నరేంద్ర మోడీపై దాఖలైన పిల్‌పై రేపు విచారణ
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా దాఖలైన పిల్‌ను బుధవారం హైకోర్టులో విచారణకు రానుంది. ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ వివాదస్పద వ్యాఖ్యలు చేసాడనే ఆరోపణలపై ప్రజా ప్రయోజన వాజ్యం హైకోర్టులో దాఖలైంది. నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరానికి రాకుండా ఆదేశించాలని ఓ పిటిషనర్ పిల్లో పేర్కొన్నాడు. దీనికి సంబంధించి విచారణ రేపు హైకోర్టులో కొనసాగనుంది. ఎల్బీ స్టేడియంలో జరగనున్ననవభారత్ యువభేరీ సభకు నరేంద్ర మోడీ హాజరవుతున్న సంగతి తెలిసిందే.
ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నవభారత్ యువభేరీ సభపై యువత అనూహ్యమైన ఉత్సుకత ప్రదర్శిస్తోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హాజరయ్యే వంద ర్యాలీల్లో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభ మొదటి కావడం విశేషం.
రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న నవభారత్ యువభేరీకి హాజరు కావడానికి ఇప్పటి వరకు లక్ష మందికిపైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీన ఈ సభ జరగనుంది. ఈ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆ సంఖ్య మరింత పెరుగుతుందని అంటున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారిలో 50 శాతం మందికి పైగా సభకు హాజరవుతారని అంటున్నారు.
ఇప్పటి వరకు సభకు రావడానికి పేర్లు నమోదు చేయించుకున్నవారిలో మూడొంతుల వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఉన్నారు. తర్వాత తెలంగాణ జిల్లాల నుంచి, సీమాంధ్ర ప్రాంతం నుంచి కూడా మోడీ సభకు వచ్చేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని బిజెపి నేతలు చెబుతున్నారు. మోడీ సభకు పేర్ల నమోదుకు హైదరాబాదులోని 20 ప్రధాన ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు.