీబీ, ఢిల్లీలను వారి సొంత మైదానాల్లో ఓడించి శభాష్‌ అనిపించుకుంది. ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్‌.. శ్రేయస్‌ అయ్యర్‌ సారధ్యంలో, గంభీర్‌ మెంటార్షిప్‌లో, చంద్రకాంత్‌ పండిట్‌ శిక్షణలో టైటిల్‌ రేసులో దూసుకుపోతుంది.

ఐపీఎల్‌ అరంగేట్రం నుంచి కొనసాగుతున్న కేకేఆర్‌.. రెండు సార్లు (2012, 2014) ఛాంపియన్‌గా, ఓ సారి రన్నరప్‌గా (2021) నిలిచింది. గౌతమ్‌ గంభీర్‌ (‍ప్రస్తుత మెంటార్‌) కేకేఆర్‌ను రెండుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. 2021 సీజన్‌లో కేకేఆర్‌ రన్నరప్‌గా నిలిచినప్పుడు ఆ జట్టుకు ఇయాన్‌ మోర్గాన్‌ నాయకత్వం వహించాడు. కేకేఆర్‌ ఛాంపియన్స్‌ లీగ్‌లోనూ ఓసారి రన్నరప్‌గా (2014) నిలిచింది. 

కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. సునీల్‌ నరైన్‌ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్‌ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్‌ (8 బంతుల్లో 26; ఫోర్‌, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్‌ ఇది రెండో అతి భారీ స్కోర్‌. ఇదే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్‌ చేసిన స్కోర్‌ (277/3) ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. 

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో​కి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసి, 106 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రిషబ్‌ పంత్‌ (55), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్‌ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్‌ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్‌, పోరెల్‌, అక్షర్‌ డకౌట్లయ్యారు. కేకేఆర్‌ బౌలర్లలో వైభవ్‌ అరోరా, వరుణ్‌ చక్రవర్తి అద్భుతంగా బౌల్‌ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్‌ 2, రసెల్‌, నరైన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement