సరిహద్దుదాటొద్దు
సాక్షి, చెన్నై: జాలర్లకు కడలిలో సరిహద్దుల్ని సూచించే దిక్సూచి అందుబాటులోకి రానున్నది. కేంద్ర నౌకాయూన మంత్రిత్వ శాఖ నేతృత్వంలో నేవిగేషన్ టెలక్స్ నౌటెక్స్ సాంకేతిక కేంద్రాల ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా ముట్టం, కడలూరు జిల్లా పరింగి పేటల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఈ టెక్నాలజీ జాలర్లకు మార్గదర్శిగా నిలవబోతున్నది.
రాష్ట్రంలో పదమూడు సముద్ర తీర జిల్లాలు ఉన్నాయి. తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం నుంచి కన్యాకుమారి జిల్లా నీరోడి వరకు 1078 కి.మీ దూరం సముద్రం విస్తరించి ఉన్నది. ఈ తీరంలో 50 లక్షల కుటుంబాలు చేపల వేట వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. 15 వేల అతి పెద్ద పడవలు, 25 వేల ఫైబర్ పడవలు, మరెన్నో వేల మర పడవల ద్వారా జాలర్లు చేపల వేట కోసం కడలిలోకి నిత్యం వెళ్తూ వస్తున్నారు. కొన్ని పడవల్లో మాత్రం జీపీఎస్, రాడార్ సౌకర్యాలు ఉన్నాయి. మిగిలిన పడవల్లో ఈ సౌకర్యాలు శూన్యం. దీంతో చేపల వేటకు వెళ్లే జాలర్లు దేశ సరిహద్దుల్ని తరచూ దాటి వెళ్లిపోతున్నారు. దీంతో పొరుగున ఉన్న శ్రీలంక నావికాదళం వీరిని జైళ్లలోకి నెట్టేస్తోంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర నౌకాయన శాఖ మంత్రి జికే వాసన్ పరిష్కార మార్గాల్ని అన్వేషించారు. అధికారుల బృందంతో పరిశీలనలు, పరిశోధనలు జరిపి సరికొత్తగా నేవిగేషన్ టెలక్స్ నౌటెక్స్ విధానాన్ని పరిచయం చేయడానికి సిద్ధం అయ్యారు.
దిక్సూచీగా నౌటెక్స్ : జాలర్లు సరిహద్దులు దాటుతున్నా, ప్రకృతి వైపరీత్యాలు ఎదురవుతున్నా, ముందుగా జాలర్లకు సమాచారాన్ని చేర వేసే దిక్సూచిగా ఈ కొత్త విధానం ఆవిష్కరించనున్నారు. ముంబై, విశాఖ పట్నం ప్రధాన కేంద్రాలుగా ఈ నౌటెక్స్ సమాచార కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఏడు చోట్ల అనుబంధ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో రాష్ట్రానికి చోటు దక్కింది. కన్యాకుమారి జిల్లా ముట్టం, కడలూరు జిల్లా పరింగి పేటల్లో ఈ కేంద్రాలు కొలువు దీరబోతున్నాయి. ఈ కేంద్రాల నుంచి సముద్రంలో 250 వాటికన్ మైళ్ల దూరం వరకు సమాచారం చేర వేయడానికి వీలుంది. అదే విధంగా జాలర్లకు మెసేజ్ రిసీవర్ ఫోన్లను పంపిణీ చేయనున్నారు.
ఆ కేంద్రాల నుంచి తమిళంలో, ఆంగ్లంలోనూ ప్రతి 20 నిమిషాలకు ఓ మారు సమాచారం వస్తుంది. సముద్రంలో అలల తాకిడి, ప్రకృతి వైపరీత్యాల సమాచారంతో పాటుగా సరిహద్దు వివరాల్ని తెలియజేస్తారు. సరిహద్దుల్ని దాటిన పక్షంలో రిసీవర్ ఫోన్లకు హెచ్చరికల సమాచారం వెళ్తుంది. దీంతో జాలర్లు అప్రమత్తం అయ్యేందుకు వీలుంది. ఒక వేళ ఆ హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా సరిహద్దులు దాటే జాలర్లకు ఆయా కేంద్రాల ద్వారా జరిమానాలు విధించేందుకు సైతం కసరత్తులు చేస్తున్నారు.
పనులు వేగవంతం: ముట్టం, పరింగి పేట లైట్ హౌస్‌ల పరిధుల్లో ఈ కేంద్రాల పనులు వేగవంతం చేశారు. తొలుత చెన్నై లైట్ హౌస్ పరిధిలోనూ ఈ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించినా, ఆ హౌస్‌ను సందర్శకులకు అంకితం చేయడంతో ప్రయత్నాన్ని విరమించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జాలర్లకు మార్గదర్శిగా రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రాల పనులు చడీ చప్పుడు కాకుండా నౌకాయన శాఖ చేపట్టడం గమనార్హం. అటు ఆంధ్రా, ఇటు కేరళ సరిహద్దుల్ని, శ్రీలంక సరిహద్దుల వివరాలను పొందుపరిచే విధంగా ఈ సాంకేతిక నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆయా కేంద్రాల్లో కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్, సాంకేతిక టెక్నాలజీ పరికరాల్ని సిద్ధం చేసి పనులు వేగవంతం చేసి ఉన్నారు.
భద్రత ముఖ్యం: రాష్ట్ర జాలర్ల భద్రతను పరిగణనలోకి తీసుకుని ఇక్కడ రెండు కేంద్రాల ఏర్పాటుకు వాసన్ చర్యలు తీసుకున్నట్టు ఆ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రధానంగా శ్రీలంక దళాలు, జాలర్ల నుంచి రాష్ట్ర జాలర్లకు ఎలాంటి ప్రమాదం ఎదురు కాకూడదన్న ఉద్దేశంతో ఇక్కడి 15 వేల పడవలకు మొబైల్ ఫోన్ మెసేజ్ రిసీవర్లను ఇవ్వడానికి నిర్ణయించినట్టు వివరించారు. ఆయా ప్రాంతాల వారీగా వీటిని విభజించి ఇవ్వడం ద్వారా సముద్రంలో ఇతర జాలర్లతో సమాచారం బదాలాయింపులు చేసుకునేందుకు వీలుందన్నారు. కొత్త సంవత్సరంలోపు ఈ పనులు ముగించనున్నామన్నారు.
జనవరి చివరి వారంలో లేదా, ఫిబ్రవరి మొదటి వారంలో ఈ టెక్నాలజీ జాలర్లకు అందుబాటులోకి రాబోతున్నదని ఆ అధికారి పేర్కొన్నారు. ముట్టం, పరింగి పేట కేంద్రాల ద్వారా అటు ఆంధ్ర, ఇటు కేరళ సరిహద్దులు సూచించడంతో పాటు ప్రధానంగా శ్రీలంక సరిహద్దుల దారి దాపుల్లోకి తమిళ జాలర్లు వెళ్లకుండా ఉండే విధంగా ఈ టెక్నాలజీ సమాచార దిక్సూచీగా ఆవిష్కరించబోతోందన్నారు. రాష్ట్ర మత్స్యశాఖ అనుమతితో నడుస్తున్న పడవలకు రిసీవర్లు అందించేందుకు కసరత్తులు చేస్తున్నామన్నారు. కేవలం జాలర్లకే కాకుండా, భారత సరిహద్దులోకి వచ్చే నౌకల వివరాలు, వాటి కదలికల్ని పసిగట్టేందుకు ఈ టెక్నాలజీ ఎంతో దోహదం చేస్తుందన్నారు.