ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ కొత్త హెడ్ కోచ్‌ను నియమించుకుంది. ప్రస్తుత కోచ్ ఆండీ ఫ్లవర్ కాంట్రాక్ట్ 2023 సీజన్‌తో ముగియడంతో, అతని స్థానాన్ని ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌తో భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం ఇవాళ (జులై 14) అధికారికంగా ప్రకటించింది. ఎల్‌ఎస్‌జీకి ఆండీ ఫ్లవర్ చేసిన సేవలను అభినందిస్తూ ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసిన మేనేజ్‌మెంట్.. కొత్త కోచ్ పేరును ప్రకటించింది. ఫ్లవర్ కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు సముఖత చూపని లక్నో మేనేజ్‌మెంట్.. మెంటార్‌గా గౌతమ్ గంభీర్ సేవలను మాత్రం ఎక్స్‌టెండ్ చేసింది. గంభీర్‌తో పాటు బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్‌ను, ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ను, అసిస్టెంట్ కోచ్‌గా విజయ్ దాహియాను కొనసాగించింది.
ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాల నేతృత్వంలో, ఆండీ ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్‌ఎస్‌జీ గత రెండు సీజన్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఓ పక్క తమతో పాటు ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఓ సీజన్‌లో విజేతగా, మరో సీజన్‌లో రన్నరప్‌గా నిలువడంతో ఎల్‌ఎస్‌జీ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే హెడ్ కోచ్‌ను మార్చింది. మున్ముందు ఈ జట్టులో భారీ మార్పులు ఉంటాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను కూడా తప్పించవచ్చని ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్-2024కు మరో ఏడాది సమయం ఉంది కాబట్టి, కెప్టెన్ మార్పు విషయంలో ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం ఎలాంటి ముందస్తు ప్రకటన చేయకపోవచ్చు.
లక్నో కొత్త కోచ్ విషయానికొస్తే.. 52 ఏళ్ల లాంగర్ ఆసీస్‌ను 2021 టీ20 వరల్డ్‌కప్ విజేతగా, బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్‌ను మూడుసార్లు ఛాంపియన్‌గా (కోచ్‌గా) నిలబెట్టాడు. కోచ్‌గా మంచి ట్రాక్ రికార్డు కలిగిన లాంగర్‌ను ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం ఏరికోరి ఎంచుకుంది. 1993-2007 మధ్యకాలంలో ఆసీస్ తరఫున 105 టెస్ట్‌లు 8 వన్డేలు ఆడిన లాంగర్.. సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. వన్డేల్లో పెద్దగా రాణించని లాంగర్ టెస్ట్‌ల్లో సత్తా చాటాడు. 182 ఇన్నింగ్స్‌ల్లో 23 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 45.3 సగటున 7696 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment